జనం చెంతకు జగన్నాథుడు
- DV RAMANA

- Jun 27, 2025
- 2 min read
వైభవంగా జగన్నాథ రథయాత్ర
పూరీ క్షేత్రాన్ని తాకిన భక్తజన కెరటం
కుంభమేళా తర్వాత అంతపెద్ద ఆధ్యాత్మిక వేడుక
కృష్ణావతారానికి కొనసాగింపు జగన్నాథుడని నమ్మిక

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
హిందువులు అతిపవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే నాలుగు ధామాల్లో(చార్‌ధామ్) ఒడిశాలోని పూరీ క్షేత్రం ఒకటి. ప్రతిరోజూ ఈ క్షేత్రాన్ని వేలసంఖ్యలో దేశవిదేశాల భక్తులు సందర్శిస్తుంటారు. అంతేకాకుండా ఏడాదికోసారి ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర విశ్వవిఖ్యాతి పొందింది. మహాకుంభమేళా తర్వాత అంత భారీస్థాయిలో అంటే లక్షల్లో రథయాత్ర ఒక్కరోజే పూరీ క్షేత్రాన్ని భక్తజనం పోటెత్తుతారు. ప్రాచీన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి దాదాపు ఐదువేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటినుంచీ నిరంతరాయంగా ఇక్కడ రథయాత్ర జరుగుతోంది. రథయాత్ర మన దేశంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాధారణంగా భక్తులే దేవుడి చెంతకు వెళ్లి దర్శించుకోవడం సంప్రదాయం. కానీ ఈ క్షేత్రంలో కొలువైన జగన్నాథ, బలభద్ర, సుభద్రలే స్వయంగా భక్తజనుల మధ్యలోకి వచ్చి దర్శనభాగ్యం కలిగించడమే ఈ రథయాత్ర విశేషం. ఇది చూడటానికి హిందూ మత ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా అంతర్లీనంగా సమాజంలో సమానత్వం, ఐక్యత అనే సందేశాన్ని ఇస్తుంది. ఏ కులం, మతం, వర్గానికి చెందినవారైనా రథయాత్రలో పాల్గొనవచ్చు. స్వామి రథాలు బయలుదేరడానికి ముందు చెరా పొహరా పేరుతో వాటిముందు స్వయంగా పూరీ మహారాజే బంగారు చీపురుతో రథం ముందుభాగానిన ఊడ్చి శుభ్రం చేస్తారు. దేవుడి ముందు అందరూ సమానమే అనే భావనను ఇది ప్రస్ఫుటం చేస్తుంది. అంతటి విశిష్టమైన రథయాత్ర ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభం కావడం ఆనవాయితీ. ఆ ప్రకారం ఈ ఏడాది రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు పూరీకి చేరుకున్నారు. తెల్లవారు జామునే ఆలయంలో ప్రారంభమైన ప్రత్యేక పూజలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా రూపొందించిన రథాల్లో అధిష్టింపజేస్తారు. ఆ వెంటనే రథయాత్ర కొనసాగి గుండిచా మందిరం వరకు సాగుతుంది. అక్కడ పది రోజుల భక్తుల పూజలు అందుకున్న తర్వాత దేవదేవుడు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటాడు. దీన్నే మారు రథయాత్ర అంటారు.
సాక్షాత్తు కృష్ణపరమాత్మే
పేరు వేరైనా జగన్నాథస్వామిని సాక్షాత్తు కృష్ణ పరమాత్మగానే భావిస్తారు. దశావతారాల్లో భాగంగా శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం ఎత్తుతాడు. దుష్టశిక్షణ అనంతరం అడవిలో ఓ చెట్టు కింద శయనించి కాలు మీద కాలు వేసుకుని పిల్లనగ్రోవి ఊదూతూ తదాత్మ్యం చెందుతున్న కృష్ణుడి కాలి బొటనవేలును దూరం నుంచి చూసిన ఓ బోయవాడు దాన్ని ఒక జంతువుగా భ్రమించి బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి బొటన వేలికి తగులుతుంది. అందులోనే ఉన్న అతని ప్రాణాలు పోవడానికి అది కారణమవుతుంది. దాంతో కృష్ణుడు నిర్యాణం చెందాడని, కృష్ణావరం పరిసమాప్తమైందని, అక్కడితో ద్వాపరయుగం కూడా ముగిసి కలియుగం ప్రారంభమైందని అంటారు. కానీ కృష్ణుడు భౌతికంగా నిర్యాణం చెందినా.. అతని ఆత్మ మాత్రం భూమిపైనే ఉండిపోయిందని, అది ఒక చెట్టుకు చెందిన కలప మొద్దులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. సుమారు ఐదువేల ఏళ్ల క్రితం పూరీ పాలకుడైన ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఇదే విషయం చెప్పి ఆ కలప మొద్దు సముద్ర ప్రవాహంలో కొట్టుకుపోతోందని, దాన్ని తీసుకొచ్చి తనకు పూజలు చేయాలని సూచించాడట. దైవాజ్ఞ ప్రకారం ఇంద్రద్యుమ్నుడు సముద్రంలో తన సిబ్బందితో గాలించి భారీ దుంగను స్వాధీనం చేసుకుని, దాన్ని విగ్రహాలుగా మలచి, ఆలయం నిర్మించి, పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఈ యుగంలో స్వామి జగన్నాథుడిగా సేవలు అందుకుంటున్నా, కృష్ణావతారంలో అతని అన్న అయిన బలరాముడు సుమారుగా అదే పేరుతో బలభద్రుడిగా, సోదరి సుభద్ర పూర్తిగా అదే పేరుతో భక్తులకు దర్శనం ఇస్తుండటం శ్రీకృష్ణుడే జగన్నాథుడన్న వాదనను బలపరుస్తోంది.
రథాలను లాగే తాళ్లకు పేర్లు
రథయాత్ర రోజు జగన్నాథుడు 16 చక్రాలు కలిగిన నందిఘోష్ అనే రథంలోనూ, బలభద్రుడు 14 చక్రాలు కలిగిన తాళధ్వజ్ అనే రథంలో, సుభద్ర 12 చక్రాలు కలిగిన దేవుదళ అనే రథంలో ఆశీనులై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. రథయాత్ర సందర్భంగా ఈ రథాలను లాగడానికి, అందుకు వీలుగా వాటికి కట్టిన తాళ్లను పట్టుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడతారు. విశేషమేమిటంటే రథాలకు ఉన్నట్లే.. వాటిని లాగేందుకు ఉపయోగించే తాళ్లకు కూడా ప్రత్యేక పేర్లు ఉన్నాయి. జగన్నాథుడి రథాన్ని లాగే తాడును శంఖచూడుడు అని వ్యవహరిస్తారు. బలభద్రుడి రథాన్ని లాగే తాడును వసూలి అని, మధ్యలో ఉండే సుభద్ర రథాన్ని లాగే తాడును స్వర్ణచూడ అని వ్యవహరిస్తారు. రథయాత్ర సందర్భంగా ఈ తాళ్లను పట్టుకుని రథాలను లాగడానికి భక్తులు పోటీ పడతారు. ఈ తాళ్లను తాకి కాసేపైనా రథాన్ని లాగడంలో పాలుపంచుకుంటే జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని ప్రతీతి. కుల, మత, వర్గం అన్న తారతమ్యం లేకుండా ఎవరైనా ఈ తాళ్లను పట్టుకోవచ్చు రథాలను లాగవచ్చు.










Comments