top of page

ట్రంప్‌, జగన్‌.. చిల్లర డిమాండ్లు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 6, 2025
  • 2 min read

పదవులు, పదోన్నతులు, పురస్కారాలు.. ఒకరు చెబితే రావు. ఎవరికివారు డిమాండ్‌ చేసినంత మాత్రాన రావు. పనితీరు, ప్రతిభే వాటికి కొలమానం. అయితే ఈ కాలంలో ఉత్తర, దక్షిణలుంటే చాలు.. ఇలాంటివన్నీ పాదాక్రాంతమవుతున్నాయి కదా!.. అలాంటప్పుడు మీరు చెప్పేది కరెక్టు కాదు కదా!! అని పాఠకులు నిలదీయవచ్చు. నిజమే.. ఈ రోజుల్లో పలుకుబడి, పరిచయాలు, ఉత్తర దక్షిణలే అన్నింటా కీలకంగా మారుతున్నాయి.. కాదనలేం. కానీ ప్రపంచస్థాయి పదవులు, రాజ్యాంగపరమైన హోదాల విషయంలో మాత్రం పైన ప్రస్తావించిన ప్రలోభాలు, డిమాండ్లు పనిచేయవు. నిర్దేశిత ప్రమాణికాలు, గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు జరుగుతుంటాయి. కానీ వారిద్దరికీ ఇవేవీ పట్టడం లేదు. అలాగనీ వారిద్దరూ ఆ నియమాలు, పద్ధతులు తెలియని అనామకులు కూడా కాదు. వారిలో ఒకరు ఏకంగా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అయితే.. ఆ రెండోవారు.. రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిత్వం నెరిపిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ట్రంప్‌గారు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్‌ బహుమతిని డిమాండ్‌ చేస్తుంటే.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్‌ పట్టుబడుతున్నారు. ట్రంప్‌కు నోబెల్‌ కమిటీ నిబంధనలు, మార్గదర్శకాలతో పనిలేదు. ఇటు జగన్‌కు రాజ్యాంగ నియమాలతో సంబంధంలేదు. ఇద్దరూ ప్రజానాయకులే. ప్రమాణాలు, సంప్రదాయాలను గౌరవించాల్సిన స్థానంలో ఉన్నా కూడా.. తమ వరకు వచ్చేసరికి వాటికి విలువ లేదన్నట్లుగా వ్యవహరిస్తూ అదే పనిగా పేచీ పెడుతున్నారు. నిజానికి ట్రంప్‌కు, జగన్‌కు ఎటువంటి సంబంధంలేదు. వారు చేస్తున్న డిమాండ్లు, పంచాయితీలకు సంబంధంలేదు. కానీ ఆ క్రమంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం దాదాపు ఒకే రీతిలో ఉండటమే విశేషం. అదే ప్రస్తావనార్హం. మొదట ట్రంప్‌ డిమాండ్‌ విషయం చూద్దాం. ప్రపంచంలో అత్యంత గౌరవనీయ, అత్యున్నత పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతి. 1895లో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన వీలునామా ప్రకారం మానవజాతికి గొప్ప ప్రయోజనం అందించే కృషికి మాత్రమే బహుమతి ఇవ్వాలి. కులం, మతం, వర్ణం, జాతీయం వంటి వివక్షలకు అతీతంగా కేవలం అర్హతల ప్రాతిపదికన మాత్రమే అర్హులను నిర్ణయించాలి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి అనే ఐదు రంగాల్లో అవిరళ కృషి చేసిన వారికి ఏటా ఈ బహుమతులు ఇస్తుంటారు. వీటిలో శాంతి బహుమతిని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ప్రకటిస్తుంది. నార్వే పార్లమెంట్‌ ఎంపిక చేసిన ఐదుగురు సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు. ఎంపిక నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ పురస్కారానికి ఎంతటివారైనా సొంతంగా తమను తాము నామినేట్‌ చేసుకోకూడదన్నది వీటిలో కీలకమైనది. బహిరంగ ప్రచారం, వ్యక్తిగత లాబీయింగ్‌ను అడ్డుకోవడమే దీని ఉద్దేశం. అలాగే రాజకీయ ఒత్తిళ్లను నిరోధించడానికి నామినేటర్ల పేర్లు, నామినీల పేర్ల 50 ఏళ్లపాటు గోప్యంగా ఉంచే నిబంధన కూడా ఉంది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ సందేశం ప్రకారం.. దేశాల మధ్య సౌభ్రాతృత్వం, నిస్సైనికీకరణకు కృషి చేసిన వారికి ఈ ప్రైజ్‌ ఇవ్వాలి. ఈ బహుమతి చరిత్రలో వివాదాలూ ఉన్నాయి. శక్తిమంతమైన రాజకీయ నేతలకు, రాజనీతిజ్ఞులకు ప్రైజ్‌ ఇవ్వాలా లేద శాంతి స్థాపనకు కృషి చేసినవారికే ఇవ్వాలా అన్న చర్చ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ నియమాలను పట్టించుకోవడం లేదు. నోబెల్‌ శాంతి బహుమతి తనకే ఇవ్వాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. తాను ఏడు యుద్ధాలను ముగించానని తన వాదనకు మద్దతుగా డబ్బా కొట్టుకుంటున్నారు. తాజాగా గాజా శాంతి ప్రణాళికతో మరో యుద్ధం కూడా ఆగే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల తనకు మించిన శాంతిదూత లేనేలేడన్నట్లు దబాయిస్తున్నారు. తనకు ప్రైజ్‌ నిరాకరిస్తే.. అది అమెరికాకే పెద్ద అవమానం అన్నంత సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ పురస్కారానికి ట్రంప్‌ తరఫున నామినేషన్లు వచ్చినా.. బహిరంగంగా డిమాండ్‌ చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధం. ఈ డిమాండ్లు ఎంపిక కమిటీని ప్రభావితం చేయవు. గతంలో ఎవరైనా ఇలా డిమాండ్‌ చేసి నోబెల్‌ గెలుచుకున్న ఉదంతాలూ లేవు. మరోవైపు ట్రంప్‌ శాంతి కాముకుడేమీ కాదు. తన సంధి ప్రణాళికలను ఆయా దేశాలపై బలవంతంగా రద్దుతున్నారు. వాటిని ఆమోదించకపోతే అంతు చూస్తాను అన్నట్లు బెదిరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు, ఫైటర్‌ జెట్లు ఇస్తామన్నారు. వెనిజులా సమీపంలో అమెరికా యుద్ధనౌకలను మోహరించారు. ఆఫ్ఘనీస్తాన్‌లో తమ పాత సైనిక శిబిరం ఇవ్వకపోతే విరుచుకుపడతామంటున్నారు. ఇవన్నీ చూస్తే శాంతి అనే మేకతోలు కప్పుకున్న యుద్దోన్మాదిలా ట్రంప్‌ కనిపిస్తున్నారు. ఇదే తరహాలో వైకాపా అధినేత జగన్‌ ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబట్టారు. దీనికోసం హైకోర్టుకు వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే అసెంబ్లీలో కనీసం పది శాతం ఎమ్మెల్యేలు.. అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వైకాపాకు 11 మందే ఉన్నారు. ఆ మేరకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ స్పష్టం చేశారు. 2019లో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంఖ్య 18 కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా పోతుందంటూ ఎగతాళి చేసిన జగన్‌ ఇప్పుడు అదే నిబంధనను ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. హోదా దక్కకపోతే ఆసెంబ్లీకి వచ్చేదిలేదని చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు. నిబంధనలనేవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి. కానీ తమకు ఒకలా.. ఇతరులకు ఇంకోలా వర్తించాలనడం అవివేకం. వాటిని గౌరవించి ఔదల దాల్చేవారే నిజమైన నాయకులుగా మన్ననలు అందుకుంటారు. స్ఫూర్తిగా నిలుస్తారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page