టాక్స్‌లు మేం కడతాం.. రోడ్లు వాటికిచ్చేయండి!
- Prasad Satyam
- 4 days ago
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫొటోలో దీపకాంతులతో వెలిగిపోతున్న భవనం నగరపాలక సంస్థ పరిపాలన కార్యాలయం. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఏర్పడి 75 ఏళ్లు అయినందుకు అలా ముస్తాబు చేశారు. దాని ముందు కనిపిస్తున్నవి సాక్ష్యాత్తు మనూరి గేదెలే. రాత్రి వెలుగుల్లో కార్యాలయం మెరిసిపోతుంటే.. ఆ ఎదురుగా ఉన్న రోడ్డు మాత్రం పశువులతో నిండిపోయింది. అందుకేనేమో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే మున్సిపల్ కార్యాలయం పందుల దొడ్డి అన్నారు గొండు శంకర్. దీని మీద అనేక అభ్యంతరాలు, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడం కోసమే ఇలా స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారనే కామెంట్లు వచ్చాయి.. అది వేరే సంగతి. రాత్రిపూట పశువులు రోడ్డు మీద సంచరిస్తుంటే, మరి సగటు సిక్కోలువాసి పరిస్థితి ఏమిటి? చీకట్లో గేదెలను యమధర్మరాజు వాహనాన్ని గుద్దుకొని నేరుగా అదే లోకానికి వెళ్లిపోయినవారు మనూరిలో చాలామంది ఉన్నారు. ప్రతీసారి స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడంతో ఎక్కడో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరడం కాదు.. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రధాన రోడ్లలో పశువులు విసర్జిస్తున్న మలమూత్రాలను క్లీన్ చేయడమని మన అధికారులకు ఎవరైనా చెబితే బాగున్ను. నిన్నకాక మొన్న కళింగ రోడ్డులో మళ్లీ బీటీ లేయర్ వేశారు. నిగనిగా మెరుస్తున్న రోడ్డు మీద అంతకంటే నిగారింపుతో వస్తున్న గేదెలు ఒక్కడికి సైడిస్తే ఒట్టు. ఎప్పుడో ఆగస్టు 15 నాటి ఫొటో కోసం చెబుతున్న ఉపోద్ఘాతం కాదిది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే పొట్టి శ్రీరాములు పెద్దమార్కెట్ ఉంది. అది ఆవులకు కేరాఫ్ అడ్రస్. కార్యాలయం మెయిన్‌రోడ్డు మీదే డస్ట్‌బిన్ ఉంది. ఇది గేదెలకు అడ్డా. సాధారణంగా గేదెలను మేతకు తీసుకువెళ్లి ఫలానా సమయం లోపు వెనక్కు చేర్చాలన్న కనీస నిబంధనను మున్సిపాలిటీ విధించకపోవడం విడ్డూరం. దీంతో ఎవడికి ఎప్పుడు తోస్తే అప్పుడు మెయిన్ రోడ్డు మీదుగా గేదెలను తోలుతున్నారు. ఇక కుక్కల కోసమంటారా.. మన దేశంలో కుక్కబతుకంత హ్యాపీ మరొకటి లేదు. ఎవడికైనా కష్టాలు చుట్టుముడితే కుక్కబతుకైపోయిందంటే ఇకనుంచి ఆ కుక్కలే ఒప్పుకోవు. ప్రతీవాడికీ జంతుప్రేమ పెరిగిపోయింది. ముఖ్యంగా కుక్కల మీద. కనపడిన చోటల్లా పాపాలు చేయడం, వాటి నివృత్తికి కుక్కలు బిస్కట్లు వేయడంతో నగరంలో అన్ని వీధులూ కుక్కలవే. గేదెలకు డ్యాష్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఒళ్లు దగ్గరపెట్టుకొని రోడ్డెక్కితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కకుండా ఏ సందునుంచో ఇంటికి చేరిపోతే చాలనుకునేవాడికి కుక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతీ వీధికి కుక్కల ముఠా ఒకటుంది. వీటికి ఉన్నంత ఐకమత్యం మన రాజకీయ పార్టీలకు ఉండదు. వాటి ఏరియాలో అడుగుపెడితే కారు, మోటార్ సైకిల్ అనే తేడా లేకుండా ముక్కలు చీరేయడానికి వెంబడిస్తున్నాయి. ఆ వీధి బోర్డర్ వరకు వెంటబెట్టిన తర్వాత, అక్కడ తమ సోదర కుక్కలకు ఈ బాధ్యతను అప్పగించి వెనక్కు వెళ్లిపోతున్నాయి. అలా ఎన్ని వీధులు దాటితే, అన్ని కుక్కల గుంపులను దాటుకొని ఇంటికి వెళ్లడమే సగటు సిక్కోలువాసికి పెద్ద విజయం. ఏమాత్రం ఇందులో ఏమరపాటుగా ఉన్నా నాలుగు ఇంజక్షన్లు ఖాయం. ఎలాగూ మన అధికారులు, పాలకులు వీటిని నివారించలేరు. ఒకవేళ అధికారులు పశువులను పట్టుకెళ్లి బంజరుదొడ్డిలో కడితే రాజకీయ నాయకులు ఇంటర్‌ఫియరైపోతారు. మనుషుల్ని కుక్కలు పీక్కుతింటున్నాయని స్వయంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానిస్తే, మన జంతు ప్రేమికులు కోర్టులను సైతం వదలకుండా ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా చిక్కటి చీకటిలో వీధి దీపాలు లేకుండా రోడ్డు మీద ఉన్న గేదెలకు డాష్ ఇవ్వకుండా, కుక్కల చేతికి పిక్కలు చిక్కకుండా, రోడ్డు మీద ఉన్న గోతుల్లో పడి కూడా లేచి నిటారుగా బండి డ్రైవ్ చేసేవాడికే ఇకనుంచి లైసెన్స్‌లివ్వాలి. ఎప్పటి మాదిరిగానే టాక్స్‌లన్నీ ప్రజలే కడతారు. కాకపోతే రోడ్లను మాత్రం కుక్కలకు, పశువులకు వదిలేయాలి. అంతకు మించి ఇంకేం చేయగలం?!










Comments