తొమ్మిది దశాబ్దాల తర్వాత కులగణన
- DV RAMANA

- Jun 17, 2025
- 2 min read

ఎట్టకేలకు దేశంలో కులగణనకు రంగం సిద్ధమైంది. దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత కులాలవారీ జనాభా లెక్కలు వెల్లడికానున్నాయి. ఈ గణాంకాలు ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, కార్యక్రమాల అమలులో సామాజిక, ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుందని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాలు గేళ్ల క్రితం వాయిదా పడిన జనాభా గణన కార్యక్రమంతో పాటే కులాల వారీ జనసంఖ్యను గణించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2026లో ప్రారంభమై 2027 నాటికి రెండు దశల్లో సెన్సెస్ ముగుస్తాయి. కొత్త జనాభా లెక్కలే 2029 లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ప్రామాణికం కానున్నాయి. బ్రిటీష్ హయాంలో 1872లో దేశంలో తొలిసారి జనాభా లెక్కల సేకరణ జరిగింది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహించేవారు. ఇప్పటి వరకు 15 సార్లు దేశంలో జన గణన జరిగింది. స్వాతం త్య్రానంతరం.. అంటే 1949 తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనాభా లెక్కల సేకరణ బాధ్యత తీసు కుంది. చివరిసారి 2011లో జనగణన జరిగింది. ఆ లెక్కన 2020లో మళ్లీ సెన్సెస్ చేపట్టి 2021లో కొత్త లెక్కలు ప్రకటించాల్సి ఉంది. కానీ కరోనా విపత్తు కారణంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఎట్టకేలకు నాలుగేళ్లు ఆలస్యంగా ఇప్పుడు ముహూర్తం కుదిరింది. దీనివల్ల పదేళ్లకోసారి నిర్వహించాల్సిన జనగణన సైకిల్ మారిపోతుంది. ఆ ప్రకారం మళ్లీ 2036లోనే జనగణన జరుగుతుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దానికి జనాభా లెక్కలే ప్రామాణికం. జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పరిధి కుదింపు, పెంపు ఉంటుంది. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు ఎప్పుడో 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోవడం వల్ల కొంత అన్యాయం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. 2029 పునర్విభజనలో అటువంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా కొత్త జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి జనగణనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. జనాభా వివరాలతో పాటు కులాలవారీ లెక్కలు కూడా సేకరించనున్నట్లు నోటిఫి కేషన్‌లో కేంద్రం వెల్లడిరచింది. దాదాపు 90 ఏళ్లుగా దేశంలో కుల జనాభా వివరాలు సేకరించలేదు. ఎప్పుడో బ్రిటీషర్ల కాలంలో 1931లో చివరిసారి సేకరించిన కులగణన లెక్కలే అధికారికంగా అందుబాటు లో ఉన్నాయి. వాస్తవానికి జనాభా గణనతో పాటే కులాలవారీ జనగణన కూడా చేపట్టేవారు. ఆ విధంగా 1931 వరకు బ్రిటీష్ ప్రభుత్వం సేకరించింది. 1941లోనూ కులగణన జరిపించినా ఆ గణాంకాలను ఎందుకనో విడుదల చేయలేదు. దాంతో 1931 కులగణన లెక్కలే చివరి అధికారిక లెక్కలు. అయితే పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణతో పాటే ఎస్సీ, ఎస్టీ జనసంఖ్యను లెక్కిస్తున్నారు. మిగతా కులాల గణన మాత్రం స్వాతంత్య్రానంతరం నిలిచిపోయింది. కులాలవారీగా జనాభా వివరాలు సేకరిస్తే భారతీయ సమాజంలో కులమత వైషమ్యాలు పెరిగే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తం కావడంతో స్వాతంత్య్రానంతరం అధికారం చేపట్టిన భారత ప్రభుత్వాలు కులగణనను నిలిపివేశాయి. కానీ 2011లో నిర్వహించిన జనగణనతో పాటు కేంద్రం సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించింది. 2016లో వాటి లోనే ఇతర గణాంకాలను ప్రకటించిన కేంద్రం, కులాలవారీ లెక్కలను మాత్రం బయటపెట్టలేదు. ఈ నిర్ణ యాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం స్పందించింది. సామాజిక, ఆర్థిక కులగణనలో చాలా లోపాలు ఉన్నట్లు గుర్తించామని, ఆ సమాచారం ఉపయోగపడదు కనుకనే బయటపెట్టలేదని న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా కులగణన చేపట్టా లన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ లెక్కలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల అమలులో చాలా కులాలకు అన్యాయం జరుగుతోందన్న రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దామాషా ప్రకారం రిజర్వేషన్లతో సహా పథకాలు వర్తింపజేయాలంటే కులలవారీ జనాభా లెక్కల సేకరణ అనివార్య మని స్పష్టం చేస్తున్నాయి. దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కుల గణన పేరుతో ఓ సర్వే నిర్వహించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులసర్వే నిర్వహించి, వివరాలు ప్రకటించినా, అవి తప్పులతడకగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ చివరి కేంద్రమే దిగి వచ్చి కులగణనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి శాస్త్రీయంగా కులాల లెక్కలు వెల్లడయ్యే అవకాశం ఉంది.










Comments