జనసేనకు జవసత్వం ‘పిసిని’
- BAGADI NARAYANARAO

- Sep 2, 2025
- 2 min read
పార్టీ భావజాలాన్ని గ్రామాలకు చేరుస్తున్న చంద్రమోహన్
తూర్పుకాపులను పార్టీకి అనుసంధానించిన నాయకుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జనసేన పార్టీకి జిల్లాలో జవసత్వం పిసిని చంద్రమోహన్. అదేంటీ.. ఆ పార్టీలో మొదట్నుంచీ చాలామంది పవన్‌కళ్యాణ్ అభిమానులున్నారు కదా.. అంటే అందుకూ ఒక లెక్కుంది. అభిమానం వేరు.. పార్టీని, దాని భావజాలాన్ని అట్టడుగు ప్రాంతాలకు చేర్చడం వేరు. చంద్రమోహన్‌లో ఆ పార్టీ ఏం చూసిందో తెలియదు గానీ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగే పిసినిని జనసేన అధ్యక్షుడ్ని చేసింది. ఆయనకు ఈ పదవి రావడం కాపు కోటాలోనే అయినప్పటికీ పార్టీని జిల్లాలో బలోపేతం చేయడం కోసం ఆయన ఎడతెరిపి లేకుండా పని చేస్తున్నారు. అభిమానాన్ని, భావోద్వేగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొణెదల కుటుంబంలో ఉన్న మిగిలిన హీరోల ఫ్యాన్స్‌ను సమన్వయపర్చుకుంటూ కూటమిలో ఉన్న మరో రెండు పార్టీల నేతలతో సఖ్యత పాటిస్తూ జనసేనకు ఒక గుర్తింపును తీసుకువస్తున్నారు. పవన్‌కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ ఉండగా, చంద్రమోహన్ లాంటి వారికి ఇంతటి ఉపోద్ఘాతం అవసరమా అనిపించొచ్చు. కానీ ఆ భావజాలాన్ని తీసుకువెళ్లడమే రాజకీయాల్లో కష్టతరమైన పని. దీన్ని కచ్చితత్వంతో చేస్తున్నది చంద్రమోహన్.

తూర్పుకాపులకు నాయకత్వం వహించి, వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న సమయంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణెదల పవన్‌కళ్యాణ్ పిలుపుతో 2022లో చేరారు. జర్నలిస్టుగా పనిచేస్తూ తూర్పుకాపు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చంద్రమోహన్ మొదటి నుంచి కొణెదల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతూ వచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలతో భీమవరం వేదికగా జనసేనాని నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే జనసేన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించి 2023 తెలంగాణ ఎన్నికలకు ఆ పార్టీ పరిశీలకులుగా చంద్రమోహన్‌ను నియమించారు. అనంతరం పార్టీలో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న చంద్రమోహన్ పనితీరును మెచ్చుకొని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులుగా సార్వత్రిక ఎన్నికలకు ముందు 2023లోనే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు కాపులందరినీ చైతన్యపరిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ కలుపుకొని రాష్ట్రానికి నూతన రాజకీయ వ్యవస్థ కావాలని తిరిగారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనసేనను గ్రామస్థాయిలో బలోపేతానికి కంకణం కట్టుకొని జెండాపండగ పేరుతో గ్రామాల్లో జనసేన జెండా ఆవిష్కరణ చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత నెల 28,29,30 తేదీల్లో విశాఖ వేదికగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్వహించిన జనసేన క్షేత్రస్థాయి నాయకులు, క్రియాశీలక వాలంటీర్లు సమావేశంలో చంద్రమోహన్‌ను పనితీరును మెచ్చుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్‌తో ప్రశంసలు పొందారు. విశాఖలో నిర్వహించిన సమావేశ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల్ వ్యూహాంతో దసరా నుంచి పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు తీసుకొని పవన్ ఆదేశాలకు అనుగుణంగా పని చేయడానికి చంద్రమోహన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేనలోని అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడంలో తనదైన స్థాయిలో కృషి చేస్తున్నారు. ఒకవైపు జనసేనను బలోపేతం చేస్తూనే తూర్పుకాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నడిపిస్తున్నారు. తూర్పు కాపుల ఉద్యమాన్ని జనసేనకు అనుసంధానం చేస్తూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్న నేపధ్యంలో జనసేన కార్యకర్తలు వారి వారి స్థాయిల్లో పార్టీ ద్వారా గుర్తించడానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యే, సుడా చైర్మన్, నియోజకవర్గం ఇన్‌చార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తూర్పుకాపులను అన్నివిధాల ముందుకు తీసుకువెళ్లడానికి తనదైన శైలిలో చంద్రమోహన్ కృషి చేస్తున్నారు. కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని జనసేనను జిల్లాలో బలోపేతం చేయడంపై పార్టీలోని నాయకులతో కలిసి ముందుకు వెళుతున్నారు. కులాలతో ముడిపెట్టకుండా జనసేనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న పిసిని చంద్రమోహన్ పార్టీలో అందరి మన్ననలను పొందుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా, ప్రోత్సాహంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.











Comments