top of page

తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jan 7
  • 2 min read
  • తమ్మినేని పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా మరోసారి ప్రకటన

  • ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం

  • సాయిరాజ్‌ తప్పుకోవడంతో తాజా నిర్ణయం

  • జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్తగా సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని నియమిస్తూ, అక్కడ ఇంతవరకు ఇన్‌ఛార్జిగా ఉన్న పిరియా సాయిరాజ్‌ను పార్టీ సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సీతారాంను పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు మరోసారి ప్రకటించడం వెనుక ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలే కారణమని వేరేగా చెప్పనక్కర్లేదు. జగన్మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా టెక్కలిలో జరిగిన సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ఎంపీగా కొత్త వ్యక్తిని రంగంలోకి దించుతామంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. జిల్లాలో వెలమలు, కాళింగులు రెండు గ్రూపులుగా విడిపోయి సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగాయి. భవిష్యత్తులో సీతారాంను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుపుతుందా లేదా అన్నది పక్కన పెడితే మళ్లీ పొజీషన్‌లో ఉన్న వ్యక్తిని కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. కృష్ణదాస్‌ ప్రకటన పార్టీలో అప్పట్లో పెద్ద చర్చనే లేవనెత్తింది. అదే సమయంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కాళింగులు దాదాపు 30వేల మందితో సమావేశం కావడంతో రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. దీనికి సమాంతరంగా వైకాపాలో కాళింగులకు పొగపెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పదే పదే ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే సీతారాంను ధర్మాన ప్రసాదరావు సోదరులు తప్పిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. దాంతో ఈ వ్యవహాంలో తమ ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ధర్మాన సోదరులకు ఏర్పడిరది. అందుకే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పుల సందర్భంలోనే సీతారాంను కూడా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నట్టు ప్రత్యేకంగా పేర్కొనాల్సి వచ్చింది.

ఆ కుటుంబం తప్పుకోవడం వల్లే

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల వల్ల వరుసగా రెండుసార్లు ఓటమిపాలు కావడం, ఇప్పటికీ అవే గ్రూపులు కొనసాగుతుండటంతో విసిగి వేసారిపోయిన పిరియా సాయిరాజ్‌ భవిష్యత్‌ ఎన్నికల్లో పోటీలో ఉండలేమంటూ స్వయంగా అధినేత జగన్మోహన్‌రెడ్డికే స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తమ కుటుంబానికే టిక్కెట్‌ అని జగన్‌ చెప్పినా ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఉండలేమంటూ సాయిరాజ్‌ తప్పుకోవడంతో సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేరు ప్రకటించారు. ఇక్కడి వరకు సాయిరాజ్‌ అభీష్టం మేరకే అంతా జరిగినా, ప్రస్తుతం జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సాయిరాజ్‌ సతీమణి పిరియా విజయ ఆ పదవికి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మీదో, దాని అధినేత మీదో, లేదా జిల్లా నాయకత్వం మీదో ఎటువంటి ఆరోపణలు లేకుండా కేవలం ఇచ్ఛాపురం రాజకీయ ముఖచిత్రాన్ని రాష్ట్రస్థాయిలో ఆవిష్కరించడం కోసమే ఆమె రాజీనామా చేస్తారని, భవిష్యత్తులో స్వయంగా జగన్మోహన్‌రెడ్డే ఈ నియోజకవర్గంపై దృష్టి సారించేందుకు తన రాజీనామా ఉపయోగపడుతుందనే భావనతో ఆమె ఉన్నట్టు తెలిసింది. అయితే ఇచ్ఛాపురం కోఆర్డినేటర్‌ పదవిని వదులుకున్న వెంటనే జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవికి కూడా రాజీనామా చేస్తే సాయిరాజ్‌ దంపతులు పార్టీ మారతారన్న కథనాలు వస్తాయని, ఎలాగూ ఏడాదిలో ముగిసిపోనున్న పదవికి రాజీనామా చేసి తప్పుడు సంకేతాలు ఇవ్వడం సరికాదేమోనన్న భావనతో సాయిరాజ్‌ ఉన్నట్టు భోగట్టా. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ సాయిరాజ్‌ కుటుంబం పట్ల సానుభూతితోనే ఉన్నారు. మరోవైపు సీతారాం కొనసాగుతారన్న సంకేతాలు ఇవ్వగలిగారు. ఇప్పటి వరకు ఈ అంశంపై రేగిన తుపాను అల్పపీడనంగా బలహీనపడి జిల్లా తీరం దాటిపోయినట్టే. అయితే భవిష్యత్తులో ఎంపీ అభ్యర్థిగా సీతారాం ప్రొజెక్ట్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తారా లేక ఎప్పటిలాగే తన కుమారుడికి ఆమదాలవలస టిక్కెట్‌ ఇస్తే తాను ఎంపీగా వెళ్తానని మిన్నకుండిపోతారా? అనేది ఆయన చేతిలోనే ఉంది. చాలా కాలం తర్వాత మళ్లీ రెడ్డిక సామాజికవర్గానికి ఇచ్ఛాపురంలో గుర్తింపు దక్కినట్టయింది. అయితే హ్యాట్రిక్‌ విజయాల జోరు మీద ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఢీకొట్టాలంటే అక్కడ సాయిరాజ్‌ కుటుంబం కూడా కలిసి పని చేయాల్సిందే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page