ట్రంప్ దూకుడుకు ఇలా బ్రేక్ వేయొచ్చు!
- DV RAMANA

- Sep 23, 2025
- 2 min read

ఒక దేశాన్ని నడిపించే స్థానంలో ఉన్న నేతలు ఆచీతూచీ వ్యవహరించాలి. ఒక నిర్ణయం తీసుకునేముందు దాని పర్యవసనాలు, లాభనష్టాలను అన్ని కోణాల్లోనూ బేరీజు వేయాలి. ఆ తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆమెరికా అధ్యక్ష పదవి చేపట్టినది లాగాయితు డోనాల్డ్ ట్రంప్ గుడ్డెద్దు చేలో పడినట్లు ప్రపంచ దేశాలపై పడిపోతున్నారు. మిత్ర, శత్రు దేశాలన్న విచక్షణ కూడా లేకుండా తన మాట వినని వారిపై సుంకాలు, ఆంక్షలు యుద్ధం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా రష్యా విషయంలో తన సూచనలను బేఖాతరు చేసిన భారతదేశంపై తన మిత్రపక్షం అంటూనే సుంకాల వాతలు పెట్టారు. హెచ్`1బి వీసా ఫీజుల భారీ పెంపు, అమెరికా నుంచి వలసదారుల తరిమివేత వంటి అనేక చర్యలతో విరుచుకుపడుతున్నారు. ఈ నిర్ణయాల ప్రభావం ఇతర దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువగా ఉంటుందన్నది గమనార్హం. ఇలా ఏకపక్షంగా రెచ్చిపోతున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పే అవకాశం భారత్‌కు లేదా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొన్న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో దీనికి కొంతవరకు సమాధానం లభించింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు మరింత పదును పెట్టి అమెరికా దిగుమతులపై ఆధారపడకుండా మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవడం, అమెరికా ఉద్యోగాల కోసం అర్రులు చాచకుండా స్వదేశంలోనే ఉద్యోగాలు చేయడం, స్వయం ఉపాధి కల్పించుకోవడం ద్వారా నీ ఖాతరు మాకు లేదని అమెరికాకు చెప్పవచ్చన్నది మోదీ ప్రసంగ సారాంశం. మన దేశంలో ఒకనాటి పెత్తందార్లు, భూస్వాములు, దొరల తీరును జ్ఞప్తికి తెస్తున్న ట్రంప్‌కు ఇంకా గట్టి దెబ్బ కొట్టాలంటే ఇదొక్కటే సరిపోదు. ఇంకా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు వాటిని పట్టుదలగా అమలు చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల కంటే ప్రజలపైనే ఎక్కువగా ఉంది. అయితే దీనికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. నిరసనలు, ఆందోళనలు చేపట్టాల్సిన పనీ లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనం వాడే వస్తువులు ఎక్కడ, ఏ దేశంలో తయారవుతున్నాయన్నది ఒక్కసారి పరిశీలిస్తే.. పళ్లు తోముకోవడానికి మనం వాడే కాల్గేట్ టూత్‌పేస్ట్ నుంచి మొదలుకొని చాలా వస్తువులు ఆమెరికన్ కంపెనీలవే. వాటిని త్యజించి.. భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న ఆవే వస్తువులను వినియోగించడం మొదలుపెడితే అమెరికా ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను జెల్ల కొట్టినట్లు అవుతుంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. అన్ని విషయాలను అంకెలేతాయి. వాణిజ్య ప్రయోజనాలకు నొప్పి కలిగేలా చేస్తే పాలకులు దారికి రాక తప్పదు. అందులోనూ అమెరికాలో పారిశ్రామిక లాబీ చాలా పవర్‌ఫుల్. తమ ప్రయోజనాలకు భంగం కలిగితే.. అది ఏ ప్రభుత్వమైనా ఆ లాబీ అస్సలు ఒప్పుకోదు. అందువల్ల ట్రంప్ కరుణ కోసం ఎదురుచూడకుండా భారతీయులు ఐకమత్యంగా అమెరికన్ ఉత్పత్తులపై ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు. అన్నీ దారిలోకి వచ్చేస్తాయి. ఎవరికివారు అమెరికన్ వస్తుసేవల వినియోగంపై స్వీయ బ్యాన్ విధించుకుంటే కొద్దిరోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. మనం పిచ్చిగా మోజుపడే యాపిల్ ఫోన్‌తోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఇంటెల్ వంటివి అమెరికాకు చెందినవే. అయితే కంప్యూటర్ యుగంలో మైక్రోసాఫ్ట్ లేకుండా సాధ్యమా? అన్న అనుమానం కలగవచ్చు. నిజమే.. కొన్నింటిని ఆపలేం. అన్నింటినీ ఒకేగాట కట్టేయలేం. అందుకే మైక్రోసాఫ్ట్‌కు మినహాయింపు ఇవ్వొచ్చు. కానీ యాపిల్ ఫోన్ వాడకపోతే ప్రాణం పోదు కదా! అమెజాన్‌లోనే ఆన్‌లైన్ షాపింగ్ చేయాలి? ప్రత్యామ్నాయంగా ఫ్లిప్‌కార్ట్ ఉంది కదా! అలాగే టాక్సీ సర్వీసుల్లో ఊబర్ అమెరికన్ కంపెనీ. దానికి ఓలా ప్రత్యామ్నాయం ఉంది. అమెరికాను వ్యతిరేకించటం.. అమెరికన్ వస్తువులను వాడకూడదన్నది పంతమేం కాదు. విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్‌కు షాకివ్వటమే ముఖ్య ఉద్దేశం. అందుకే వస్తు, సేవలను వినియోగించే విషయంలో అమెరికా ఉత్పత్తులకు కనీసం కొంతకాలం దూరంగా ఉండగలిగితే భారతీయుల శక్తి ఏమిటో వైట్‌హౌస్‌కు తెలిసొస్తుంది. అప్పుడు వారే దారికొస్తారు. అమెరికా ఉత్పత్తులను మనం బహిష్కరిస్తే.. భారత వస్తువులను వారు బహిష్కరించవచ్చు కదా! అప్పుడు మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుందన అనుమానం రావచ్చు. కానీ దాదాపు 140 కోట్ల విస్తారమైన భారతీయ మార్కెట్‌లో మన వస్తువులను మనమే అమ్ముకోలేమా? కొనుక్కోలేమా?? ఒక్కసారి ఆలోచించండి.










Comments