తూర్పు తీరం.. తుపాన్లు తీవ్రం!
- DV RAMANA

- Oct 30, 2025
- 3 min read
బంగాళాఖాతంలోనే అత్యధిక సైక్లోన్లు
ఈ సముద్రంలో ఉష్టమండల పరిస్థితులే కారణం
తీవ్ర బాధిత రాష్ట్రాలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్
ఏడాదిలో చివరి నాలుగు నెలల్లోనే అధికం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
తీవ్ర తుపాను మొంథా రాష్ట్రంలో దాదాపు 15 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లజేసి తీరం దాటినా.. ఇప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటువంటి సూపర్ సైక్లోన్లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయి. మన పూర్వీకులు, పెద్దలు చెప్పేదాన్ని బట్టి వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల ముందు ముసురు పట్టడం కామన్. వాటినే చవితి ముసురు, దసరా ముసురు, దీపావళి ముసురుగా అభివర్ణించేవారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాకపోతే.. ముసురు కాస్త ముంచేత్తే తుపానుగా మారుతోంది. మనదేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నాయి. వీటి వల్లే వాయుగుండాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. సముద్ర అంతర్భాగంలో పెరిగే ఉష్ణోగ్రతలు, వాయు పీడనాల కారణంగా దశలవారీగా తుపాన్లు ఏర్పడుతుంటాయి. మొదట ఆవర్తనంగా మొదలై తర్వాత అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండం.. అనంతరం తుపాను, తీవ్ర తుపానులుగా బలుపడుతూ ఆ మేరకు ప్రభావం చూపుతుంటాయి. అయితే ప్రపంచంలో అత్యధిక తుపాన్లు ఏర్పడే సముద్రాల్లో బంగాళాఖాతం ఒకటి. ఈ సముద్రంలో ప్రతి ఏటా తుపాన్లు పుడుతుంటాయి. అందులోనూ ప్రతి పదేళ్లకోసారి భారీ తుపాన్లు సంభవిస్తాయి. 1891 నుంచి 2019 వరకు బంగాళాఖాతం పరిధిలోని వివిధ దేశాల్లో 522 తుపాన్లు ఏర్పడ్డాయి. అంటే ఏడాదికి సగటున నాలుగు సంభవిస్తున్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న తుపాన్లలో ఏడు శాతం బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోనే ఏర్పడుతున్నాయని సముద్ర శాస్త్ర, వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత 120 ఏళ్ల చరిత్ర చూస్తే అరేబియా సముద్రంలో కేవలం 14 శాతం తుపాన్లు, 23 శాతం తీవ్ర తుఫానులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో 86 శాతం తుపాన్లు, 77 శాతం తీవ్ర తుపాన్లు సంభవించాయి.
ఇక్కడే ఎందుకు ఎక్కువ?
అరేబియా సముద్రంలో కంటే బంగాళాఖాతంలో ఎక్కువ తుపాన్లు సంభవించడానికి గాలి ప్రవాహంతో పాటు వేడి వాతావరణ పరిస్థితులు ముఖ్య కారణాలని చెబుతున్నారు. తూర్పు తీరంలోని బంగాళాఖాతం కంటే పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం చల్లగా ఉంటుంది. చల్లని మహాసముద్రాల కంటే వెచ్చని సముద్రాల్లోనే ఎక్కువగా తుపాన్లు సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చరిత్రలో అత్యంత దారుణమైన 36 ఉష్ణమండల తుపాన్లలో 26 బంగాళాఖాతంలో సంభవించడమే దీనికి నిదర్శనం. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాన్ల ప్రభావానికి అత్యధికంగా మన దేశం.. అందులోనూ ఒడిశా గురవుతోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు కూడా బంగాళాఖాత తుపాన్లకు గురై భారీగా నష్టపోతున్నాయి. వీటితోపాటు ఈశాన్య భారతంలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. మన దేశంలో తుపాన్ల కారణంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టం వాటిల్లుతోంది. కమ్యూనికేషన్, రవాణా, విద్యుత్ వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.
చివరి 4 నెలల్లోనే 65 శాతం తుపాన్లు
వాతావరణ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం మనదేశంలో సీజన్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్ల సీజన్ ఉంటుంది. కానీ 65 శాతం తుపాన్లు ఏడాది చివరి నాలుగు నెలల్లో అంటే.. సెప్టెంబర్ `డిసెంబర్ నెలల మధ్యే సంభవిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు ఇండో-గంగా మైదానాల మీదుగా వాయువ్య దిశగా పయనిస్తాయి. వీటి ప్రభావంతో ఉత్తర భారతదేశంలో చాలా వరకు వర్షాలు కురుస్తాయి. అరేబియా సముద్రంలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. గత 200 ఏళ్లలో ఉష్ణమండల తుపాన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 40 శాతం ఒక్క బంగ్లాదేశ్‌లోనే నమోదు కాగా, నాలుగో వంతు మరణాలు భారతదేశంలో సంభవించాయి. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల నుంచి తుపాన్లు పుడుతుంటాయి. తూర్పు తీరం కంటే పశ్చిమ తీరానికి తపాన్ల తాకిడి ఎనిమిది రెట్లు తక్కువ. ఉష్ణమండల తుపానును భారీ అల్పపీడన కేంద్రంగా చెప్పవచ్చు. ఇది బలమైన గాలి, ఉరుములు, కుండపోత వర్షాలను సృష్టిస్తుంది. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ప్రకారం.. 1891` 2000 సంవత్సరాల మధ్య 308 తుపాన్లు భారతదేశ తూర్పు తీరాన్ని తాకాయి. ఆదే సమయంలో పశ్చిమ తీరంలో 48 తుపాన్లు మాత్రమే సంభవించాయి.
భారత తూర్పుతీరంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్లు
మే 2023లో మోచా తుపాను సంభవించింది. దీనివల్ల గంటకు 277 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. 1982 తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన తుపాను.
2021లో సంభవించిన టకాటే తుపాను సమయంలో వీచిన గాలుల వేగం గంటకు 222 కి.మీ.
2020లో వచ్చిన ఓఫాన్ గంటకు 268 కి.మీ. వేగంతో గాలులను తీసుకొచ్చింది.
2019లో ఫణి తుపాను దాడి చేసింది. దీని గాలుల వేగం గంటకు 277 కి.మీ.
2018 తిత్లీ తుపాను సంభవించింది. ఇందులో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.
2014లో హుద్‌హుద్ తుపాను విరుచుకుపడిరది. దీని గాలుల వేగం గంటకు 185 కి.మీ.
2013లో సంభవించిన పైలీన్ తుపానులో గంటకు 215 కి.మీ. వేగంతో భీకర గాలులు వీచాయి.
2007లో గోను తుపాను గంటకు 268 కి.మీ. వేగంతో కూడిన గాలులతో వణికించింది.
1998లో సూపర్ సైక్లోన్ గంటకు 260 కి.మీ. వేగతం దూసుకువచ్చి ఒడిశా, ఉత్తరాంధ్రాను కకావికలం చేసింది.
1970లో బంగ్లాదేశ్‌పై పంజా విసిరిన భోలా తుపాను కారణంగా అత్యధికంగా సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
``````````










Comments