top of page

జైళ్లలో మగ్గుతున్న సత్వర న్యాయం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 11, 2025
  • 2 min read

ఎంత కరడుగట్టిన నేరస్తుడినైనా విచారణ జరిపి, ఆధారాలు పరిశీలించి, అతడు నేరం చూసినట్లు నిర్ద్వంద్వంగా నిర్థారణ అయిన తర్వాతే అతన్ని నేరస్తుడిగా గుర్తించి, తగిన శిక్ష విధించాల్సి ఉంటుంది. ఈ సహజ న్యాయప్రక్రియ పూర్తి కానంతవరకు అతన్ని కేవలం నిందితుడిగానో అనుమానితుడిగానో పరిగణించాల్సి ఉంటుంది. ఇదే సహజ మానవహక్కు. మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ హక్కునకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అలాగే సత్వర న్యాయం పొందడం కూడా పౌరుల హక్కే. ఈ క్రమంలో తమ కేసుల విచారణకు సొంతంగా న్యాయవాదిని నియమించుకోలేనివారికి తగిన న్యాయ సహాయం కూడా అందించడం మన న్యాయ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. దీన్నే ఫెయిర్‌ ట్రయల్‌ ప్రొగ్రాం అంటారు. న్యాయవ్యవస్థలో ఇన్ని అవకాశాలు ఉన్నా ఇప్పటికీ లక్షలాది మంది సత్వర న్యాయం, న్యాయ సహాయం అందక బెయిల్‌ కూడా లభించక, విచారణ ఖైదీలు(అండర్‌ ట్రయల్‌) గానే రిమాండ్‌లో మగ్గిపోతున్నారు. ఇది సహజ న్యాయాన్ని తిరస్కరించినట్లేనన్న అభిప్రాయాలను న్యాయకోవిదులు వ్యక్తం చేస్తున్నారు. నల్సార్‌ యూనివర్సిటీకి చెందిన ఫెయిర్‌ ట్రయల్‌ ప్రొగ్రామ్‌(ఎఫ్‌టీపీ) నివేదికలు కూడా గణాంకాలతో సహా ఈ చేదు వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. సత్వర న్యాయం దొరక్కపోవడం అన్యాయం.. న్యాయసాయం అందకపోవడం మరింత అన్యాయం.. విచారణకే నోచుకోని నిర్బంధం ఘోర అన్యాయం. ఇందుకు బాధ్యత వహించి, పరిష్కారాలు కనుగొని అమలు చేయాల్సిన న్యాయవ్యవస్థకు ఇది ఏమాత్రం పట్టకపోవడం తీవ్ర అన్యాయం. ఎఫ్‌టీపీ నివేదిక మన న్యాయవ్యవస్థ డొల్లతనాన్ని, లక్షలాది విచారణ ఖైదీలు, నిందితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది. ఈ దుస్థితిని కళ్లకు కట్టే ఒకే ఉదాహరణ చూద్దాం. సత్వర న్యాయం అందడంలో ఆలస్యమై విలువైన జీవితాలను రిమాండ్‌ కొట్లలోనే కోల్పోతున్న వందలాది మందిలో 36 ఏళ్ల ఒక మహిళ కూడా ఉన్నారు. 2017లో తన ఇద్దరు పిల్లలను హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఐదేళ్లకు పైగా జైలులో గడిపింది. బాల్యంలోనే వివాహమై జీవితాంతం గృహహింస ఎదుర్కొన్న ఆమె తాను చేయని నేరానికి జైలుపాలైంది. కుటుంబానికి కూడా దూరమైంది. చివరకు 2022లో నల్సార్‌ యూనివర్సిటీలోని స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ బృందం సహాయంతో ఆమె బెయిల్‌ పొందగలిగింది. ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒక క్లినిక్‌లో రోగులకు సహాయం చేస్తూ ఆశ్రయం పొందుతోంది. మనదేశంలోని జైళ్లలో ఉన్న వారిలో 70 శాతానికి పైగా మంది ఇంకా విచారణ ఎదుర్కొంటున్న రిమాండ్‌ ఖైదీలే. దోషులుగా నిర్ధారణ కాకముందే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతుండటం, వీరిలో అత్యధికులకు ఉచిత న్యాయ సహాయం (లీగల్‌ ఎయిడ్‌) హక్కు గురించి కూడా తెలియకపోవడం విచారకరం. ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వేరెవరో చెప్పలేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నల్సార్‌ యూనివర్సిటీకి చెందిన ఫెయిర్‌ ట్రయల్‌ ప్రొగ్రామ్‌ నివేదిక విడుదల సందర్భంగా వెల్లడిరచారు. 74 శాతం మంది అండర్‌ ట్రయల్స్‌లో కేవలం 7.91 శాతం మంది మాత్రమే అందుబాటులో ఉన్న న్యాయ సహాయాన్ని వినియోగించుకున్నారని న్యాయమూర్తి తెలిపారు. అండర్‌ ట్రయల్స్‌ విచారణ పేరుతో జైలులో గడిపే సమయం.. చాలా సందర్భాల్లో వారు ఎదుర్కొంటున్న నేర అభియోగాలకు విధించే గరిష్ట శిక్ష కంటే ఎక్కువగా ఉంటున్నందని జస్టిస్‌ నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నల్సార్‌ స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో 2019 నుంచి 2024 వరకు నిర్వహించిన ఫెయిర్‌ ట్రయల్‌ ప్రొగ్రామ్‌ కు సంబంధించిన నివేదికలో పొందుపర్చిన పలు అంశాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో ఎఫ్‌టీపీ చేపట్టిన 5,783 కేసుల్లో ఏకంగా 41.3 శాతం మంది న్యాయసహాయం అందనివారే. విచారణలో వీరి తరఫున వాదించేందుకు న్యాయవాదులను నియమించడంలో న్యాయస్థానాలు విఫలమయ్యాయి. మరోవైపు 51 శాతం మంది రిమాండ్‌ ఖైదీల వద్ద విచారణను కొనసాగించడానికి అవసరమైన పత్రాలు లేవని తేలింది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే.. ఈ ప్రోగ్రామ్‌ పరిధిలోకి వచ్చిన అండర్‌ ట్రయల్‌ ఖైదీల్లో 67.6 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారే. అలాగే 79.8 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేసే పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. మరోవైపు 58 శాతం మంది విచారణ ఖైదీలు కనీసం ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. ఎఫ్‌టీపీ క్లినిక్‌ ఐదేళ్లలో మొత్తం 1,834 కేసుల్లో నిందితుల తరఫున బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసింది. 777 కేసులను పరిష్కరించింది. మొత్తం 2,542 కేసుల్లో 1,388 మంది నిందితులు రిమాండ్‌ నుంచి విడుదలయ్యారు. ఈ ఉదంతాలు, గణాంకాలు సహజ, సత్వర న్యాయం అందించే విషయంలో సంస్కరణలు చేయాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెబుతున్నాయి. నివేదికలోని ఈ అంశాలపై స్పందించిన జస్టిస్‌ నాథ్‌ కూడా తక్షణ సంస్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు బెయిల్‌ దరఖాస్తులను యాంత్రికంగా దాఖలు చేయడం, నిందితులు సమర్పించలేని పత్రాలు లేదా పూచీకత్తులు కోరడం వంటి లోపాలను ఎత్తిచూపారు. ‘నిందితులు బెయిల్‌ ఖర్చులు భరించలేక, పూచీకత్తులు దొరక్క మళ్లీ మొదటికే వస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉచిత న్యాయ సహాయం అనేది కాగితాల్లో మగ్గిపోవాల్సిన హక్కు కాదని, పేద, అట్టడుగువర్గాలకు దీనిపై అవగాహన కల్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన ప్రాథమిక అవసరాన్ని న్యాయవ్యవస్థతోపాటు ప్రభుత్వాలు కూడా గుర్తించాలి.

ఎడిటోరియల్‌ కామెంట్‌ సెక్షన్‌లో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page