top of page

తోక ముడిచిన పాక్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 11
  • 3 min read

స్నేహసౌభ్రాతృత్వాలను పెంపొందించే క్రీడలను వైషమ్యాలకు వేదికలుగా మార్చుకునేందుకు.. బంగ్లాదేశ్ భుజంపై తుపాకీ పెట్టి భారత్‌కు గురిపెట్టడం ద్వారా ఇన్నాళ్లూ దాయాదిపై పెంచుకున్న కక్షను కాస్తయినా తీర్చుకోవడంతోపాటు స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్ చివరికి ఏదీ సాధించలేక బొక్కబోర్లాపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా భారత్‌ను శాసించాలన్న దుస్సాహసానికి తెగబడి చివరికి తనే క్రికెట్ దేశాల ముందు బొక్కబోర్లాపడింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకలోని వేదికలకు మార్చాలన్ని చివరి రోజుల్లో మారాం చేసి టీ20 వరల్డ్‌కప్ నుంచి తొలగింపునకు గురైన బంగ్లాదేశ్‌కు సంఘీభావం పేరుతో అసంతప్తి మంటలు రాజేసి చలి కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ చివరికి తన ప్రయోజనాలకే ఎసరు వచ్చే ప్రమాదం ముంచుకొస్తున్న విషయం తెలుసుకుంది. మొదట మొత్తం వరల్డ్ కప్ టోర్నీనే బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. తర్వాత భారత్‌తో కొలంబోలో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామని బీరాలు పోయింది. అయితే ఊహించని విధంగా నలువైపుల నుంచీ అసంతప్తి, ఒత్తిళ్లు పెరగడం.. చివరికి తాను ఏ దేశం పేరుతో క్రీడారాజకీయం చేయాలనుకుందో.. ఆ బంగ్లాదేశే బహిష్కరణ వద్దని చెప్పడంతో పాకిస్తాన్‌కు తోకముడవక తప్పలేదు. ఇప్పటికే కొన్నేళ్లుగా భారత్`పాక్‌లే తమ దేశాల్లో నేరుగా తలపడటంలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం వేరే దేశాల్లోని తటస్థ వేదికల్లో మాత్రమే ఆ రెండు దేశాలు తలపడుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో షెడ్యూల్ చేశారు. ఆ మేరకు ఒకే గ్రూప్‌లో ఉన్న ఈ రెండు దేశాలు ఈ నెల 15న లీగ్ పోటీ ఎదుర్కోవాల్సి ఉంది. దీనిపైనే పాక్ రాజకీయం చేయడానికి ప్రయత్నించింది. అది ఏ స్థాయి పోటీ అయినా సరే భారత్`పాక్ మ్యాచ్ అంటే చాలూ క్రికెట్ ప్రపంచం ఉర్రూతలూగుతుంది. టికెట్లు, స్పాన్సర్‌షిప్‌లు, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు.. ఇలా అనేక రూపాల్లో అభిమానం, ఉత్కంఠతోపాటు కాసుల వర్షం కురుస్తుంది. ఆ మేరకు ఈ నెల 5న జరగాల్సిన మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన తరుణంలో దాన్ని బహిష్కరిస్తామని పాక్ చేసిన ప్రకటన ఎంత కలకలం రేపిందో.. అంతకంటే ఎక్కువగా అసంతప్తి, ఆగ్రహం రాజేసింది. పాక్ వైఖరిపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇవ్వాల్సిన రెవెన్యూ వాటాను నిలిపేస్తామని, దీర్ఘకాలంపాటు ద్వైపాక్షిక సిరీస్‌లు సైతం ఆడకుండా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు వరల్డ్‌కప్ టోర్నీ ప్రసార హక్కులు పొందిన బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సైతం రంగంలోకి దిగి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే నష్ట పరిహారంగా పీసీబీ భారీ మొత్తాన్ని సదరు సంస్థకు చెల్లించాల్సి వస్తుంది. ఓవైపు ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం ఆగిపోయి మరోవైపు బ్రాడ్‌కాస్టర్‌తో న్యాయపోరాటం చేయాల్సి వస్తే పీసీబీ ఆర్థిక కష్టాల్లో మునిగిపోక తప్పదు. అదే సమయంలో ఈ టోర్నీకి భారత్‌తో పాటు కో ీVAస్ట్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డుతోపాటు యూఏఈ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ బోర్డుకు ఘాటు లేఖలు రాశాయి. శ్రీలంక బోర్డు సెంటిమెంట్‌తో కొట్టింది. ఉగ్రవాదుల కాల్పుల భయం, శాంతిభద్రతల కారణంతో పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడటానికి ఏ దేశమూ ముందుకు రాని పరిస్థితుల్లో తమ జట్టును ధైర్యంగా పాకిస్తాన్‌కు పంపించి ఆడించిన విషయాన్ని పాక్ బోర్డుకు గుర్తుచేసింది. అలాంటిది తమ దేశం అతిధ్య భాగస్వామిగా ఉన్న టోర్నీలో తమ దేశ రాజధాని కొలంబోలోనే జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తారా? అని నిలదీసింది. పాక్ నిర్ణయం వల్ల తమకు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుందంటూ.. ఇదేనా మీ స్నేహధర్మం.. అని శ్రీలంక క్రికెట్ బోర్డు పాక్‌ను ఎత్తిపొడిచింది. మరోవైపు తోటి ఇస్లామిక్ దేశం, ఎన్నో విధాలుగా చేయూతనిస్తున్న యూఏఈ క్రికెట్ బోర్డు కూడా బహిష్కరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది. ‘ఓ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని కోరుతున్నాం. భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోండి. దీని వల్ల అసోసియేట్ దేశాల ఆదాయంపై ప్రభావం పడుతుంది’ అని తన ఈ మెయిల్ లేఖలో యూఏఈ పేర్కొంది. పాకిస్తాన్‌లో క్రికెట్ సిరీస్‌ల నిర్వహణపై ఐసీసీ నిషేధం విధించిన సమయంలో.. యూఏఈ తన వేదికలను పాకిస్తాన్‌కు ఇచ్చి సాయపడింది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌లను కూడా యూఏఈ లేదా శ్రీలంక లాంటి తటస్థ వేదికల్లోనే భారత్ ఆడనుంది. అలాంటప్పుడు పాక్ బాటలోనే ఆ మ్యాచ్‌లను ఆడబోమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటిస్తే తమకు భారీ నష్టం వాటిల్లుతుందనేది ఈ దేశాల క్రికెట్ బోర్డుల ఆందోళన. అందుకే ఈ రెండు బోర్డులు పీసీబీ మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి అనే కంటే ఒకవిధంగా గట్టి ఒత్తిడి తెచ్చాయి. ఇక భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆడబోమంటూ టోర్నీ నుంచి బయటకొచ్చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా భారత్‌తో మ్యాచ్ ఆడాలని పీసీబీకి రిక్వెస్ట్ చేసింది. ‘క్రికెట్ మంచి కోసం ఆడండి’ అని పైకి చెప్పినప్పటికీ.. అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే.. ఆ దేశంతోపాటు టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపైనా ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం. అదే జరిగితే రెండు బోర్డులూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి బీసీబీ పాక్‌ను వాడుకుంది. అయితే అప్పటికీ బెట్టు వీడనట్లు నటిస్తూ భారత్ తమ దేశంలో మ్యాచ్‌లు ఆడకపోవడం వల్ల రెవెన్యూ తగ్గుతోంది కాబట్టి తమ రెవెన్యూ వాటా పెంచాలని, భారత్ తమ దేశానికి వచ్చి ఆడేలా ఒప్పించాలన్న పాక్ డిమాండ్లను ఐసీసీ నిర్మొహమాటంగా తిరస్కరించింది. అదే సమయంలో అనివైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఉక్కిరిబిక్కిరైన పాక్ చివరికి లొంగుబాటలోకి రాకతప్పలేదు. భారత్‌తో మ్యాచ్ ఆడతామని ప్రకటించక తప్పలేదు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page