జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడిపై దాడి
- BAGADI NARAYANARAO
- 3 days ago
- 2 min read
ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మాజీ సైనికాధికారి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావుపై ఆమదాలవలస పట్టణం పరిధిలోని పూజారిపేట వద్ద గల సువ్వారి గ్రాండ్ కన్వెన్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. ఈ దాడిపై ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో పూర్ణచంద్రరావు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఆమదాలవలసలోని ఏయూ జిమ్ ప్రతినిధి ఐజె నాయుడు కాలనీకి చెందిన కొందరు యువకులతో కలిసి కె.భానుప్రకాష్ దాడికి దిగినట్టు బాధితుడు పూర్ణచంద్రరావు తెలిపారు. శుక్రవారం పూజారిపేటలో ఉన్న సువ్వారి గ్రాండ్ కన్వెన్షన్‌లో ఒక ఫంక్షన్‌కు ఆయన భార్యతో కలిసి చిన్న కుమారుడు హాజరయ్యారైన సమయంలో కొంతమంది స్థానికంగా ఉన్న ఏయూ జిమ్ నుంచి వచ్చిన యువకులు కుమారుడిపై దాడి చేశారని తెలిపారు. దాడి జరిగినట్లు ఆయన కుమారుడు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళంలో ఉన్న తాను ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నట్టు తెలిపారు. పూర్ణచంద్రరావు ఫంక్షన్ హాల్‌కు చేరిన తర్వాత ఏయూ జిమ్ ప్రతినిధి కె.భానుప్రకాష్ దాడికి దిగినట్టు తెలిపారు. దీంతో ఆమదాలవలస సీఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చామని, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది తనతో పాటు కుమారుడ్ని స్టేషన్‌కు రావాలని సూచించడంతో తాము వెళ్లామని, అయితే దాడికి పాల్పడిన భానుప్రకాష్ స్టేషన్‌కు రాకుండా ఆమదాలవలస మున్సిపాలిటీ వైకాపా వార్డు మెంబర్ ద్వారా పోలీసులతో మాట్లాడిరచారని, భానుప్రకాష్‌కు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని సూచించినా రాలేదన్నారు. దీంతో పూర్ణ చంద్రరావు ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చేశారు. శనివారం ఉదయం రావాలని పోలీసులు సూచించడంతో పూర్ణచంద్రరావు హాజరయ్యారు. దాడికి పాల్పడిన ప్రకాష్‌తో పాటు మిగతా యువకుల తరఫున వైకాపా నాయకులు హాజరయ్యారని, పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నవారు హాజరుకావాలని సూచించడంతో బాధ్యుల తరఫున వచ్చిన నాయకులు వెనుదిరిగారని తెలిపారు. కటకం చిన్న కుమారుడు ఆరు నెలల క్రితం ఏయూ జిమ్ నుంచి వస్తున్న సమయంలో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పూర్ణచంద్రరావు చిన్న కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో పాటు బైక్ డ్యామేజీ అయింది. ఎదురుగా వచ్చిన బైక్ చోదకుడు ప్రకాష్ తన బైక్ డ్యామేజీ అయిందని, పరిహారం ఇవ్వాలని గాయాలపాలైన పూర్ణచంద్రరావు కుమారుడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బైక్‌కు ఎటువంటి నష్టం జరగకుండానే డబ్బులు డిమాండ్ చేయడంతో ప్రకాష్ కుటుంబ సభ్యులతో పూర్ణచంద్రరావు మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకున్నారు. అయితే ప్రకాష్ మాత్రం బైక్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పూర్ణచంద్రరావుకు సమాచారం ఇవ్వకుండా కుమారుడు రూ.8వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించినట్టు తెలిసింది. ఆతర్వాత ఒకసారి పూర్ణచంద్రరావు కుమారుడిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. కటకం కుమారుడు ఫంక్షన్‌కు వచ్చినట్టు తెలుసుకున్న ప్రకాష్ జిమ్‌లోని మరికొందరు యువకులతో కలిసి దాడికి దిగారని పూర్ణచంద్రరావు తెలిపారు. యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటుపడి దాడులకు దిగుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. దేశంలో యుద్ధ ఛాయలు అలముకున్న వేళ బాధ్యత గల పౌరుడిగా, మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా, స్టేట్ ఉపాధ్యక్షుడుగా ఉన్న తనపై దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ సైనికుడిగా యుద్ధంలో ముందు వరుసలో నిలబడేందుకు సిద్ధమవుతున్న తనలాంటి వ్యక్తి మీద దాడికి దిగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తూ భౌతిక దాడికి దిగినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దని పోలీసులకు విన్నవించారు.
Comments