top of page

ట్రిపుల్‌ ఐటీలో వేధింపుల కలకలం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 3 days ago
  • 2 min read
  • ఫేక్‌ మెయిల్‌గా కొట్టిపారేస్తున్న యంత్రాంగం

  • సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు

  • ఫిర్యాదులో అంశాలు విడిచి చేసినవారిపై ఆరా

  • నూజివీడు నుంచి వస్తున్న లీగల్‌ టీమ్‌

  • మరోసారి వార్తలకెక్కిన ఎచ్చెర్ల క్యాంపస్‌

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పని చేస్తున్న అధ్యాపకులు కొందరు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌కు ఓ మెయిల్‌ వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మెయిల్‌ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపారు? అన్న సాంకేతిక ఆధారాలు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొందరు అధ్యాపకులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, బోధనేతర సిబ్బంది సైతం ఉత్తీర్ణులయ్యేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉపకార వేతనం తీసుకునే సమయంలో విద్యార్థినులు వేలిముద్రలు వేయాలంటూ కొందరు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నది ఈ ఫిర్యాదులో ఒక భాగం. అలాగే చాలామంది సిబ్బంది పాఠాలు చెప్పకుండా వాటిని యూట్యూబ్‌, చాట్‌ జీపీటీల్లో చూసుకోవాలని సూచిస్తున్నారని, ఉపాధికల్పన, శిక్షణ విభాగం అధికారులు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదన్నది మరో భాగం. అయితే ఈ మెయిల్‌ పూర్తిగా ఫేక్‌ అని, ఇందులో ఫిర్యాదుదారుడు ఐడెంటిటీ ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి ఇది కేవలం కొందరు అధ్యాపకుల మధ్య, లేదా బోధనేతర సిబ్బంది మధ్య ఉన్న కీచులాటలో భాగంగానే తప్పుడు మెయిల్‌ చేశారని ట్రిపుల్‌ ఐటీ కార్యాలయ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కోణంలో ఫిర్యాదు ఉండటం వల్ల దీనిని వీలైనంత ఎక్కువగా తొక్కిపడేయాలని భావిస్తున్నట్టు అర్థమవుతుంది. వారం రోజుల క్రితమే ఈ మెయిల్‌ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌కు వెళ్లినా మంగళవారం ఉదయం ఈనాడు మెయిన్‌లో ఈ కథనం వచ్చేవరకు ట్రిపుల్‌ ఐటీ వర్గాలు స్పందించలేదు. దీని మీద వివరణ కోసం విలేకరులు అడిగితే సోమవారం రాత్రి ఇది ఫేక్‌ మెయిల్‌ అని, దీని మీద జర్నలిస్టులు సంయమనం పాటించాలని డైరెక్టర్‌ ఒక ప్రకటన ఇచ్చారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వాస్తవమో కాదో పక్కన పెడితే, నిజంగా క్యాంపస్‌లో బాధితులు ఉంటే, ఓపెన్‌గా డైరెక్టర్‌కు మెయిల్‌ చేసి, తమ విద్యాసంవత్సరాన్ని కాలరాసుకోడానికి ఎవరూ ఇష్టపడరు. బహుశా ఆ కోణంలోనే ఆకాశరామన్న పేరుతో డైరెక్టర్‌కు మెయిల్‌ చేసుంటారు. ఎంతసేపూ మెయిల్‌ ఎవరు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? అనే కోణంలో పరిశోధనే తప్ప, ఇందులో వాస్తవం పాలు ఎంత? లేదా కుట్రకోణం దాగివుందా? అనే రీతిలో విచారించడంలేదు. ఈ మెయిల్‌ ప్రకారం క్యాంపస్‌లో ఎనిమిది మంది మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మెయిన్‌ గుట్టు విప్పాలంటూ ట్రిపుల్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌ ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను మంగళవారం మధ్యాహ్నం ఆశ్రయించారు. వాస్తవానికి ట్రిపుల్‌ ఐటీ అంటే టెక్నాలజీని బోధించే కార్యశాల. అసలు ఈ మెయిల్‌ ఏ అడ్రస్‌ నుంచి వచ్చిందో క్యాంపస్‌లోనే తేల్చేయొచ్చు. ఆ తర్వాత ఇది ఫేక్‌ ఐడీనా? లేక మనుగడలో ఉన్న ఐడీయేనా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఐపీ అడ్రస్‌ మేరకు ఎక్కడి నుంచి పోస్ట్‌ అయింది కూడా తెలుసుకోవచ్చు. టెక్నాలజీ మీద పాఠాలు చెప్పే అధ్యాపకులు ఆమాత్రం టెక్నాలజీని వాడుకోపోవడం విడ్డూరం. విద్యార్థినుల వేధింపుల మాట పక్కన పెడితే, బోధనేతర సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంటుందని, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలు సరిగ్గా నడవడం లేదన్నదానిపై ట్రిపుల్‌ ఐటీ ఓ వివరణ ఇచ్చివుంటే బాగుండేది. ఇంతవరకు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాదికి ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ట్రిపుల్‌ ఐటీ వార్తల్లోకి ఎక్కుతుంది తప్ప, దాని ఫలితాల వల్లో, పనితీరు వల్లో కాదు. ఇక్కడి విద్యార్థులు చనిపోయిన ప్రతీసారి క్యాంపస్‌తో సంబంధం లేదని కారణం ఏదో ఒకటి చూపించి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పుడు అంతమందిని పర్యవేక్షించడం అంత సులువు కాదు. కానీ ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆగమేఘాల మీద దోషులెవరో తేల్చే పని పెట్టుకోకుండా, దీనికి ఒక కమిటీ వేసి విచారణ జరిపితే గాని అసలు విషయాలు బయటకు రావు. పేరూ, ఊరు లేని అడ్రస్‌ నుంచి మెయిల్‌ వచ్చింది కాబట్టి దాన్ని ఫేక్‌గా కొట్టిపారేయకుండా అందులో సారాంశం ఏ మేరకు వాస్తవమో తెలపాలి. బహుశా నూజివీడు నుంచి లీగల్‌ కమిటీ ఇక్కడికి అందుకే వస్తుందేమో?!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page