top of page

తెలంగాణకు శాపం కాదు.. వారికి వరప్రసాదం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 23, 2025
  • 2 min read

పుష్కరకాలం గడిచిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి! బలవంతంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణను తామే సాధించామంటూ రెండుసార్లు గద్దెనెక్కి ఒకరు రాజకీయ ఫలాలు అనుభవిస్తే.. మరో పార్టీ ఇప్పుడు ఆ ఫలాలను ఆస్వాదిస్తోంది. ఎటొచ్చీ అన్యాయమైపోయింది విభజిత ఆంధ్రప్రదేశే. హైదరాబాద్‌లాంటి ఆర్థిక వనరును కోల్పోయి నిధుల్లేక.. చివరికి రాజధాని కూడా లేక పదమూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. అయినా తెలంగాణ నేతలకు ఆంధ్రభూమి కక్ష తీరినట్లు లేదు. తోటి తెలుగు రాష్ట్రమన్న కనీస గౌరవం కూడా లేదు. సందు దొరికితే చాలు ఆంధ్రపై ఆడిపోసుకోవడానికి పోటీ పడుతుంటారు. ఆంధ్రవారి వల్లే తమ వనరులు వినియోగంలోకి వచ్చాయని, ఆర్థికంగా ఎదిగామన్న ఇంగితం కూడా లేకుండా అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు. పరాభవం నుంచి తేరుకోలేక రెండేళ్లకుపైగా డెన్‌లో ఉండిపోయిన తెలంగాణ దొరగారు ఇన్నాళ్లకు ప్రజల్లోకి వచ్చారు. వచ్చీరావడంతోనే ఆంధ్రోళ్లంటూ విమర్శల దండకం అందుకున్నారు. ఇక పాలక కాంగ్రెస్‌ నేతలు కూడా ఏం తక్కువ తినలేదు. ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే చాలు దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆంధ్రోళ్లనే టార్గెట్‌ చేస్తుంటారు. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై చేసిన పరుష వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలంగాణ పితామహుడినని చెప్పించుకుంటున్న కేసీఆర్‌ దొరతోపాటు మెజారిటీ నేతల తీరు ఎలా ఉందంటే.. ఆంధ్రవాడు తెలంగాణవాసులను తెలంగాణ బిడ్డలు అనాలి. అదే తెలంగాణ వాళ్లు మాత్రం ఆంధ్రులను ఆంధ్ర దొంగలు అనొచ్చు. మనం వాళ్ల పట్ల చాలా బాధ్యతగా మెలగాలి.. వారు మాత్రం మనపై అహంకారంతో హుంకరించవచ్చు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలిచ్చిన కిక్కుతో మళ్లీ ఫాం హౌస్‌ నుంచి బయటకు వచ్చిన దొర మళ్లీ పాత రాగం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే తెలంగాణ పట్ల తీరని శాపంగా పరిణమించిందట. కానీ ఆయనే మళ్లీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చి స్థానిక బాబా దగ్గర మోకరిల్లి అటు నుంచి అటు కలకత్తా పోయి మమతా బెనర్జీతో మంతనాలు జరిపి ఆపైన హైదరాబాద్‌ పోయి ఆంధ్రలో కూడా తనకు అభిమానులు ఉన్నారంటూ గొప్పలు పోయాడు. ఆంధ్ర ప్రజలు ఎక్కువగా సెటిల్‌ అయిన హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కేసీఆర్‌ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే.. ఆయన చెప్పుకొంటున్నట్లు ఆంధ్రులు నిజంగానే ఆయనగారికి అభిమానులనే అనుకోవాల్సి వస్తుంది. కానీ ఆయనకు ఆ కృతజ్ఞత కూడా లేదు. చీటికీమాటికీ ఆ ఆంధ్రులపైనే విరుచుకుపడుతూ నీచంగా మాట్లాడుతుంటారు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకపోతే కేసీఆర్‌ లాంటివారి బతుకు ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే. ఆంధ్రుడైన ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే రాజకీయంగా ఈయన ఎదిగేవారా? మంత్రిగా వెలగబెట్టగలిగేవారా?? ఆ హైప్‌తోనే కదా.. ప్రత్యేక తెలంగాణ నినాదం అందుకోగలిగారు. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రపితగా తాను అవతరించడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటేగా? 1971-72లో అవేవో ముల్కీ నిబంధనల కారణంగా జైఆంధ్ర ఉద్యమం రేగినప్పుడే ఇందిరాగాంధీ రాష్ట్రాన్ని విడదీసి ఉంటే.. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆమె పార్టీ శాశ్వత శత్రువు కాకుండా ఉండేదిగా! ఒకరికి మతం, మరొకరికి భాష, ఇంకొకరికి ప్రాంతం.. ఇలా మిడిసిపడుతూ ఎంతకాలం దగా చేస్తారు? వాటి మీద పడి బతికేయడం తప్ప.. వాటికి ఏమైనా మేలు చేస్తారా అంటే అదీలేదు. ఆంధ్ర వాడు నిజంగా నిర్భాగ్యుడే. వ్యక్తి పూజ, ఆస్తి పట్ల మమకారం, సహజమైన బానిస బుద్ధి వాడికి వద్దన్నా వచ్చిపడే గుణాలు. అదే కారణంతో రాష్ట్రం విడిపోయాక కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్‌ చుట్టుపట్ల ఇప్పటికీ కుమ్మరిస్తున్నాడు. వాటిని సంరక్షించుకోవడానికి అక్కడి నేతల అడుగులకు మడగులొత్తుతూ అణిగిమణిగి ఉంటున్నారు. సోదరుల్లాంటి తెలుగువారిని బలవంతంగా విడదీసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నవారు.. ఇప్పటికీ ఆంధ్రలును తిడుతున్నా, బెదిరిస్తున్నా తమకు కాదన్నట్లు దులిపేసుకుంటున్నారు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు. అక్కడే స్టూడియోలు, నివాస భవనాలు, ఫామ్‌హౌస్‌లు, ఇతరేతర ఆస్తులు కూడబెట్టుకున్న ఆంధ్ర ప్రాంత సినీ నటులు, బడా పారిశ్రామికవేత్తలు అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడంలేదు. తెలంగాణ ఏర్పాటు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రకు తమ వ్యాపార, పారిశ్రామిక కేంద్రాలను తరలించి స్వరాష్ట్ర ఆదాయ వనరులు పెంచడానికి తమ వంతు సాయం చేయాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. అంతెందుకు తెలంగాణకు దఖలుపడిన హైదరాబాద్‌లో ఇక ఉండలేమంటూ రాత్రికి రాత్రి సెక్రటేరియట్‌ను, అసెంబ్లీని, రాజ్‌భవన్‌ను అక్కడి నుంచి తరలించి పంట భూములు తప్ప ఏమీ లేని అమరావతి ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసి కాలక్షేపం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ను ఇప్పటికీ హైదరాబాద్‌లోనే కొనసాగిస్తున్నారు. దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న ఆయన మొదట తమ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తే మిగతావారికి మార్గదర్శిగా ఉంటుందని కూడా భావించడంలేదు. ఈ రకమైన మనస్తత్వమే ఆంధ్రవారిని చిన్నచూపు చూసే స్థితి కల్పిస్తోంది. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తెలంగాణ శాపంగా మారడం కాదు, ఆంధ్ర ప్రాంతానికి తీరని శాపమైందని అనిపిస్తోంది. కేవలం ఎమ్మెల్యే హోదాలో ఎన్టీఆర్‌ చిన్నల్లుడైన చంద్రబాబు దగ్గర సబార్డనేటుగా మిగిలిపోవలసిన జీవితానికి ఒక రాష్ట్ర సాధకుడి కిరీటం, సొంత పార్టీ నేతృత్వం, లెక్కలేనన్ని ఫాం హౌసులు, కొడుకుకూతుళ్లకు రాజకీయ వారసత్వం సంపాదించగలిగారంటే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల తెలంగాణ శాపానికి గురైందనే కంటే.. దొరగారి కుటుంబానికే వరప్రసాదం మారిందనడం సమంజసం. దీనిపై ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page