top of page

డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోయినట్లే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 22, 2025
  • 2 min read

మేధోవలస.. దీన్నే ఆంగ్లంలో బ్రెయిన్‌ డ్రెయిన్‌ అంటారు. అంటే మనదేశానికి చెందిన ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు, అధిక సంపాదన పేరుతో విదేశాలకు ఎగిరిపోవడమన్నమాట. దీన్నే డాలర్‌ డ్రీమ్స్‌ అంటారు. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల వరకు ప్రభుత్వం అంటే ఈ దేశం కల్పిం చిన సౌకర్యాలు, వనరులతోనే చదువుకుని రెక్కలు వచ్చిన తర్వాత మాత్రం దేశాన్ని పట్టించుకోకుండా విదేశాలకు తరలిపోయి లక్షల డాలర్ల జీతాలకు అక్కడి కంపెనీల్లో పని చేస్తున్నారు. ఆ విధంగా మనదేశం, మన ప్రభుత్వం ద్వారా సముపార్జించిన విజ్ఞానాన్ని ఇతర దేశాలకు ధారబోస్తున్నారన్న మాట. ఇది తగదని తెలిసినా.. ప్రభుత్వాలు చెబుతున్నా ఇన్నాళ్లూ ఎవరికీ పట్టలేదు. ఇక్కడ ఏ ఇంజినీరింగో చదివి ఆపైన ఎంఎస్‌ చదవాలంటూ అమెరికా వెళ్లిపోవాలి. ఆ కోర్సు పూర్తి అయ్యే లోగా హెచ్‌`1బి వీసా ఇప్పించే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి. ఆపైన గ్రీన్‌ కార్డు తీసుకోవాలి. అది చూపించి అమెరికా పెళ్లి కొడుకు అన్న ట్యాగ్‌ తగిలించుకుని ఇండియాలో భారీ కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెరికాలోనే సెటిలవ్వాలి. ఇది కొన్ని దశాబ్దాలుగా ఎగువ మధ్యతరగతి, సంపన్న కుటుంబాల స్వప్నం. దాన్నే తమ పిల్లలకు భవిష్యత్తు అజెండాగా చిన్నతనం నుంచి నూరిపోస్తున్నారు. అయితే ట్రంప్‌గారి వీసా ఆంక్షలు, లక్ష రూపాయల ఫీజు ఈ వర్గంవారి డాలర్‌ డ్రీమ్స్‌పై నీళ్లు చల్లాయి. కోవిడ్‌ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారాయి. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం దానికి తోడైంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా, ఇంకొన్ని అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు తప్ప అమెరికా, యూరోపియన్‌ తదితర అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మంద గమనం, ప్రభుత్వ అప్పులు, అక్రమ వలసలు, తగ్గిన ఉద్యోగ కల్పన వంటి సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఇవే ఆయా దేశాల ప్రజల్లో అసంతృప్తిని రాజేస్తున్నాయి. వీటినే బూచిగా చూపిస్తూ ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అనే నినాదంతో డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. పీఠం అధిష్టించిన మరక్షణం నుంచే సరైన ఆలోచన చేయకుండానే నిర్ణయాలు తీసేసుకుంటూ.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ఎడాపెడా సంతకాలు గీకేస్తూ ఇతర దేశాలనే కాకుండా తనను గెలిపించిన అమెరికన్లకు సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తూ అయోమయంలోకి నెట్టేస్తు న్నారు. ముఖ్యంగా వలసదారులను దేశం నుంచి తరిమేసేందుకు కంకణం కట్టుకున్నారు. అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తిప్పి పంపే కార్యక్రమం చేపట్టారు. రుణభారంతో సతమతమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే నెపంతో ఇతర దేశాల మీద భారీ సుంకాలు విధించారు. విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వ నిధుల మంజూరు నిలిపివేయడం లేదా కోత విధించడం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇళ్లకు సాగనంపే కార్యక్రమాలూ చేపట్టారు. దిగుమతులు తగ్గించి.. ఆయా వస్తువులను అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చిన ట్రంప్‌.. ఇటీవలే టెక్‌ కంపెనీల సమావేశంలో మాట్లాడుతూ భారత్‌ సహా విదేశీయులను కాకుండా అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని క్లాస్‌ పీకారు. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్‌ అవ్వాలనుకునే విదేశీ ఉద్యోగార్థుల విషయంలో పిడుగుపాటు లాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్‌ కంపెనీలు నైపుణ్యం కలిగిన వారికి హెచ్‌`1బి వీసా స్పాన్సర్‌ చేసి మరీ భారీ జీతాలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఆ హెచ్‌`1బి వీసా రుసుము రూ.15 వేల డాలర్లు ఉండగా దాన్ని ఏకంగా లక్ష డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.88లక్షలు)కు పెంచేశారు. అలాగే పది లక్షల డాలర్లు చెల్లిస్తే అమెరికాలో నివాసానికి అనుమతిస్తూ ట్రంప్‌ గోల్డ్‌ కార్డు ప్రవేశపెట్టారు. అమెరికన్‌ కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే సగటు జీతమే ఏడాదికి 80 వేల డాలర్ల నుంచి లక్షన్నర డాలర్ల వరకు ఉంటుంది. అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారికే ఆ స్థాయి వేతనాలు ఇస్తారు. అలాంటిది వీసా కోసమే ఏటా తమ ఉద్యోగులపై లక్ష డాలర్లు వెచ్చించడం కంపెనీలకు దాదాపు అసాధ్యం. ఈ నిర్ణయం అమెరికా వెళ్లాలనుకునే అన్ని దేశాలవారికీ వర్తిస్తుంది. అయితే హెచ్‌ 1బి వీసాతో అమెరికాలో పని చేస్తున్న విదేశీయుల్లో 70 శాతానికిపైగా భారతీయ నిపుణులే ఉంటున్నారు. అందువల్ల భారతీయులపైనే దీని ప్రభావం అధికం గా ఉంటుంది. మన యువత డాలర్‌ డ్రీమ్స్‌ను కల్లలు చేస్తుందంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page