తండ్రి మృతి.. కొడుకు ఆస్పత్రిపాలు
- BAGADI NARAYANARAO
- May 20
- 1 min read
పిడుగుపాటుతో మరో ఇద్దరికి గాయాలు
బలగ బూబమ్మనగర్ కాలనీలో పండగ వేళ విషాదం
మరో రెండురోజులు పిడుగులు, వర్షాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వాతావరణం ఒక్కసారి మారిపోయింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండగా.. శ్రీకాకుళం నగరంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. బలగ బూబమ్మనగర్ కాలనీకి చెందిన గేదెల రాజారావు (55) మృతి చెందగా మరో ముగ్గరు తీవ్రగాయాలపాలయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం నాగావళిలో పొట్టేలు పొట్టు శుభ్రం చేస్తున్న వ్యక్తులు పిడుగుపాటుకు గురయ్యారు. దాంతో రాజారావు అనే వ్యక్తి అక్కడే మృతి చెందాడు. రాజారావు కుమారుడు నాగార్జునతో పాటు బలగ బుచ్చిపేటకు చెందిన దేశెళ్ల రాజారావు, బైరి రామారావు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రిలో చేర్పించి, మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడు రాజారావు తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజారావు మృతితో అమ్మవారి పండగలతో సందడిగా ఉన్న బలగలోని బుచ్చిపేటలో విషాదం అలముకుంది. పండగల కోసం వచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మంత్రి దిగ్భ్రాంతి
రాజారావు మృతి పట్ల వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.

Comentários