తోడేస్తే.. తోలు తీస్తాం!
- NVS PRASAD

- Jul 8, 2024
- 3 min read
ఇసుకాసురులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్
ఉచితం ముసుగులో తవ్వకాలకు సిద్ధమైన అక్రమార్కులు
నదుల వద్ద లారీలు, జేసీబీలతో మోహరింపు
అయితే ప్రస్తుతానికి స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకకే అవకాశం
లారీల్లో తరలింపు, ఒడిశా బిల్లులు చెల్లవన్న కలెక్టర్
ఉచితం ముసుగులో నదీగర్భాలను కుళ్లబొడవడానికి సిద్ధమైపోయిన ఇసుకాసురులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఆసరా చేసుకుని ఇష్టారాజ్యంగా నదీ గర్భాలను తొలిచేసి ఇసుక వ్యాపారం చేసుకోవచ్చన్న అత్యాశతో అక్రమార్కులు ఆదివారం రాత్రి నుంచే జిల్లాలోని నాగావళి, వంశధార, బాహుదా నదీతీరాల్లోని రీచ్‌ల వద్ద లారీలు, జేసీబీలతో కాపుకాశారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం అక్రమంగా నదుల్లో ఇసుక తోడేస్తే తోలు తీస్తామని హెచ్చరికలు పంపింది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం వాస్తవమే అయినా దాని అర్థం నదుల్లో ఉచితంగా ఇసుక తవ్వుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకకే ఉచిత విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నదుల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి తవ్వకాలకు ఎవరికీ అనుమతి లేదని వివరించింది. ఉచితం పేరుతో తవ్వకాలు, అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినప్పటికీ దానికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం వరకు జీవో విడుదల చేయలేదు. దాంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న ప్రతిమ కంపెనీ తవ్వి స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే విక్రయించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలోని జాయింట్ కమిటీ నిర్ణయించింది. ఆ ప్రకారం పాతపట్నం నియోజకవర్గం అంగూరు స్టాక్ పాయింట్‌లో ఉన్న 30వేల టన్నులు, టెక్కలి స్టాక్ పాయింట్‌లో ఉన్న ఏడువేల టన్నుల ఇసుకను మాత్రమే ఉచితంగా అందజేసేందుకు అందుబాటులో ఉంది. ఇసుక కావలసినవారు జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి టన్ను ఇసుకకు రూ.350 చొప్పున ఆన్‌లైన్ పేమెంట్ చేసి, లోడిరగ్ ఛార్జీల కింద టన్నుకు రూ.30 చొప్పున చెల్లిస్తే ఇసుక తరలించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని నాగావళి, వంశధార, బాహుదా నదుల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం స్టాక్‌పాయింట్లలో ఉన్న ఇసుకను కూడా రోజుకు 200 టన్నులకు మించి అమ్మకూడదని కలెక్టర్ నిర్ణయించారు. అలాగే లారీలతో పక్క జిల్లాలకు తరలించడాన్ని కూడా నిషేధించారు. జిల్లా అవసరాలకు ట్రాక్టర్లు, నాటుబళ్లలో మాత్రమే ఇసుక తరలించాలనే నిబంధన విధించారు. టన్నుకు రూ.350 చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో ఒక బిల్లు విడుదల చేస్తారు. ఇది మాత్రమే చెల్లుబాటవుతుంది. అది కాకుండా లారీలతో ఇసుక కనిపించినా, ఒడిశా బిల్లులు చూపించినా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సిద్ధమవుతున్నారు. వాస్తవానికి జిల్లాలో లక్ష టన్నులకు పైగా ఇసుక నిల్వ ఉండాలి. కేవలం 37 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల జిల్లా అవసరాలకు కాకుండా పెద్ద ఎత్తున పక్క జిల్లాల్లో వ్యాపారానికి తరలిపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్గదర్శకాలు అందాకే పూర్తిస్థాయిలో అమలు
ఉచిత ఇసుక విధానంపై ఇంకా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయలేదు. అందుకే విధానం ఉచితమని ప్రకటించినా, దాని అంతిమ రూపురేఖలు ఎలా ఉంటాయన్నది తెలియదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక పేరుతో ఇప్పటికే నదులను తొలిచేస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం స్టాక్‌పాయింట్లలో ఇసుక విక్రయానికే వెసులుబాటు కల్పించింది. ఇంకా నదుల్లో రీచ్‌లకు అనుమతులు ఇవ్వలేదు. సోమవారం నాటికి ఉన్న లెక్కల ప్రకారం స్టేషనరీ, మ్యాన్ పవర్ ఛార్జీలు, 18 శాతం జీఎస్టీ కలిపితే టన్ను ఇసుకకు సీనరేజ్ రూ.88 పడుతుంది. దీన్ని ఏ పంచాయతీ పరిధిలోని నది నుంచి ఇసుకను తరలించారో ఆ పంచాయతీ అభివృద్ధికి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇక ట్రాక్టర్లలో లోడ్ చేయడానికి టన్నుకు రూ.30 వసూలు చేస్తున్నారు. దీన్ని జేసీబీ ఏర్పాటుచేసిన సంస్థకు అందిస్తారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానానికి జిల్లాలో ఏయే రేవుల్లో అనుమతులివ్వాలి, అందులో అక్రమంగా తరలిస్తే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పాత్ర ఏమిటి, గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన మైనింగ్ శాఖ బాధ్యతలేమిటి, డీ పట్టా భూముల్లో ఇసుక ఉంటే రైతుకు ఎంత చెల్లించాలి వంటి అంశాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇప్పటికే యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
కానీ ఈలోగానే జిల్లాతోపాటు రాష్ట్రంలో అనేక చోట్ల ఇసుకను అనధికారికంగా తవ్వుకుపోతున్నారు. ప్రశ్నిస్తే ఉచిత ఇసుక విధానమని సమాధానమిస్తున్నారు. చివరకు జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే తన పరిధిలో ఇసుక ఉన్నప్పుడు అది తనదేనని, తనకు తెలియకుండా లిఫ్ట్ చేయడం సరికాదంటూ గొడవకు దిగారు. దీంతో జిల్లా కలెక్టర్ కల్పించుకొని స్టాక్‌పాయింట్‌లో ఉన్న ఇసుక ఎమ్మెల్యేల సొంతం కాదని సర్దిచెప్పడంతో సోమవారం ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడిరది. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో అయితే ప్రతిరోజూ ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఫోన్లు చేయడం, కేకలు వేయడం షరామామూలుగా మారిపోయింది. అయినా కూడా ఇసుకాసురులు వెనక్కు తగ్గడంలేదు. పాలకొండ, రాజాం నియోజకవర్గాల పరిధిలో అయితే ఇసుక విచ్చలవిడిగా తరలిపోతోంది. ఒడిశా బిల్లులు చూపించి జిల్లాలో పెద్ద ఎత్తున నదీ గర్భాలను తొలిచేస్తున్నారు. ఒక లారీకి రూ.20వేలు వసూలుచేసి అందులో స్థానిక ప్రజాప్రతినిధులకు రూ.12వేలు, మీడియా, పోలీసులకు మరికొంత మొత్తాన్ని బహిరంగంగానే పంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకొండ నియోజకవర్గంలో గోపాలపురం, ఆర్.వెంకటాపురం, యరకరాయపురం, రేగిడి ఆమదాలవలసలో తునివాడ, రాజాంలో చినమంగళాపురంతో పాటు సంతకవిటి, వంగర, బూర్జ మండలాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అడిగే నాధుడు లేకుండాపోయారు. అందుకే జిల్లాలో ఇసుక బిల్లింగ్ విధానంపై పకడ్బందీ వ్యూహం అమలుచేయాల్సిన అవసరం ఉంది. జిల్లాకు ఆనుకొని ఒడిశా ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అయితే ఏకంగా ఒక ప్రజాప్రతినిధి డూప్లికేట్ బిల్లింగ్ పరికరాన్నే తయారుచేయించి విచ్చలవిడిగా ఇసుక అమ్మేశారు. ఇలాంటి అనుభవాల నేపధ్యంలో బిల్లింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అలాగే కేవలం ఇసుక కోసం జిల్లా నలువైపులా చెక్‌పోస్ట్ వ్యవస్థను తీసుకురావడానికి స్వప్నిల్ దినకర్ రూట్‌మ్యాప్ తయారుచేస్తున్నారు. ఉచిత ఇసుక జీవో రాకపోవడం వల్ల 2019 నాటి ఇసుక పాలసీయే ప్రస్తుతం నడుస్తోంది. రెండు రోజుల్లో స్టాక్‌పాయింట్లలో ఇసుక పూర్తిగా విక్రయించాక ఇరిగేషన్ శాఖ అనుమతులతో తోటపల్లి బ్యారేజ్ వద్ద ఉన్న పూడిక ఇసుకను తవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం లారీలు, ఒడిశా బిల్లులతో రవాణా జరిపితే దొరికిపోయే అవకాశం ఉంది. కావాల్సిందంతా సెబ్ అధికారులకు చిత్తశుద్ధే.










Comments