జనసేనలో ‘మార్కెట్’ జగడం!
- NVS PRASAD

- Jul 18
- 2 min read
వైకాపా సన్నిహిత కుటంబానికి అప్పనంగా పదవి
అసంతృప్తితో రగిలిపోతున్న జనసైనికులు, వీర మహిళలు
తొలి నుంచి కష్టపడిన వారికి అన్యాయం చేశారని విమర్శలు
ఆందోళనలతో అధిష్టానానికి నిరసన తెలపాలని నిర్ణయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేన పార్టీలో చిచ్చు రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను గురువారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీయే కూటమి మధ్య పదవులు పంపకంలో భాగంగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీని జనసేనకు కేటాయించి ఛైర్‌పర్సన్ పేరు ప్రకటించారు. జిల్లాలో నాలుగు మార్కెట్ కమిటీలకు అధ్యక్షులను ప్రకటించగా.. వాటిలో శ్రీకాకుళంతోసహా రెండు జనసేనకు, రెండు టీడీపీకి కేటాయించారు. అయితే ప్రస్తుతం జనసేనలో రేగిన మంటలకు ఈ కేటాయింపులు కారణం కాదు. ఏ పార్టీకి పదవి ఇచ్చినా కష్టపడి పనిచేసేవారికి ఇవ్వాలి గానీ.. వైకాపాతో అంటకాగుతున్నవారికి పదవులు ఇవ్వడం ఏమిటని జనసైనికులు, వీర మహిళలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా నగరానికి చెందిన మామిడి విష్ణు సతీమణి దారపు జ్యోత్స్నను నియమించినట్లు గురువారం రాత్రి ప్రకటన వచ్చినప్పటినుంచీ జనసేన గ్రూపుల్లో రాత్రి తెల్లవార్లూ వాట్సప్‌లో ఇదే చర్చ జరిగింది. చివరకు పార్టీ అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేయడానికి శాంతియుత మార్గంలో పార్టీ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించడానికి నిర్ణయించుకున్నారు. జనసేనకు చెందిన జ్యోత్స్నకు పదవిస్తే జనసైనికులే అడ్డు చెప్పడమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడిన వారికి కాకుండా..

దారపు జ్యోత్స్న భర్త మామిడి విష్ణు గత ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందు వరకు వైకాపాలో కొనసాగారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అప్పట్లో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మామిడి శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు. 2024లో వైకాపా అధికారంలోకి రాదనే వాతావరణం కనిపించడంతో చివరి నిమిషంలో ఆయన వైకాపా నుంచి జనసేనలోకి ఫిరాయించారు. పోనీ చేరిన తర్వాతైనా కూటమి అభ్యర్థి ప్రచారంలో గానీ పోల్ మేనేజ్‌మెంట్‌లో గానీ పాల్గొన్నారా? అంటే.. అదీ లేదని జనసైనికులు చెబుతున్నారు. ఇక మామిడి విష్ణు భార్య జ్యోత్స్న రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారని, కేవలం కులం కార్డుతోనే పదవులివ్వడం సరికాదని జనసేన వీరమహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ పురుష అభిమానులతో నిండిపోయిన జనసేన పార్టీలో వీరమహిళల పేరుతో మహిళలు చేరడమే అరుదు. అటువంటి చోట పార్టీ పెట్టిన దగ్గర్నుంచి కష్టపడి పని చేస్తున్న కొందరి పేర్లను స్థానిక నాయకత్వం అధిష్టానానికి సూచించింది. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న విష్ణు ప్రియాంక ఇందులో ముందువరుసలో ఉన్నారు. 2016 నుంచి జనసేనలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఆ తర్వాత మోహన్ లక్ష్మి, కాదంటే దమ్మలవీధికి చెందిన జనసైనికుడు ఉదయ్ భార్య పేరును పరిశీలించాలని కోరారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా దారపు జ్యోత్స్యను ఎంపిక చేశారు.
అస్త్రాలు సిద్ధం చేస్తున్న అసంతృప్తవాదులు
వీరు ఎప్పుడూ పార్టీ కోసం పని చేయలేదు సరికదా.. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు పుట్టినరోజుకు మామిడి విష్ణు గ్రీటింగ్స్ చెబుతూ 2024లో దిగిన ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారని పార్టీ అధిష్టానానికి చెప్పడానికి జనసైనికులంతా ఆధారాలు సిద్ధం చేశారు. 2024 జూన్ 5న ఎన్నికల ఫలితాలు వస్తే దానికి 15 రోజుల ముందు మే 21న ధర్మాన ప్రసాదరావుకు గ్రీటింగ్స్ చెబుతూ తీసుకున్న ఫొటో ఫేస్‌బుక్‌లో కనిపిస్తుంది. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మామిడి విష్ణు పార్టీలోకి వస్తే.. జనసేనలో చేరిన తర్వాత కూడా వైకాపా అభ్యర్థి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న ఫొటో సోషల్ మీడియాలో కనిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజాం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో కూడా పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ఇవ్వడంతో జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోస్టింగ్‌ను ఆపేశారు. మరోవైపు హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా జనసేనకే కేటాయించగా, అది కూడా కాపు సామాజికవర్గానికి చెందిన మామిడి రామకృష్ణారావుకు కేటాయించడం కొసమెరుపు.










Comments