ట్రంప్ వాణిజ్య అస్త్రం.. ఎవరికి నష్టం?
- DV RAMANA

- May 19, 2025
- 2 min read

పహల్గాంలో ఉగ్రవాదుల అమానుష దాడికి ప్రతిగా వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మే ఏడో తేదీ నుంచి సైనిక చర్యక దిగింది. దాంతో పాకిస్తాన్ కూడా భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడి ప్రారంభించింది. అయితే భారతశక్తియుక్తుల ముందు నిలవలేకపోయింది. ఈ తరుణంలో మే పదో తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ మొదలైనట్లు హఠాత్తుగా టీవీ స్క్రీన్లపై బ్రేకింగ్ వార్తలు రావడం మొదలైంది. ఇరుదేశాలను కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు.. భారత్`పాక్ మధ్య తలెత్తిన అణుయుద్ధ పరిస్థితులను కూడా తానే ఆపా నని ప్రకటించారు. దీనిపై మరో సందర్భంలో మాట్లాడుతూ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే భారత్, పాక్‌లతో వాణిజ్యాన్ని నిలిపివేయాల్సి వస్తుందని రెండు దేశాలను తాను హెచ్చరించానని, ఫలి తంగానే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ట్రంప్ మరో ప్రకటన కూడా చేశారు. తనంతట తానుగా రెండు దేశాల అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ చొరబడటం విమర్శలకు దారి తీసింది. అలాగే ట్రంప్ హెచ్చరికలపై మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది. కాల్పుల విరమణకు అంగీకరించక పోతే వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ట్రంప్ బెదిరింపులను ప్రస్తావిస్తూ.. అటువంటి హెచ్చరికల వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి? భారత్, పాక్‌లలో ఎవరు ఎక్కువ నష్టపోతారన్నదానిపై వాణిజ్య, ఆర్థిక రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు విశ్లేషణల ప్రకారం అమెరికా గనుక వాణిజ్యాన్ని నిలిపి వేసే పరిస్థితులే తలెత్తితే.. భారత్ కంటే పాకిస్తానే తీవ్రంగా నష్టపోతుంది. అదెలా అంటే.. భారత్` అమెరికా మధ్య 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్యం 119.42 బిలియన్ డాలర్లు దాటింది. ఇందులో 76.11 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 43.31 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. భారత ఎగు మతుల్లో అమెరికా 18 శాతం వాటా కలిగి ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోతే ఫార్మా స్యూటికల్స్, సాఫ్ట్‌వేర్ సేవలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ తదితర రంగాలు భారీగా నష్టపోతాయి. భారత్ ఐటీ, బీపీవో సేవలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనివల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవచ్చు. అమెరికాతో రక్షణ ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యం ఆగిపోవడం వల్ల భారత్ రక్షణ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. అమెరికాకు ప్రత్యా మ్నాయంగా యూరోపియన్, అసియా మార్కెట్ల వైపు భారత్ మళ్లవచ్చు, కానీ దానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచ దేశాలతో భారత్ అనుసరిస్తున్న వైవిధ్యమైన వాణిజ్య విధానాలు ఈ సమయంలో అక్కరకు వస్తాయి. దేశీయంగా సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించగలదు. అమె రికా విధించే టారిఫ్‌లను ఎదుర్కోవడానికి భారత్ ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలకు తక్కువ టారిఫ్‌లను ప్రతిపాదించవచ్చు. కానీ పాకిస్థాన్‌పై అమెరికా వాణిజ్య ప్రభావం చాలా ఎక్కువ. భారత్‌తో పోలిస్తే పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నది. అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అమెరికాయే పాకిస్తాన్‌కు ప్రధాన ఎగుమతి గమ్యస్థానం, ప్రధానంగా టెక్స్‌టైల్స్, కాటన్, లెదర్ ఉత్పత్తుల వ్యాపా రమే పాక్ ఆర్థిక వ్యవస్థలో 60 శాతం వాటా కలిగి ఉంది. ఈ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మరో కీలక విషయం ఏమిటంటే.. అమెరికా నుంచి ప్రస్తుతం ఆయుధాల సరఫరా, సిబ్బందికి శిక్షణ వంటి సైనిక సహాయం నిలిచిపోయి పాక్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అమెరికా వాణిజ్యం, ఆర్థిక సహాయం నిలిచిపోతే పాక్ ఆర్థిక వ్యవస్థ మరింతగా చితికిపోతుంది. ఈ పరిస్థితే ఏర్పడితే ఆ దేశం పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయవచ్చు. వాణిజ్యం నిలిపివేత వల్ల భారత్, పాక్‌లతో పాటు అమెరికాకు కూడా పలు రూపాల్లో నష్టం తప్పదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ వంటి ముఖ్యమైన భాగస్వామిని కోల్పోవడం వల్ల ఆసియా ప్రాంతంలో అమెరికా ప్రభావం తగ్గుతుంది. అలాగే పాక్‌తో సంబంధాలు ఆగిపోతే ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలో అమెరికా గూఢచర్య కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుంది. అమెరికా తమతో వాణిజ్యాన్ని నిలిపివేస్తే ఆ గ్యాప్‌ను భారత్, పాక్‌లు ఇతర దేశాలతో భర్తీ చేసుకుంటాయి. దీనివల్ల ప్రపంచ వాణిజ్య రంగంపై అమెరికా ప్రభావం తగ్గిపోతుంది. ఆర్థికంగా కూడా కొంత నష్టపోతుంది.










Comments