డీఈవో వలన.. డీఈవో కొరకు.. డీఈవో చేత!
- BAGADI NARAYANARAO
- Jul 28
- 2 min read
మాల్‌ప్రాక్టీసింగ్ అవాస్తవం
తిరుమల చైతన్యకు భయపడే డబ్బులిచ్చారంటూ స్టేట్‌మెంట్లు
విచారణ అధికారి ముందు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చిన యూనియన్ లీడర్లు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గడిచిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి జడ్పీ హైస్కూల్ కేంద్రంగా విద్యార్థులు మాల్‌ప్రాక్టీసింగ్‌కు పాల్పడ్డారని, ఇందుకోసం కుప్పిలి పాఠశాలలో పని చేస్తున్న గమస్తా కిశోర్‌కు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలుచేసి లంచాలిచ్చారని 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం పూర్తిగా డీఈవో తిరుమలచైతన్య కోసం ఆడిన నాటకమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తంగి మురళీమోహనరావు, మజ్జి మదన్మోహనరావు, చౌదరి రవీంద్ర, ఎస్‌వీ రమణమూర్తి, జి.రమణ, ఎస్.రమేష్‌బాబులు విచారణ అధికారి శ్రీనివాసులురెడ్డి ముందు లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు.

తిరుమల చైతన్య మీద వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది ప్రశ్నలను విచారణ అధికారి యూనియన్ నేతల ముందు ఉంచారు. దీనికి సమాధానం ఇచ్చిన మేరకు ఏ పరీక్షా కేంద్రంలో అయితే మాల్‌ప్రాక్టీసింగ్ జరిగిందని డీఈవో పేర్కొన్నారో, అదే పరీక్షా కేంద్రాన్ని ప్రశ్నాపత్రం ఇవ్వడానికి ముందు 30 నిమిషాల పాటు ఎచ్చెర్ల ఎంఈవో 2 రాజ్‌కిశోర్ ప్రతీ అంగుళం పరిశీలించారని, ఆయన కేంద్రం నుంచి బయటకు వెళ్లిన వెంటనే డీఈవోను పిలిచి పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగినట్లు కలరింగ్ ఇచ్చారని, ఇందుకోసం దళిత మహిళలను రంగంలోకి దించారని పేర్కొన్నారు. లావేరు ఎంఈవో`1 వాగ్దేవి, రాజ్‌కిశోర్‌లను కూడా విచారణ అధికారి లిఖితపూర్వకంగా సమాధానాలివ్వాలంటూ ప్రశ్నావళి అందించారు. డీఈవో కూడా తన ప్రశ్నలకు సమాధానమివ్వాలంటూ విచారణ అధికారి పేర్కొనగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తాను ఇస్తానంటూ డీఈవో సమాధానమిచ్చినట్టు భోగట్టా. పరీక్షా కేంద్రంలో దొరికాయని చెబుతున్న స్లిప్పులకు, ప్రశ్నపత్రానికి సంబంధం లేదని, ఇన్విజిలేటర్ సంతకం లేకుండా ఉద్దేశపూర్వకంగా డిబార్ చేయడం అశాస్త్రీయమని సంఘ నేతలు రాశిచ్చారు. బుడగట్లపాలెం, కొయ్యాం పాఠశాల ప్రధానోపాధ్యాయులను డీఈవో పిలిపించుకొని కుప్పిలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కిశోర్‌కు డబ్బులిచ్చామని బలవంతంగా స్టేట్‌మెంట్లు రాయించుకున్నారని సంబంధిత ప్రధానోపాధ్యాయులు విచారణాధికారికి రాసిచ్చారు. సుమారు 20 మంది అధికారులను ఒక పరీక్షా కేంద్రంలో హల్‌చల్ చేయించి, 90 నిమిషాల పాటు గందరగోళం సృష్టించడం వల్ల పరీక్షా కేంద్రంలో 25/1997 యాక్ట్ అమలుకాకుండా డీఈవో చేశారని యూనియన్ నేతలు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంతో సంబంధం లేని వ్యక్తులను కూడా సస్పెండ్ చేసి డీఈవో ఆయన కొరకు, ఆయన చేత, ఆయన వల్ల మాత్రమే ఇది సాధ్యమన్న రీతిలో వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. ఇవి కాకుండా డీఈవో మీద ఇతర అభియోగాలు కూడా ఉంటే చెప్పాలనడంతో 2023లో జరిగిన బదిలీల్లో తిరుమల చైతన్య అక్రమాలకు పాల్పడ్డారని, ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌కు రాని ఏడుగురికి మాన్యువల్‌గా ఉత్తర్వులిచ్చారని, ఇందుకోసం 10 శాతం ఖాళీలను బ్లాక్ చేశారని, 2024లో కేజీబీవీ పాఠశాలలో బోధన, బోధనేతర పోస్టులు నింపడానికి రోస్టర్ పాటించలేదని, 2025 బదిలీల్లో స్పౌజ్ నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకున్నారని, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులు కలిసి 40 మంది విద్యార్థులు లేకపోయినా ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారని, వమరవల్లి డైట్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా పాత భవనాలను కూల్చేసి, అందులో ఉన్న కలప, ఇనుమును లక్షల రూపాయలకు అమ్మేసి, డబ్బును ఆయన వ్యక్తిగతానికి వాడుకున్నారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విచారణాధికారికి లిఖితపూర్వకంగా తెలిపారు.

Comments