తీర్పు తీర్పునకూ ఇంత తేడానా?!
- DV RAMANA

- Nov 26
- 2 min read

రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభల్లో తీర్మానించి తుది ఆమోదం కోసం పంపే బిల్లుల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే క్రమంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు అసలు వివాదాన్ని, ధర్మ సందేహాలను అలాగే ఉంచేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలైన రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య తరచూ ఏర్పడుతున్న ఇలాంటి వివాదాలకు ఇది ఎంతమాత్రం పరిష్కారం కాదు. బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించని గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కొన్ని నెలల క్రితం ఇదే సుప్రీంకోర్టుకు చెందిన ధర్మాసనం అసెంబ్లీ పంపిన బిల్లులను ఎక్కువకాలం పెండిరగులో పెట్టడం కుదరదని అంటూ మూడు నెలల గడువు నిర్దేశించడం, ఇది రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 ప్రకారం క్లారిటీ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు పంపారు. రాష్ట్రపతి లేఖపై స్పందనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పు ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన తీర్పునకు ఇది భిన్నంగా ఉండటమే కాకుండా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్లుగా ఉంది. రాష్ట్రాల అసెంబ్లీలు పాస్ చేసి పంపే బిల్లులకు తుది ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి నిర్దిష్ట కాలపరిమితిని విధించలేమని, రాజ్యాంగంలో అటువంటి టైమ్ లిమిట్ లేదని తాజా తీర్పులో పేర్కొంది. దాన్ని వారి విచక్షణకే వదిలేశామంటూనే నిరవధిక ఆలస్యం జరిగిన సందర్భాల్లో మాత్రం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కానీ ‘నిరవధిక ఆలస్యం’ అన్న పదానికి తగిన స్పష్టత గానీ.. నిర్వచనం గానీ ఇవ్వకపోవడం వల్ల న్యాయస్థానం దృష్టిలో సమస్య పరిష్కారమైనట్లు కనిపిస్తున్నా.. పాత సందేహాలు, ఆరోపణలు అలాగే ఉండిపోయాయి. శాసనసభలు ఆమోదించే బిల్లులను ఆమోదించే అంశంపై గవర్నర్లు, రాష్ట్రపతికి నిర్దిష్ట కాలపరిమితిని విధించలేమని చెప్పడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ‘యూటర్న్’ తీసుకోవడం న్యాయ, రాజ్యాంగ నిపుణులను ఆశ్చర్యపరిచింది. రాజ్యాంగ వ్యవస్థలైన రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఒక అంశంలో కాలపరిమితి (డెడ్‌లైన్) విధించడం రాజ్యాంగంలో లేదంటున్న సుప్రీంకోర్టు.. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విషయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఎలా కాలపరిమితి విధించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పీకర్ పదవి కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా! అన్న ప్రస్తవన వస్తోంది. అలాగే శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ వ్యవస్థలే.. పైగా అవి ఎన్నికల్లో ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినవి. వాటి నిర్ణయాలను గవర్నర్లు, రాష్ట్రపతి నిరవధికంగా పెండిరగులో పెట్టడం వాటి రాజ్యాంగ హక్కులు, అధికారాలను కాలరాస్తున్నట్లే కదా! ఇటువంటి వాటిపై న్యాయసమీక్ష చేయడమో, సరైన పరిష్కారం చూపించి వివాదాన్ని ముగించడమో చేయాల్సిన సుప్రీంకోర్టు సమస్యను ముదరబెట్టే తీర్పు ఇవ్వడం ముదావహం కాదు. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరిస్తున్న తీరుపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే పెట్టుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం కూడా ఆ కేసులో భాగస్వామ్యమైంది. ఈ కేసును రెండేళ్లకు పైగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్ ‘మేం శక్తిహీనులుగా చూస్తూ ఉండలేం. మరో గత్యంతరం లేకపోవడంతో మేం జోక్యం చేసుకోవలసి వస్తుంది’ అని ఒక దశలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వివాదంపై చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్‌కు, తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు పలుమార్లు సూచించింది. అయినా పట్టించుకోకపోవడంతోనే జోక్యం చేసుకోవలసి వచ్చిందని కూడా అప్పట్లో న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. రాజ్యాంగ ప్రకారం మనదేశం ఏర్పాటు చేసుకున్న సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పాటు రాష్ట్రాలున్నాయి. ఆ మేరకు దేశ ప్రయోజనాల రీత్యా 97 అంశాలకు సంబంధించి హక్కులు, అధికారాలు, బాధ్యతలను కేంద్రానికి దఖలుపర్చగా, 67 అంశాలను రాష్ట్రానికి, మరో 47 అంశాలు కేంద్ర రాష్ట్రాలకు ఉమ్మడిగా బాధ్యతలు, అధికారాలు కల్పించారు. ఈ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలను సవరిస్తూ కొత్త చట్టాలు తీసుకొస్తుంటాయి. చట్టాలు రూపొందించే క్రమంలో ముందుగా వాటి ముసాయిదా బిల్లులకు ముందు అసెంబ్లీలో పాస్ చేయించుకుని ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఆ బిల్లులపై సందేహాలు ఉన్నా అదనపు వివరాలు అవసరమైనా గవర్నర్ వాటిని తిరిగి ప్రభుత్వానికి పంపించవచ్చు. అయితే, రాష్ట్రపతి సమ్మతి అవసరమని భావించే బిల్లులను రాష్ట్రపతికి సిఫార్సు చేసేందుకు రాజ్యాంగంలోని 200 అధికరణ గవర్నర్‌కు అధికారం కల్పించింది. ఇక్కడే వివక్ష చోటుచేసుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా కేంద్రం మెలికలు పెట్టడం 1960 దశకంలోనే ప్రారంభమై ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ సంస్కృతి తారాస్థాయికి చేరుకుంది. దీంతో రాష్ట్రాలు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలైన గవర్నర్లు తమ సాటి రాజ్యాంగ వ్యవస్థలైన రాష్ట్రాల హక్కులు, అధికారాలను హరించేందుకు ప్రయత్నించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే కదా?! దీనికి ఎక్కడో ఒకచోట చెక్ పడాలి కదా?!!










Comments