జగన్‌ను అలా వదిలేయడం బెటర్..!
- Prasad Satyam
- Oct 10
- 3 min read
సమగ్ర కథనం కామెంట్ సెక్షన్‌లో..
జగన్‌ను అలా వదిలేయడం బెటర్..!
ఏ పార్టీ నిర్బంధించినా వారికే నష్టం
జనంతో విడదీయడం కష్టం
కూటమి ఎంత బిగిస్తే.. జగన్ అంత బలపడతారు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్లే విధానంపై అధికార ప్రభుత్వాలు కట్టడి ఎక్కువ చేసేకొద్దీ జగన్ పర్యటనలు సక్సెస్ అవుతుంటాయి. సహజంగానే జగన్ క్రౌడ్‌పుల్లర్. సిద్ధం లాంటి సభలను పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి రోడ్డెక్కుతున్నారంటే జనాలకు వచ్చే జోష్ మామూలుగా ఉండదు. అటువంటి నాయకుడ్ని కట్టడి చేయడం ప్రభుత్వాలకే నష్టం. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేసిన తర్వాతే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే సంకేతాలు వచ్చినా చంద్రబాబు ఆ దిశగా ఆలోచించకపోవడానికి కారణం ఆయన రాజకీయానుభవమే. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం నుంచి జగన్‌ను విడదీయడం కష్టం. జగన్ లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పుస్తకం ప్రచురించినప్పటికీ జనం దాన్ని నమ్మలేదు. తాము చేసిన ఆరోపణలు నిజమేనని సీబీఐ నిర్ధారించింది కాబట్టే జైలులో పెట్టిందని అప్పటి పార్టీలు చెప్పుకున్నా ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోటస్‌పాండ్‌లో ఉన్న ఇంటికి వెళ్లడానికి ఎంత సమయం పట్టిందో లైవ్ టెలీకాస్ట్‌లో చూశాం. జగన్ అవినీతిపరుడని, ఫ్యాక్షనిస్టని.. ఇలా ఎన్ని కోణాల్లో ఆయన్ను కార్నర్ చేసినా ఆయన మాత్రం క్రౌడ్‌పుల్లరేనని నర్సీపట్నం పర్యటన రుజువు చేసింది. పల్నాడు, రాయలసీమ, నెల్లూరు పర్యటనలకు వెళ్లినప్పుడు ఆంక్షలు పెట్టినా ఫలితం దక్కలేదని కూటమి ప్రభుత్వం గ్రహించాలి. స్వయంగా జగన్మోహన్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఒక వృద్ధుడు ఆయన వాహనం కింద పడి మరణించాడని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిబేట్ జరిగినా జగన్‌ను చూడ్డానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ గాని, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కూటమి గాని జగన్ మీద చేసిన ఆరోపణలను నమ్మినా, నమ్మకపోయినా జగన్‌ను చూడ్డానికి మాత్రం జనసందోహం ఆగడంలేదు. తాజాగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని చూడ్డానికి వెళ్లిన జగన్మోహన్‌రెడ్డిని అడ్డుకోడానికి అధికార పార్టీ చేయని ప్రయోగం లేదు. దీనివల్ల నష్టమే తప్ప లాభం కనిపించడంలేదు. పోలీసుల ఆంక్షలు జగన్‌ను ఆపలేవని మరోసారి రుజువైంది. ఆంక్షలు విధించేకొద్దీ వైకాపా శ్రేణులు, కేడర్ కసిగా పనిచేసేలా కనిపిస్తున్నారు. వైకాపా కేడర్ కూడా ఎప్పుడూ లేనివిధంగా యాక్టివేట్ అయింది. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమిని ప్రతిపక్ష హోదా లేకుండా అడ్డుకోవడం ఎలా అని భావిస్తున్న సమయంలో కాగల కార్యాన్ని చంద్రబాబే తీర్చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను చేర్చి జగన్మోహన్‌రెడ్డి చేతికి ఆయుధాన్నిచ్చారు. ఈ మూడు ‘పీ’ల విధానం వల్ల మెడికల్ విద్యార్థులకే మేలని కూటమి నేతలు అరిచి గీపెడుతున్నా ఎవరూ నమ్మడంలేదు. సహజంగానే చంద్రబాబు ఎవరేమనుకున్నా తాననుకున్నదే చేస్తారు కాబట్టి దీనిపై ఉద్యమం చేసుకోడానికి జగన్మోహన్‌రెడ్డిని స్వేచ్ఛగా విడిచిపెట్టడమే బెటర్. లేదూ అంటే ఇప్పటికే మాస్‌లో పెద్ద బేస్ ఉన్న జగన్మోహన్‌రెడ్డి 2029 ఎన్నికల నాటికి మరింత మాస్‌లీడర్‌గా ఎదుగుతారు. జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లి తిరుగుతూవుంటే 50వ సారి, 60వ సారి అంటూ ఎంత విమర్శిస్తే అధికార కూటమికి అంత నష్టం. జగన్ ఇంటికి ఎన్నిసార్లు వెళ్లినా దాని వల్ల జనానికి వచ్చిన నష్టం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకుడ్ని అడ్డుకున్నా, అది అధికార పార్టీకి నష్టం తప్పితే లాభం చేకూర్చిన దాఖలాలు లేవు. జగన్ గతంలో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు టీడీపీ అనుసరిస్తుంది. జగన్ ఇమేజీ మరోసారి కూటమే దగ్గరుండి భారీగా పెంచబోతోంది.
వైకాపా హయాంలో రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ కాలేజీలు మంజూరు చేసింది. వీటిలో ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా మొదలయ్యాయి. కొన్ని కాలేజీలు నిర్మాణాలు పూర్తిచేసుకోగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పీపీపీ పద్ధతిలో ఈ కాలేజీని పూర్తిచేస్తామని ప్రకటించింది. ఇందులో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం వైద్యకళాశాల సందర్శనకు గురువారం జగన్మోహన్‌రెడ్డి వచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన జగన్మోహన్‌రెడ్డి ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం జంక్షన్లలో జనాల నుంచి బయటపడటానికి గంటల సమయం పట్టింది. జగన్ వాహనాన్ని ముందుకు కదలకుండా సీఎం అంటూ నినాదాలు చేయడం ఈపాటికే కూటమి నేతలకు అర్థమైవుండాలి. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకోవాలి. కానీ 4.30 గంటలకు చేరుకున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన పెట్టుకోవడం వెనుక మరి రెండు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి ఎన్నికల ముందు ప్రకటించింది. కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, తమ ఉద్యోగాలు ఇప్పటికే పోయాయని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ వినతిపత్రాలు ఇచ్చారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా జగన్‌కు వినతులందాయి. ఇది కాకుండా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మరణించడం, ఐదుగురు కేజీహెచ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుండటంతో జగన్ అక్కడికీ వెళ్లారు. వాస్తవానికి ఈ మూడు అంశాలనూ ప్రధాన మీడియా తక్కువగా చూపిస్తూ వచ్చింది. కురుపాం ఘటనలో 166 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే, అందులో ఇద్దరు చనిపోతే, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంటే లోకల్ ఎడిషన్‌లో తప్ప మెయిన్‌లో వార్త కనపడలేదు. స్టీల్‌ప్లాంట్ కోసమైతే పత్రికలు రాయడం మానేశాయి. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అటువైపు చూడటం వల్ల రాష్ట్రం అటెన్షన్ మార్చినట్టయింది. జగన్మోహన్‌రెడ్డి నర్సీపట్నం వెళ్లడానికి రోడ్డు మీదుగా అవకాశం ఇచ్చివుంటే కేజీహెచ్‌లు, స్టీల్‌ప్లాంట్ గొడవ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఆయన్ను కట్టడి చేయడం వల్లే ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో లోపాలన్నట్టు ఎస్టాబ్లిష్ అయ్యాయి.










Comments