డిగ్రీ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దెబ్బ
- BAGADI NARAYANARAO

- Jun 25, 2025
- 2 min read
ఈ విధానంతో కళాశాలల్లో తగ్గిపోతున్న ప్రవేశాలు
యాజమాన్య కోటాకు వర్తించని ఫీజు రీయింబర్స్‌మెంట్
ఇక్కడ సీటు కొనే బదులు ఇంజినీరింగ్‌లో చేరడానికే మొగ్గు
అడ్మిషన్ల ప్రక్రియపై నిర్ణయంలో సర్కారు స్థాయిలో జాప్యం

ఇంటర్ ఫలితాలు వెలువడి రెండు నెలలు గడిచింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు సైతం వచ్చేశాయి. మరోవైపు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తరగతులు జరుగుతున్నాయి. కానీ డిగ్రీ కళాశాలల్లో మాత్రం ఇంకా అడ్మిషన్లు జరగక.. అసలు ఎప్పుడు జరుగుతాయో తెలియక డిగ్రీ మొదటి సంవత్సరం క్లాస్‌రూములు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. డిగ్రీ అడ్మిషన్లకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానం కూడా చేపట్టాలని ప్రైవేట్ కళాశాలలు కోరుతుండటం, దానిపై నిర్ణయం తీసుకోవడంలో విద్యాశాఖ మంత్రి పేషీ చేస్తున్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలకు మరో 20 రోజులు పడుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సాధారణ ఎన్నికల వల్ల అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా కళాశాలల్లో వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది కూడా జాప్యం జరుగుతుండటంతో సీట్లు భర్తీ కావేమోనని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయి క్లాసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సింగిల్ సబ్జెక్ట్ విధానం అమలవుతోంది. దీన్ని డబుల్ సబ్జెక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ప్రైవేట్ డిగ్రీి కళాశాలల నుంచి అభిప్రాయాలు ఆహ్వానించగా అన్ని కళాశాలలు డబుల్ విధానం కోరుతూ లేఖలు ఇచ్చాయి. అలాగే డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానం అమలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ కళాశాల మాత్రం ఆఫ్‌లైన్‌లోనే ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించాయి. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అడ్మిషన్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఆలస్యంగా అడ్మిషన్లు చేపట్టడంతో అనేక కళాశాలల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా అడ్మిషన్లు మొదలుకాకపోవడంతో డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు.
ఖాళీగానే యాజమాన్య కోటా సీట్లు
గత విద్యా సంవత్సరం వరకు ఆన్‌లైన్ పద్ధతిలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేవారు. ఇంటర్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌లో రోస్టర్ విధానం ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించేవారు. 2020 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు నామమాత్రంగానే జరిగేవి. ప్రైవేట్ కళాశాలలో 70 శాతం కన్వీనర్, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు వంటి పథకాలు వర్తించవు. అందువల్లే విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటాలో చేరడానికి ఇష్టపడటంలేదు. ఫలితంగా తాము నష్టపోతున్నామంటున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 15 ప్రభుత్వ, 88 ప్రైవేట్ కళాశాలలు ఉండగా వీటిలో 23వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాదికేడాది ఈ సీట్ల సంఖ్య తగ్గుతున్నదని, ప్రస్తుతం ఈ సంఖ్య 18 వేలకు పడిపోయిందని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. సకాలంలో ప్రవేశాలు జరగకపోవడం, ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానం, మార్కులు, రోస్టర్ విధానం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లోనూ ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోవడంతో కొన్ని రకాల కోర్సులను ఎత్తేశారు. ప్రస్తుతం డిగ్రీలో బిఎస్సీ కంప్యూటర్స్ కోర్సులకే అత్యధిక డిమాండ్ ఉంది.
ఇంజినీరింగ్ దెబ్బ
ప్రభుత్వ రంగంలోని శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ కళాశాలలకు మాత్రమే డిమాండ్ ఉంది. ప్రైవేట్ రంగానికి సంబంధించి శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం తదితర ప్రాంతాల్లోని కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్‌తో పాటు బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు డిమాండ్ ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా ఇంటర్‌లో ఎంపీసీ చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీఈపీసెట్‌లో 60వేలు ర్యాంకు వచ్చినా కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీటు లభించే అవకాశం ఉంది. 20వేల ర్యాంకు వచ్చినవారికైతే కంప్యూటర్ సైన్స్‌లో సీటు లభించే అవకాశం కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్‌లో సీటు దక్కనివారు కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. కంప్యూటర్ కోర్సుపై మోజు ఉన్నవారు మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కొనుక్కొని మరీ చేరుతున్నారు. దీంతో డిగ్రీలో చేరడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య తగ్గిపోతోంది. కన్వీనర్ కోటాలో సీటు పొందేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అందుతుండటంతో ఎక్కువమంది ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది డిగ్రీలో కొన్ని కోర్సుల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో డిగ్రీలో ఎక్కువ మంది విద్యార్ధులు చేరాలంటే ఆఫ్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియే మార్గమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వాదిస్తున్నాయి.










Comments