top of page

ఠాట్‌.. మాకెందుకీ ‘పరీక్ష’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 29, 2025
  • 3 min read
  • ఆందోళన రేపుతున్న సుప్రీంకోర్టు తీర్పు

  • 2001`11 మధ్య చేరిన టీచర్లను ఇప్పుడు టెట్‌ రాయమనడంపై అసంతృప్తి

  • డీఎస్సీలో ఎంపికై వస్తే చాలాదా అన్న ప్రశ్నలు

  • మైనారిటీ సంస్థలకు వర్తించాల్సిన ఈ తీర్పు అందరిపైనా ప్రభావం

  • రాష్ట్ర ప్రభుత్వం రివ్యూకు వెళ్లాలని ఉపాధ్యాయవర్గాల డిమాండ్‌

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

నిక్షేపంగా నడుస్తున్నవాడిని.. బంగరడం వచ్చో రాదో నిరూపించుకోమంటే ఎలా ఉంటుంది?!

ఇప్పుడు టీచర్ల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. పదిహేను ఇరవై ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తమను.. ఇప్పుడు టీచర్‌గా పని చేసేందుకు అర్హత ఉందో లేదో పరీక్ష రాసి తేల్చుకోమనడం వారిని అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఇటువంటి తీర్పు ఇవ్వడం వారికి మింగుడుపడటంలేదు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ న్యాయస్థానంలో రివిజన్‌ పిటిషన్‌ వేయాలన్న ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరు టీచర్లను అసహనానికి గురిచేస్తోంది. పిల్లలకు కొన్నేళ్లుగా పాఠాలు చెబుతున్న తామే ఇప్పుడు పాఠాలు చదివి పరీక్ష రాయాలా? పాస్‌ కాకపోతే తమ ఉద్యోగాలు ఊడబీకుతారా? అని ఆందోళనగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. లక్షలాదిగా ఉన్న ఉపాధ్యాయ వర్గాలు దీనిపైనే తర్జనభర్జనలు పడుతూ ఆందోళనకు, గందరగోళానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం లోతోపాతులను పరిశీలిద్దాం.

సుప్రీంకోర్టు ఏం చెప్పిదంటే..

తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ దీపాశంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సెప్టెంబర్‌ ఒకటో తేదీన తీర్పు వెల్లడిరచింది. టెట్‌( టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) కేవలం కొత్త నియామకాలకేనా లేక సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు వర్తిస్తుందా అన్న అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2001లోనే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఉపాధ్యాయ నియామకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు టెట్‌ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని తేల్చింది. ఎన్‌సీటీఈ ఆదేశాలకు ముందు అంటే 2001కి ముందు టీచర్‌ ఉద్యోగాల్లో చేరినవారికి ఈ తీర్పు వర్తించదు. అలాగే 2012 నుంచి రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున వారిపై కూడా తాజా తీర్పు ప్రభావం ఉండదు. కానీ 2001`2011 మధ్య ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరిన వారు మాత్రం కచ్చితంగా టెట్‌ పరీక్ష రాసి అర్హత సాధించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. రెండేళ్లలోగా ఈ అర్హత సాధించాలని కూడా పరిమితి విధించింది. లేనిపక్షంలో ఉద్యోగాలనే వదులుకోవాల్సి ఉంటుంది. రిటైర్‌మెంట్‌కు ఐదేళ్ల దూరంలో ఉన్న వారిని మాత్రం దీని నుంచి మినహాయించింది. కానీ ఇటువంటివారు ప్రమోషన్‌ కావాలనుకుంటే మాత్రం టెట్‌ రాయాల్సిందేనని మెలిక పెట్టింది. ఈ లెక్కన చూస్తే 2001`2011 మధ్య సర్వీసులో చేరిన వేలాది టీచర్లపై టెట్‌ అర్హత కత్తి వేలాడుతున్నట్లే. ఇదే ఇప్పుడు ఉపాధ్యాయవర్గాలను కలవరపెడుతున్న అంశం.

లక్ష్యం గురి తప్పిందా?

వాస్తవానికి టెట్‌ను ప్రామాణికంగా చేయడం వెనుక సుప్రీంకోర్టు ఉద్దేశం వేరు. కానీ అది గురి తప్పిందో.. లక్ష్యాన్ని విస్తరించుకుందో గానీ నేరుగా ప్రభుత్వ టీచర్లపై పిడుగులా పడిరది. 2001 సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీన ఎన్‌సీటీఈ దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలన్నింటికీ వర్తించేలా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం బీఈడీ, డీఈడీ తదితర ఉపాధ్యాయ కోర్సులు చేసిన వారితో సహా అందరూ టెట్‌ అర్హత సాధిస్తేనే టీచర్లుగా నియమించాలని స్పష్టం చేసింది. కానీ వాటిని చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ఆలస్యంగా అమల్లోకి తెచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే 2012 డీఎస్సీ నియామకాల నుంచే టెట్‌ అమల్లోకి వచ్చింది. అప్పటినుంచీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టెట్‌ నిర్వహిస్తున్నారు. కానీ మెజారిటీ మతపరమైన విద్యాసంస్థలు.. అంటే ముస్లింలకు చెందిన మదర్సాలు, క్రిస్టియన్‌ మిషనరీలు నడిపే పాఠశాలలు ప్రభుత్వ నిధులు అందుకుంటూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా మనుగడ సాగిస్తున్నా టీచర్‌ నియామకాల్లో ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ సంస్థలు తమ వర్గాలకు చెందిన వారినే ఎటువంటి అర్హత పరీక్షలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. దీన్ని అడ్డుకోవడమే సుప్రీం తీర్పు ప్రధాన ఉద్దేశం. ధర్మాసనం కూడా తన తీర్పులో ఈ విషయాన్ని పేర్కొంది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలన్నింటికీ తమ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30 ప్రకారం మైనారిటీ మత, భాషాపరమైన విద్యాసంస్థల్లో ఇష్టం వచ్చినట్లు నియామకాలు జరిపి నిర్వహించుకునే హక్కు తమకు ఉందని మైనారిటీ సంస్థలు వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ఎన్‌సీటీఈ నిబంధనల అమలు నుంచి తప్పించుకునేందుకు ఆర్టికల్‌ 30 ముసుగు ధరించడం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఆ క్రమంలో దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ టెట్‌ అర్హతనే ప్రామాణికంగా చేయాలని, దాన్ని 2001 సెప్టెంబర్‌ మూడో తేదీనుంచి వర్తింపజేయాలని చెప్పడంతోనే చిక్కొచ్చిపడిరది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన కోసమే ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వ తప్పిదాలకు బాధ్యత టీచర్లదా?

ఈ తీర్పు ఉపాధ్యాయ కమ్యూనిటీలో ఆందోళన, అసంతృప్తి రేకెత్తించింది. చట్టప్రకారం 2001`2011 మధ్య టెట్‌ పరీక్షలు నిర్వహించకుండానే టీచర్‌ నియామకాలు చేపట్టడం ప్రభుత్వాల తప్పిదని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఎవరు చేసినా తప్పు తప్పేనని.. అయితే దాని సరిదిద్దే పేరుతో ఎప్పుడో పదిహేను ఇరవయ్యేళ్ల క్రితం నియమితులై ఉపాధ్యాయ వృత్తిలో అపార అనుభవం సంపాదించిన వారిని, వేలాది పిల్లలను విద్యాబుద్ధులతో తీర్చిదిద్దినవారిని, ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్న వారిని మళ్లీ ఇప్పుడు టెట్‌ రాసి గురువులుగా పనికొస్తారో రారో నిరూపించుకోవాలని చెప్పడం పూర్తిగా అసమంజసం, అర్థరహితమని వాదిస్తున్నారు. దీన్ని పున:సమీక్షించాలని సుప్రీంకోర్టును ఉపాధ్యాయులు అభ్యర్థిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని టీచర్ల సంఘాలు, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశాయి. వాటిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇలా అన్ని వర్గాలు స్పందిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంతవరకు స్పందించకపోవడం పట్ల టీచర్లు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేలాది టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన ఈ తీర్పుపై స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి తీర్పు మార్పించేందుకు ప్రయత్నించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా టెట్‌ నిర్వహణకు కొద్దిరోజుల క్రితమే నోటిఫికేషన్‌ విడుదల చేయడం, అందులో సుప్రీం పేర్కొన్న విధంగా 2001`2011 మధ్య నియమితులైన టీచర్లు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించడం ఉపాధ్యాయవర్గాల ఆగ్రహానికి కారణమవుతోంది. మిగతా రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సవరించేందుకు ప్రయత్నిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకపోగా టెట్‌ నిర్వహణకు పూనుకోవడాన్ని తప్పుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయాధికారులు వంటి అనేక రంగాల వారికి లేని అర్హత పరీక్షలు ఒక్క టీచర్లకే ఎందుకని కూడా వారు నిలదీస్తున్నారు. నైపుణ్యం పెంపుదలకు, వృత్తిలో అప్‌డేట్‌ అయ్యేందుకే అయితే దాన్ని అన్ని రంగాల ఉద్యోగులకు వర్తింపజేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటినుంచీ అంటే 1980 దశకం నుంచి డీఎస్సీ అనే ప్రత్యేక నియామక పరీక్షల ద్వారా టీచర్ల నియామకాలు చేపడుతున్నందున మళ్లీ ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

`````````

మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్సీల వినతి

టెట్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేసి సవరణ తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేపాడ చిరంజీవి సహా పట్టభద్ర ఎమ్మెల్సీలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వారు మంత్రిని కలిసి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను, టీచర్ల అసంతృప్తి, ఆందోళనలను ఆయనకు వివరించారు. 2001` 2011 మధ్య డీఎస్సీల ద్వారా నియమితులైన వారిలో ఐదేళ్లలోపు సర్వీసు మిగిలినవారు మినహా అందరూ రెండేళ్లలో తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాలని, లేదంటే విధుల నుంచి తొలగించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. దీన్ని గమనంలోకి తీసుకుని తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని వారు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page