top of page

జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 21 hours ago
  • 3 min read
  • పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు

  • పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే

  • పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు

  • మంత్రి లోకేష్‌ ముందు ఏకరువు పెట్టిన నేతలు

  • వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ పొత్తు రాజకీయాల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్‌ దక్కించుకుని గెలిచినా ఆయనది పసుపు కుటుంబమే కదా!.. భవిష్యత్తులో కూటమి నుంచి జనసేన బయటకు వెళ్లిపోవాల్సి వస్తే టీడీపీ జెండా పట్టుకోవడానికి జయకృష్ణ ఉన్నారు కదా.. అన్న ప్రశ్నలు తలెత్తితే ఆ తప్పు మనది కాదు.. స్వయంగా జయకృష్ణదే. టీడీపీ నుంచి వచ్చి జనసేన గుర్తుతో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఏకపక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు రెండు రోజుల క్రితం పాలకొండ వచ్చిన రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముందు ఏకరువు పెట్టాయి. నియోజకవర్గంలో టీడీపీ నేతల పనులు ఏవీ చేయడంలేదని, జనసేన లేబుల్‌తో వెళ్తేనే జయకృష్ణ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారని, దీనివల్ల ఇక్కడ పార్టీ పూర్తిగా జనసేనగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందని లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.

చెదిరిపోయిన క్యాడర్‌

పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చెట్టుకో పుట్టగా చెదిరిపోయారని ముందు నుంచే పార్టీ వద్ద సమాచారం ఉండటంతో చంద్రబాబునాయుడు మెగా పేరెంట్స్‌ మీటింగ్‌కు రావడానికి ఒకరోజు ముందే లోకేష్‌ పాలకొండలో అడుగు పెట్టారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో లివిరి జంక్షన్‌ వద్ద అంతర్గత సమావేశం నిర్వహించారు. పాలకొండ పూర్తిగా జనసేన చేతిలోకి వెళ్లిపోయిందని ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నేతలంతా మంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పటి పొత్తుల్లో భాగంగా టీడీపీలో ఉన్న జయకృష్ణకు జనసేన నుంచి బరిలో దింపారని భావించినా ఇప్పుడాయన ఇప్పుడు పూర్తిగా జనసేన అవతారమెత్తారని, దీనివల్ల టీడీపీ కేడర్‌ ఇక్కడ బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. దీనికి స్పందించిన ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే చెబితే ఎంతమేరకు అధికారులు స్పందిస్తారో, ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు చెప్పినా కూడా అధికారులు అదే స్థాయిలో స్పందించే విధంగా అడుగులు వేయాలని వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రికి సూచించారు.

పెత్తందారీ పోకడలకు బ్రేక్‌

పాలకొండ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న పడాల భూదేవి, ఆమె వర్గంతో నిమ్మక జయకృష్ణ, ఆయన వెనుక ఉన్న గాడ్‌ఫాదర్లను ఒక తాటిమీదకు తీసుకురాలేక 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న జయకృష్ణను జనసేన గుర్తుమీద బరిలో నిలిపారు. జయకృష్ణ గెలుపొందిన తర్వాత అక్కడ టీడీపీ సీనియర్‌ నేతలకు, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్‌ మరింత పెరిగిపోయింది. పెత్తందారీ పోకడలతో టీడీపీ నేతలు తనపైన సవారీ చేయడాన్ని జయకృష్ణ మొదట్నుంచీ అంగీకరించలేదు. నియోజకవర్గం గతంలో ఎస్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎస్టీగా మారినా కూడా తెర వెనుక కొందరు కాపు నేతలే ఆయా పార్టీల తరఫున చక్రం తిప్పడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఆధిపత్య ధోరణికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని జయకృష్ణ భావించారు. నలుగురైదుగురు పెద్ద నాయకుల చేతిలో గ్రామాలు ఉన్నాయని చెప్పడం, వారి డిమాండ్లు తీర్చకపోతే ఓట్లు రాలవని బెదిరించడం, వారి కోర్కెలు తీర్చకపోతే టిక్కెటివ్వొద్దని అధిష్టానానికి అల్టిమేటంలు జారీ చేయడం వంటి మిడిల్‌మ్యాన్‌ వ్యవస్థకు జయకృష్ణ మంగళం పాడారు. ఆ క్రమంలో టీడీపీ సీనియర్‌ నేతలందరూ జయకృష్ణకు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన జనసేన నేతలను ప్రోత్సహించాల్సి వస్తోంది. ఇందులో భాగంగా పదవులు కూడా వారికే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేయకపోయినా.. ప్రస్తుతం తటస్థంగా ఉన్నా జనసేన నేతలనే చేరదీస్తున్నారు.

జనసేన నేతలకే పదవులు

ప్రస్తుతం నియోజకవర్గంలో స్వయంగా ఎమ్మెల్యే జయకృష్ణే జనసేనకు జవసత్వాలూదుతున్నారు. వీరఘట్టం మండలంలో పీఏసీఎస్‌ అధ్యక్ష పదవులు మొత్తం జనసేన నేతలకే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకే ఖండాపు వెంకటరమణ, గజేంద్రనాయుడు వంటి వీరఘట్టం నాయకులు కూడా టీడీపీతో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేకు దూరం జరిగితే తమను నమ్ముకున్నవారికి అన్యాయం జరుగుతుందేమోనన్న భావనతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. చివరకు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు వంటివారు కూడా జనసేనకు జైకొడుతున్న జయకృష్ణ బాటలోనే వెళ్లాలని భావిస్తున్నారట. సామంతుల దామోదర్‌, సుమంత్‌నాయుడు వంటివారు టీడీపీలో ఉండి, మండల పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ సమావేశానికి మెజార్టీ టీడీపీ నాయకులు హాజరుకాలేదు. కారణం.. జయకృష్ణ మీద ఉన్న వ్యతిరేకతను శ్రావణ్‌ ద్వారా బయటపెట్టాలని వారి ఉద్దేశం. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. ఎర్రన్నాయుడుతో పాటు కన్నెధార కొండ కోసం ఎడతెగని పోరాటం చేసిన తోట ముఖలింగాన్ని కాదని ఎమ్మెల్యేకు బావమరిది వరుసైన వ్యక్తికి అక్కడ పదవి కట్టబెట్టారు. అలాగే పాలకొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సీతంపేటకు చెందిన వ్యక్తిని నియమించారు. తెలుగుదేశంలో ఉన్నవారు తనతో ఉండాలని లేదంటే జనసేన కార్యకర్తలను ఎక్కడున్నా తెచ్చి పదవులిస్తానంటూ జయకృష్ణ పరోక్షంగా ప్రకటించడమే కాకుండా చేసి చూపిస్తున్నారు. ఇదే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ మొత్తం జనసేనగా మారిపోయే ప్రమాదముందని పడాల భూదేవి నేతృత్వంలో కొందరు టీడీపీ నేతలు లోకేష్‌కు వివరించారు. టీడీపీ నుంచి కొందర్ని తీసుకెళ్లి జనసేన మండల, పట్టణ పార్టీ పదవుల్లో నియమించేందుకు జయకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి స్పందించిన లోకేష్‌ వీరందరి బాధ్యతను ఇన్‌ఛార్జి మినిస్టర్‌ అచ్చెన్నాయుడు తీసుకోవాలని చెప్పడం పుండు మీద కారం చల్లినట్లుందన్న వ్యాఖ్యలో పార్టీలో వినిపిస్తున్నాయి. కళా వెంకట్రావు వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రాబల్యాన్ని ఏమాత్రం సహించడంలేదు. ఇప్పుడు ఏకంగా నారా లోకేషే ఇన్‌ఛార్జి మంత్రిగా అచ్చెన్ననే టీడీపీ బాధ్యతలు చూడాలని కోరడంతో జయకృష్ణ మరింత బిగుసుకుపోతారని చెబుతున్నారు. భవిష్యత్తులో టీడీపీ నుంచి బరిలో దిగాలంటే ఇక్కడ అనేకమందిని ప్రసన్నం చేసుకోవాలని, అదే జనసేన తరఫున పోటీ చేయాలంటే మాత్రం పవన్‌కల్యాణ్‌ ఆశీస్సులుంటే చాలనే భావనతో జయకృష్ణ ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page