డాక్టర్ అప్పల్రాజు ఆన్ డ్యూటీ
- NVS PRASAD

- Nov 2, 2025
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వైద్యో నారాయణో హరి అనే పురాణ మంత్రానికి ఉదాహరణగా మారిన మాజీమంత్రి, వైకాపా నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనతో మళ్లీ తన పాత డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవడం, ఏడాది వ్యవధిలోనే మంత్రి కావడం, ఆ తర్వాత 2024 వరకు కీలకమైన మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిన సీదిరి అప్పలరాజులోని డాక్టర్ మళ్లీ చాలారోజుల తర్వాత బయటకు వచ్చారు. ఒకప్పుడు పలాస`కాశీబుగ్గ ప్రాంతంలో పేరొందిన ఫిజీషియన్‌గా పేదలకు అందుబాటులో ఉన్న అప్పలరాజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన గతం కంటే ఎక్కువగా రాజకీయాలు నెరుపుతున్నారు తప్ప ప్రాక్టీస్‌కు పోలేదు. కానీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరుగుతుందని తెలిసినవెంటనే ఘటన ప్రాంతానికి వైకాపా నేతగా వెళ్లిన సీదిరి అప్పలరాజు అక్కడి పరిస్థితిని చూసి డాక్టర్‌గా మారిపోయారు. గాయపడిన భక్తులను గుంపు నుంచి బయటకు తీసుకువచ్చి స్వయంగా ఆయనే కార్డియో పల్మనరీ రెససిటేషన్ (సీపీఆర్) చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో చూసిన ప్రజలు ఇదే మాట చెప్పుకుంటున్నారు. గుండెకు ఆక్సిజన్ అందక చావు అంచుల వరకు వెళ్లినవారిని ఈ సీపీఆర్ ద్వారా కాపాడవచ్చు. డాక్టర్ అప్పలరాజు అక్కడ అదే పని చేశారు. ఇద్దరు భక్తులు ఇంకా కొనఊపిరితో ఉన్నారని చూసిన అప్పలరాజు అక్కడికక్కడే ఇద్దరికీ సమాంతరంగా సీపీఆర్ అందించారు. స్థానిక వైకాపా నేతలతో కలిసి క్షతగాత్రులను పక్కకు తీసి ప్రాణం ఉన్నవారికి సీపీఆర్‌లు అందించారు. తొక్కిసలాటలో చలనం లేకుండా పడిపోయినవారిని పక్కకు ఊడ్చేస్తే, వారిలో గుండె కొట్టుకుంటుందా లేదా చూసింది మొదట డాక్టర్ అప్పలరాజే. నాడిని పరీక్షించి కొనప్రాణంతో ఉన్నవారిని స్వయంగా 108 అంబులెన్స్ ఎక్కించి, వాహనంలో కూడా సీపీఆర్‌ను అందించారు. నిరంతరం రాజకీయంలో తలమునకలైన నేతలు తమ గతంలో ఎంత మానవీయవాదులైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఘటనలను తమ ప్రయోజనానికి వాడుకుంటారు. రాజకీయ నాయకుడి కంటే ముందు తాను డాక్టర్‌నన్న విషయం, అంతకంటే ముందు సాటి మనిషినన్న మానవీయ కోణం రాజకీయ నాయకుడిలో ఇంకా బతికుండటం మానవత్వం మీద ఇంకా ఎక్కడో నమ్మకం పోకుండా నిలుపుతుంది.










Comments