టీడీపీ నెత్తిన ఇండిగో బండ!
- DV RAMANA

- 2 days ago
- 2 min read

గత కొద్దిరోజులుగా ఇండిగో విమాన సంస్థ కారణంగా తలెత్తిన సంక్షోభం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్‌డీటీఎల్) రూల్స్‌ను ఇండిగో సంస్థ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, పైలట్లు వంటి సిబ్బంది నియామకాలను కొన్నాళ్లుగా చేపట్టకపోవడం వల్ల ఆ సంస్థ సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లి భారతీయ విమానయాన రంగం కకావికలమైంది. దీనికి కారణంగా ఈ రంగంలో కొన్నేళ్లుగా ఇండిగో, ఎయిర్ ఇండియా.. ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యం కొనసాగుతుండటమే. ఇంకొన్ని సంస్థలు రవాణా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నా.. మొత్తం భారతీ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో సింహభాగం ఇండిగో చేతిలోనే ఉన్నాయి. ఆ సంస్థ యాజమాన్యం నిర్వాకం ఫలితంగా సర్వీసులు నిలిచిపోవడంతో మొత్తం భారతీయ విమానయాన రంగమే స్తంభించిపోయినట్లు అనిపించింది. ఈ పరిణామాల వల్ల వేల సంఖ్యలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడటం వాస్తవమే. దీనిపై పోస్టుమార్టం జరగాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ సంక్షోభం సాకుతో మన రాష్ట్ర రాజకీయాలకు లింకు ఏర్పడటం, కేంద్ర పౌర విమానయన మంత్రిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడి ప్రతిష్టను, ఆయన ప్రతిభను కించపరిచే పరిణామాలు సంభవించడం దురదృష్టకరం. అలాగే ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఇరికించడం ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే అవుతుంది. ఇండిగో సంక్షోభం వల్ల ప్రయాణికుల ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. ఈ అంశంపై రిపబ్లిక్ టీవీలో ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ఉపాధి కల్పన, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్ దీపక్‌రెడ్డి అత్యుత్సాహానికి పోయి లోకేష్, రామ్మోహన్‌నాయుడులతో పాటు మొత్తంగా తెలుగుదేశం పార్టీ పరువును జాతీయస్థాయిలో దిగజార్చారు. విమానయాన రంగం కేంద్ర ప్రభుత్వానికి చెందినది, ప్రస్తుత సమస్య కూడా జాతీయస్థాయి వ్యవహారం. ఎన్డీయే ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు దాని వ్యవహారాలను చూడాలి. అంతేతప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ, రాష్ట్ర మంత్రి హోదాలో నారా లోకేష్ గానీ, తెలుగుదేశం పార్టీపరంగా గానీ అందులో వేలు పెట్టడానికి అసలు అవకాశమే లేదు. ఆ ప్రయత్నాలు కూడా జరగనే లేదు. కానీ టీవీ చర్చలో పాల్గొన్న దీపక్‌రెడ్డి చిన్నబాస్ అయిన లోకేష్ మెప్పు పొందాలనుకున్నారో ఏమో గానీ.. ఇండిగో సంక్షోభంపై తమ మంత్రి నారా లోకేష్ 24/7 పర్యవేక్షిస్తున్నారని, వార్ రూము నుంచి నిరంతరం సలహాలు ఇస్తున్నారని డప్పు కొట్టేశారు. తమ పార్టీ ఎంపీయే అయిన ఆ శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చేస్తున్న ప్రయత్నాలను ఏమాత్రం ప్రస్తావించలేదు. దీనికి అర్నబ్ గోస్వామి స్పందించి.. అసలు నారా లోకేష్‌కు, తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారంతో ఏం సంబంధమని, ఆయన పర్యవేక్షించడమేమిటని పలుమారు నిలదీసినప్పుడైనా దీపక్‌రెడ్డి జరుగుతున్న డ్యామేజ్‌ను గుర్తించకపోగా పదే పదే అదే విషయం చెబుతూ జాతీయ స్థాయిలో అన్ని రకాల మీడియాల్లో పార్టీకి వ్యతిరేకంగా ట్రోలింగ్స్‌కు కారణమయ్యారు. వాస్తవానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఇండియాలోనే లేరు. ఈ నెల ఆరో తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన పదో తేదీ వరకు అక్కడే ఉండే అవకాశం ఉంది. అందులో వార్ రూమ్‌లో నిరంతరం సమీక్షిస్తున్నారని దీపక్‌రెడ్డి పేర్కొన్న ఆరో తేదీన డల్లాస్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశాల్లో పాల్గొని బిజీగా గడిపారు. కనీసం ఆ విషయం కూడా తెలుసుకోకుండా మెహర్జానీ కోసం లోకేష్‌ను ఆకాశానికి ఎత్తబోయి.. తనతో పాటు పార్టీకి డ్యామేజ్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం దేశావ్యాప్తంగా వాట్సప్ గ్రూపుల్లో ట్రోల్ అవుతున్నాయి. చర్చా కార్యక్రమంలో అర్నబ్‌గోస్వామి వ్యవహరించిన తీరు కూడా సరిగ్గాలేదు. జర్నలిస్టుగా చర్చా కార్యక్రమాలు నిర్వహించడం, సమస్యలపై ప్రభుత్వ ప్రతినిధుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ చర్చావేదిక నుంచి తాను ఫోన్ చేస్తే ‘హలో.. హలో..’ అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఫోన్ పెట్టేశారని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఎందుకు ఫోన్ మాట్లాడలేకపోయారో తెలుసుకోవడానికి గానీ.. మరోసారి రింగ్ చేయడానికి గానీ ప్రయత్నించకుండా విమానయాన రంగంలో కలకలం రేగుతున్నా ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు స్పందించడంలేదని, నెట్‌ఫ్లిక్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నట్లు డిబేట్ జరుగుతుండగానే బహిరంగ వ్యాఖ్యలు చేసి ఒక యువమంత్రి వ్యక్తిత్వాన్ని హరించడానికి ప్రయత్నించారు. విమానయాన శాఖ మంత్రిగా ఇండిగో సమస్యను పరిష్కరించడంలో రామ్మోహన్‌నాయుడు విఫలమయ్యారని బాధితులైన విమాన ప్రయాణికులు అసంతృప్తితో, ఆగ్రహంతో విమర్శించడంలో సహేతుకత ఉంది. వాస్తవానికి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత విమాన సర్వీసులను, ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలను నేరుగా పర్యవేక్షించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం, మంత్రిత్వ శాఖ తీసుకునే విధాన నిర్ణయాలు అమలయ్యేలా చూడటమే డీజీసీఏ ప్రధాన కర్తవ్యం. కానీ ఏడాదిన్నరగా ఇండిగో సంస్థ కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు అమలు చేయకపోయినా డీజీసీఏ పట్టించుకోలేదు. అయితే మంత్రిత్వ శాఖను, దానికి నేతృత్వం వహిస్తున్న మంత్రిని తప్పుపడుతున్నారు. చిన్నవయసులోనే మంత్రి పదవి చేపట్టి పౌరవిమానయాన రంగాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న నేతను అనవసరంగా బాధ్యుడిని చేయడం రాజకీయంగా, అధికారికంగా అతన్ని బలహీనపరచడమే!










Comments