తెరపైకి అరబ్ నాటో.. ఇక ఇజ్రాయెల్‌తో అటో ఇటో!
- DV RAMANA

- Sep 19, 2025
- 3 min read
ఇస్లామిక్ దేశాల ఉమ్మడి సైన్యం ఏర్పాటుకు సన్నాహాలు
పదేళ్లనాటి సౌదీ అరేబియా ప్రతిపాదనలో కదలిక
ఏ దేశంపై దాడి జరిగినా కూటమి మొత్తం ఎదురుదాడి
ఉమ్మడి సైన్యంతో పాటు ఆయుధ, ఆర్థిక సహకారం
అందులో పాక్ చేరితే భారత్‌కు కొత్త సవాళ్లు తప్పకపోవచ్చు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
నాటో కూటమి.. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా మళ్లీ దీన్ని యాక్టివేట్ చేసింది. రష్యాపై నాటో కూటమి దేశాలు ఆంక్షలు విధించేలా, ఉక్రెయిన్‌కు సైనిక, ఆయుధ సహాయం అందించేలా చేసింది. వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో ప్రపంచంలో రెండు కూటములు ఉండేవి. వాటిలో ఒకటి అమెరికా మద్దతుతో ఏర్పడిన నాటో కూటమి కాగా.. రెండోది అప్పటి సోవియట్ యూనియన్(అవిభాజ్య రష్యా) మద్దతు ఉన్న వార్సా కూటమి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత వార్సా కూటమి దాదాపు ఉనికి కోల్పోతే.. నాటో కూటమి మాత్రం అమెరికా ఆధ్వర్యంలో శక్తివంతంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ కూటమికి పోటీగా మరో కూటమి ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అరబ్`ఇస్లామిక్ దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రియటీ ఆర్గనైజేషన్ ద్వారా ఐరోపా దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమి కనుక అది నాటో కూటమిగా వ్యవహారంలోకి వచ్చింది. ఆ నాటోతో ఏమాత్రం సంబంధం లేకపోయినా అరబ్`ఇస్లామిక్ దేశాలు ఏర్పాటు చేయతలపెట్టిన అదే తరహా కూటమిని కూడా నాటో కూటమి అంటున్నారు. కాకపోతే మొదటి కూటమిని ఐరోపా నాటోగానూ.. కొత్తగా ఏర్పడనున్న కూటమిని అరబ్ నాటోగానూ పేర్కొంటున్నారు. అరబ్ నాటో కూటమి ఏర్పాటుకు ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలే కారణమని అంటున్నారు.
ఇజ్రాయెల్ చర్యలే ఉత్ప్రేరకం
యూదు జనాభా అధికంగా ఉన్న ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో చాలా చిన్న దేశం. మధ్యప్రాచ్యంలో మొత్తం 16 దేశాలు ఉన్నాయి. వాటిలో సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ అరబ్`ఇస్లామిక్ దేశాలు కాగా.. ఇజ్రాయెల్ మాత్రమే యూదు దేశంగా ఉంది. అయితే సాంకేతికంగా, ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. పైగా అమెరికా మద్దతు చూసుకుని తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో వైరం పెట్టుకుని చీటికీమాటికీ యుద్ధానికి కాలు దువ్వుతోంది. తన చుట్టూ ఉన్న అరబ్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం కూడా దానికి కలిసి వస్తోంది. ఇజ్రాయెల్ ఆధిపత్యం ధోరణి వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తమ ప్రాదేశిక భద్రత ప్రమాదంలో పడుతోందని అరబ్ దేశాలు భావిస్తున్నాయి. వీటిలో సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్ వంటి సాయుధ సంపత్తి, ఆర్థిక వనరులు కలిగిన దేశాలు ఉన్నా ఇజ్రాయెల్ వెనుక ఉన్న అమెరికా కారణంగా అవి ఒంటరిగా ఆ చిన్న దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. ఆ బలహీనతనే ఉపయోగించుకుంటున్న ఇజ్రాయెల్ పాలస్తీనా, సిరియా, యెమెన్, ఇరాన్ దేశాలపై దాడులు చేస్తోంది. అంతేకాకుండా హమాస్ నాయకులు ఉన్నారన్న రహస్య సమాచారం ఆధారంగా కొద్దిరోజల క్రితం ఖతార్‌పైనా ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించారు. ఈ ఘటనే ఇస్లామిక్ దేశాల్లో ఆందోళన రేకెత్తించింది.
ఐక్యతా యత్నాలు
అరబ్`ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత కొరవడిరది. పరస్పరం తమలో తాము కలహించుకుంటూ వస్తున్నాయి. ఇజ్రాయెల్ తాజా దాడుల తర్వాత ఐక్యతాలోపాన్ని గుర్తించిన ఆ దేశాలు.. ఇప్పుడు ఐక్యత రాగం ఆలపించడానికి సిద్ధమయ్యాయి. ఇందులో తొలి ప్రయత్నంగా వారం క్రితం ఖతార్ రాజధాని దోహాలో అరబ్`ఇస్లామిక్ దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించి ఇజ్రాయెల్ ఆగడాలపై చర్చించాయి. మధ్యప్రాచ్యంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ఇస్లామిక దేశాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్, టర్కీ దేశాలు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. అమెరికా, యూరోపియన్ దేశాలు ఏకమై ‘నాటో’ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లే.. అరబ్`ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ‘అరబ్ నాటో’ పేరుతో ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఈజిప్ట్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా దానిపై విస్తృత చర్చ జరిగింది. దీనికి పాకిస్తాన్, టర్కీ , ఇరాక్ తదితర దేశాలు మద్దతు తెలిపాయి. వాస్తవానికి ఈ ప్రతిపాదనను సౌదీ అరేబియా పదేళ్ల క్రితమే తీసుకొచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రతిపాదన అప్పట్లో ముందుకు వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు దాని అవసరాన్ని ఇస్లామిక్ దేశాలు గుర్తించాయి. ఈ దేశాల్లో ఈజిప్ట్ పెద్ద సైనిక శక్తిగా ఉంది. అదేవిధంగా అణ్వాయుధం కలిగిన ఏకైక దేశం పాకిస్తాన్ కూడా కొత్త కూటమిలో చేరితే తిరుగుండదని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే కూటమికి చెందిన ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దాన్ని సభ్య దేశాలన్నింటిపై జరిగిన దాడిగా పరిగణించి.. ఏకోన్ముఖంగా దాన్ని ఎదుర్కోవాలన్న ఈ కూటమిలోని ప్రధాన అంశం.
పాక్`సౌదీ ఆ తరహా ఒప్పందం
దీనికి ప్రారంభ సూచకంగానో.. ద్వైపాక్షిక అంశాల్లో భాగంగానో సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు ఇదే తరహా రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తమలో దేనిపై దాడి జరిగినా ఇరుదేశాలపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడి ఎదుర్కొంటామని ఈ సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్, పాకిస్తాన్ ప్రధాని సంయుక్తంగా ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో అరబ్-ఇస్లామిక్ దేశాలు నాటో తరహా కూటమి ఏర్పాటు చేసుకుంటే ఒక్క ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారవచ్చు. ఎందుకంటే అమెరికా, యూరోపియన్ దేశాలు ఏర్పాటు చేసిన నాటో సైన్యంలో మొత్తం 32 దేశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా మిగతా దేశాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అంతేకాకుండా ఆర్థిక, ఆయుధ సహకారం కూడా అందిస్తాయి. ఆ కోణంలో చూస్తే అరబ్ నాటో కూటమిలో సభ్యురాలిగా ఉండే పాకిస్తాన్ నుంచి భారత్ కొత్త సవాళ్లు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై మనదేశం సర్జికల్ స్ట్రైక్స్, సైనిక, ఉగ్రవాద శిబిరాలపై ఆకస్మిక దాడులు చేస్తూ వస్తోంది. కానీ అరబ్ కూటమి ఏర్పాటు తర్వాత భారత్ పాక్‌పై దాడి చేస్తే మిగిలిన కూటమి దేశాలు భారత్‌పై ఎదరుదాడి చేస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇదే అంశంపై స్పందిస్తూ భారత్ తమకు చిరకాల మిత్రురాలని, ఆ బంధం ఇటీవల ఇంకా పెరిగిందని అన్నారు. భారత్, పాకిస్తాన్‌లను సమమిత్రులుగా పరిగణిస్తామన్నారు.










Comments