ట్రంప్ మెడపై 25వ సవరణ కత్తి?
- DV RAMANA

- 3 hours ago
- 2 min read

యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న డెడ్‌లైన్‌లు, షరుతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సష్టిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనమాట వినకుంటే ఇరాన్‌ను రాతియుగంలోకి నెట్టేస్తానని ఒకవైపు తీవ్రస్థాయిలో హెచ్చరికస్తూ గడువులు పెడుతున్నారు. మరోవైపు చర్చలు, దానికి షరతులు, కాలులు విరమణ ప్రతిపాదన అంటూ పావులు కదుపుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ తమకు అక్కర్లేదని, ఇలా చీటికీమాటికీ యుద్ధాలకు దిగే పరిస్థితి శాశ్వతంగా తొలగిపోవాలని ఇరాన్ కుండబద్దలు కొడుతున్నా చర్చల పేరుతో ట్రంప్ సర్కారు పూటకో మాట చెబుతున్నది. ఇవన్నీ చూస్తున అంతర్జాతీయ విశ్లేషకులు , ప్రపంచ దేశాలు ఈ గందరగోళ వైఖరి ట్రంప్ నూతన విదేశాంగ విధానంలో భాగమా? లేక అనిశ్చితికి నిదర్శనమా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తీరుపై అమెరికాలోనే వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న 25వ సవరణను ప్రయోగించి ట్రంప్‌ను పదవీచ్యుడిని చేయాలన్న డిమాండ్లు అధికార, ప్రతిపక్షాల్లోనూ పెరుగుతున్నాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రస్తుత యుద్ధంలో కీలకంగా మారింది. ఈ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు వీలుగా తెరవాలని మార్చి 21 నుంచి ఇప్పటివరకు ట్రంప్ సుమారు ఐదు సార్లు డెడ్‌లైన్‌లు విధించడం, తర్వాత పొడిగించడం విశేషం. మొదట 48 గంటల్లోగా జలసంధిలో రవాణాపై ఆంక్షలు తొలగించకపోతే కఠిన సైనిక చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన ఆ గడువు ముగియకముందే తనంతటతానే దాన్ని 82 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇలా మాటిమాటికీ గడువు పొడిగించుకుంటూ పోతుండటంతో ఇరాన్ వాటిని ఖాతరు చేయడంలేదు. ఈ పొడిగింపుల ధోరణి అమెరికా విదేశాంగ విధానంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలనేది దౌత్య నియమం. కానీ ట్రంప్ నిర్ణయాల్లో ఊగిసలాట ధోరణి మిత్రదేశాలను కూడా అయోమయంలోకి నెట్టేస్తున్నది. హెచ్చరికల గడువు పొడిగించడం వల్ల అమెరికా శక్తియుక్తులపైనా అనుమానాలు పెంచుతుందంటున్నారు. ట్రంప్ డెడ్‌లైన్‌లు రాజకీయ రంగాన్నే కాకుండా గ్లోబల్ ఎకానమీని కూడా కుదిపేస్తున్నాయి. మరోవైపు అవి విమర్శకులకు ట్రోల్ మెటీరియల్‌గా మారుతున్నాయి. ట్రంప్ ప్రకటనలు వెలువడిన ప్రతిసారీ నెటిజన్లకు వినోదం పంచుతున్నాయి. ట్రంప్ డెడ్‌లైన్‌లు ఆయిల్ ధరల కంటే వేగంగా మారుతున్నాయని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అటు యుద్ధంలోనూ.. ఇటు చర్చల ప్రతిపాదనలకు ఇరాన్ లొంగకుండా దాడులు ముమ్మరం చేస్తూ పట్టు బిగిస్తుండటం ట్రంప్‌ను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నది. ఈగో దెబ్బతింటున్న ఆయన తాను అగ్రదేశానికి అధ్యక్షుడినన్న విషయాన్ని మర్చిపోయి పామర భాష వాడుతున్నారు. ఈస్టర్ పండుగ వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో ఏకంగా బూతులే ప్రయోగించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్టులో ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు, వాడిన భాష, బూతు పదజాలం అభ్యంతరకరంగా ఉండటం చూసి అంతా విస్తుపోతున్నారు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తామని, ఆ దేశం నరకాన్ని చూస్తుందని ట్రంప్ తన పోస్టులో తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా రాయడానికి వీల్లేని అసభ్య పదజాలం, బూతులతో విరుచుకుపడ్డారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాషను ప్రయోగించడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇరాన్ ప్రభుత్వాన్నే కాకుండా ఆ దేశ ప్రజలను కించపర్చినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. రానురాను ట్రంప్ ప్రవర్తన దేశ భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళన చెందిన డెమోక్రటిక్ పార్టీ నేతలు.. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని, దానికోసం అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణలో ఉన్న సెక్షన్`4ను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. తాను గనుక ట్రంప్ క్యాబినెట్‌లో ఉంటే ఈపాటికే ఈ సవరణను అమలు చేసేవాడినని అన్నారు. ట్రంప్‌వి పూర్తిగా పిచ్చి చర్య అని విమర్శించారు. మాజీ హోస్ట్ మెహదీ హసన్ సైతం ఇదే రీతిలో స్పందించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దే ఉపాధ్యక్షుడు మైకేల్ వాన్, ఇతర ట్రంప్ క్యాబినెట్ సభ్యులు తక్షణమే రంగంలోకి దిగి అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇప్పటికే ట్రంప్ వైఖరి వల్ల దేశంలో చమురు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయంటూ నిరసనలు చేస్తున్న అమెరికన్ ప్రజలు సైతం ఇదే రకమైన డిమాండ్లు చేస్తున్నారు. అమెరికా ప్రస్తుతం ఈ అంశమే పెద్ద చర్చగా, డిమాండ్‌గా ఉంది. అసలు రాజ్యాంగం 25వ సవరణలో ఏముంది? దాని ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి ఎలా దించవచ్చన్నది పరిశీలిస్తే.. 1967లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య తర్వాత అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణను చేర్చారు. అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా, పదవి నుంచి తొలగింపునకు గురైనా అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేసే ప్రక్రియను 25వ సవరణ ద్వారా చేపట్టవచ్చు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా వాటిలో ‘సెక్షన్ 4’ అత్యంత కీలకమైనది. అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించలేనంతగా శారీరక, మానసిక అశక్తతకు గురయ్యారని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌లోని మెజారిటీ సభ్యులు భావిస్తే.. వారు లిఖితపూర్వక ప్రకటన ద్వారా అధ్యక్షుడిని పక్కన పెట్టి ఉపాధ్యక్షుడిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించవచ్చు. యుద్ధం విషయంలో ట్రంప్ తరచూ మాట మార్చడం, వ్యూహలేమి, బూతు పోస్టులు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయని పలువురు ఎంపీలు వాదిస్తున్నారు. అటు రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్‌పై అసమ్మతి మొదలై ‘25వ సవరణ’ వైపు రాజకీయాలను మళ్లిస్తున్నది.






Comments