తెలంగాణలో ప్రమాదంలో సిక్కోలు డీఎస్పీ మృతి
- NVS PRASAD

- Jul 26, 2025
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

విజయవాడ దాటాక సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్న తోవలో వచ్చే చౌటుప్పల్ వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన జల్లు శాంతారావు (54) అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తున్న శాంతారావుతో పాటు మరో డీఎస్పీ చక్రధరరావు (57) మృతిచెందగా, ఏఎస్పీ కోకా రామ్‌ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న స్పార్కియో వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో పడటంతో అట్నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో ఉన్నవారంతా ఏపీకి చెందిన పోలీసు అధికారులే. జల్లు శాంతారావు డోలకు చెందిన పేద రైతు కుటుంబం నుంచి వచ్చారు. కష్టపడి డైరెక్ట్ ఎస్‌ఐగా సెలక్ట్ అయ్యారు. ఏపీఎస్పీకి చెందిన రిక్రూట్‌మెంట్‌లో ఈయన ఎస్‌ఐగా 1995లో చేరడంతో, అక్కడ్నుంచి ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లోనే ఆయన సర్వీసంతా పని చేశారు. రాజశేఖరరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు ముఖ్యమంత్రుల వద్ద ఆయన సెక్యూరిటీ వింగ్‌లో వివిధ హోదాల్లో సేవలందించారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరొందిన శాంతారావు మరణించారన్న వార్త తెలిసి డోలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎందుకంటే.. శాంతారావు సోదరుడు, సోదరి డోలలోనే ఉన్నారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న శాంతారావు వీకెండ్‌లో ఇంటికి వెళ్తుంటారు. తన అన్న కూడా డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి చనిపోవడంతో ఆయన కుమారుడు ఇప్పుడు పోలాకి రెవెన్యూలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. శాంతారావుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుక్కు కొద్ది నెలల క్రితమే వివాహం చేశారు. చిన్నకొడుకు ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లారు. శాంతారావు ఎస్‌ఐ అయిన తర్వాత తన కుటుంబంలో అందర్నీ చదివించి, ఉన్నత స్థాయిలో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.











Comments