టెక్కలి నుంచి తప్పించండి మహాప్రభో!
- DV RAMANA
- Aug 9
- 2 min read
ఎల్.ఎన్.పేట మండల ప్రజల వేడుకోలు
వైకాపా హయాంలో అనాలోచితంగా డివిజన్ మార్పు
అప్పట్లోనే వ్యతిరేకించాన పట్టించుకోని నాటి ప్రభుత్వం
రవాణా సౌకర్యాలు లేక మూడేళ్లుగా అవస్థలు
మళ్లీ జిల్లాల విభజన ఉంటుందన్న వార్తలతో ఆశల మోసులు
తమ మండలాన్ని మళ్లీ శ్రీకాకుళం డివిజన్‌లో కలపాలని వినతి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు.. గత వైకాపా సర్కారు హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా ప్రాంతాల వారిని కొత్త ఇబ్బందులోకి నెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జిల్లాలోని లక్ష్మీనర్సుపేట(ఎల్.ఎన్.పేట) మండలం. జిల్లా పునర్విభజనలో భాగంగా ఈ మండలాన్ని తీసుకెళ్లి దూరంగా ఉన్న టెక్కలి డివిజన్‌లో పడేశారు. సరైన అధ్యయనం చేయకుండా.. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా.. భౌగోళిక, సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా లోక్‌సభ నియోజకవర్గాలే ప్రాతిపదికగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు 26 జిల్లాలకు అప్పటి జగన్ సర్కారు పెంచింది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోకి రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో చేర్చారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాలు పోగా మిగిలిన 30 మండలాలతో కొత్త శ్రీకాకుళం జిల్లాను ప్రకటించినా రెవెన్యూ డివిజన్ల వర్గీకరణకు వచ్చేసరికి ఎల్.ఎన్.పేటకు అన్యాయం జరిగింది.
డివిజన్ల వర్గీకరణలో అన్యాయం
జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పరిధుల మార్పు ప్రక్రియను కూడా వైకాపా సర్కారు చేపట్టింది. ఆ మేరకు 2022 ఏప్రిల్ రెండో తేదీన కొత్త శ్రీకాకుళం జిల్లా నైసర్గిక స్వరూపాన్ని నిర్వచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని ప్రకారం రెండు నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాలను తొలగించి 30 మండలాలతో కొత్త శ్రీకాకుళం జిల్లా మనుగడలోకి వచ్చింది. అదే సమయంలో అప్పటివరకు జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్లకు అదనంగా పలాసను డివిజన్ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఆ మేరకు జిల్లాలోని 30 మండలాలను మూడు రెవెన్యూ డివజన్లకు అదే జీవో ద్వారా కేటాయించారు. ఇక్కడే ఎల్.ఎన్.పేట విషయంలో అన్యాయం జరిగింది. మాండలిక వ్యవస్థ ఏర్పడినప్పుడు కాకుండా ఆ తర్వాత చాన్నాళ్లకు లక్ష్మీనర్సుపేట కేంద్రంగా ఏర్పాటైన ఎల్.ఎన్.పేట మండలం అప్పటినుంచీ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో అంతర్భాగంగా కొనసాగుతూ వచ్చింది. కానీ రెవెన్యూ డివిజన్ల పునర్‌వర్గీకరణ సమయంలో అన్ని మండలాలను సమానంగా మూడు డివిజన్లకు పంచాలనుకుందో ఏమో గానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఎవరూ కోరకుండానే శ్రీకాకుళం డివిజన్‌లోని ఎల్.ఎన్.పేటను తీసుకెళ్లి టెక్కలి డివిజన్‌లో చేర్చింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి, మార్చాలని కోరినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదు.
దూరాభారంతో అవస్థలు
జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన శ్రీకాకుళం నగరంతో పోల్చితే టెక్కలికి ఎల్.ఎన్.పేట చాలాదూరంలో ఉంటుంది. శ్రీకాకుళం`ఎల్.ఎన్.పేట మధ్య దూరం 41 కిలోమీటర్లు. ఈ రెండిరటికీ మధ్యలో నియోజకవర్గ కేంద్రం, పట్టణ ప్రాంతమైన ఆమదాలవలస కూడా ఉంది. ఈ రెండిరటి మధ్య రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. అదే ఎల్.ఎన్.పేట నుంచి టెక్కలి చాలా దూరంలో ఉంది. నేరుగా రవాణా సౌకర్యాలు కూడా లేవు. దాంతో ఎల్.ఎన్.పేట నుంచి ఆమదాలవలస లేదా శ్రీకాకుళానికి వచ్చి అక్కడి నుంచి టెక్కలిలోని డివిజన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మండల ప్రజలకు దూరాభారంతో కూడినది. దాంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు టెక్కలి డివజన్ కేంద్రానికి వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు భయపడిపోతున్నారు. తమ మండలాన్ని తిరిగి శ్రీకాకుళం డివిజన్‌లో చేర్చాలని కోరుతూ గతంలో పలుమార్లు స్థానిక ప్రజలు అధికారులు, నాయకులకు వినతిపత్రాలు సమర్పించారు. కాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎల్.ఎన్.పేట ప్రజలు ఈసారైనా తమ కష్టాలను గమనించి, విన్నపాన్ని మన్నించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు రెండురోజుల క్రితం సమావేశమైన స్థానిక ప్రముఖులు ఎల్.ఎన్.పేట మండలాన్ని టెక్కలి నుంచి తప్పించి శ్రీకాకుళం డివిజన్‌లో కలపడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు స్థానికులు సంతకాలతో కూడిన లేఖ అందజేశారు. తమ విజ్ఞప్తిని మన్నించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్ది తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments