తెలుగుదేశం @ టీం లోకేష్
- DV RAMANA

- Dec 29, 2025
- 3 min read
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం
సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు
యువనేత లోకేష్‌కు పగ్గాలు అప్పగించేలా పావులు
జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం రాజకీయాలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. పరిపాలన పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు చూసుకుంటేనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చి, వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక తీరులో ఇదే ద్యోతకమవుతోంది. దీని ద్వారా చంద్రబాబు మూడు నిర్దిష్ట లక్ష్యాలపై గురిపెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి యువరక్తం ఎక్కించడం, సీనియర్లకు విశ్రాంతినివ్వడం, తన వారసుడిగా నారా లోకేష్ పార్టీలో కుదురుకునేలా చేయడం ఈ లక్ష్యాలుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ నేతృత్వంలో యువసైన్యాన్ని బరిలో నిలపాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఇప్పటినుంచే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చంద్రబాబు అంతవేగంగా నిర్ణయాలు తీసుకోరన్న అపవాదు ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ఆయన వ్యవహారశైలి ఈ అపవాదుకు గురిచేస్తోంది. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోనే పార్టీ జిల్లా కార్యవర్గాలను సమూలంగా మార్చేశారు. దీనికి మరో కారణం కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కొత్త కార్యవర్గాల ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కొత్త ముఖాలకు అవకాశం
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజశైలికి భిన్నంగా చంద్రబాబు త్వరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి గుర్తింపు ఇచ్చేలా ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల నియామకాలు దాదాపు పూర్తి చేశారు. పార్టీ పదవుల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు. పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన 26 జిల్లాలకు పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను మూడు రోజుల క్రితమే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో సామాజిక సమతూకం పాటిస్తూ ఓసీలకు 11, బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కొక్కటి చొప్పున అధ్యక్ష పదవులు ఇచ్చారు. వీటిలోనూ మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ఉన్న వారందరినీ మార్చేసి కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఈ కూర్పు చూస్తే.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు అనుసరించిన సోషల్ ఇంజినీరింగ్ విధానాన్నే ఇక్కడా అమలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నాయకత్వాలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ దృష్టితోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా దానికి ముందే జిల్లా కార్యవర్గాలను నియమించారు. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారికి, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం లభించనివారికి జిల్లా నాయకత్వం అప్పగించారు. దీనివల్ల పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం చేయడమే కాకుండా దిగవస్థాయి నుంచి అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చినట్లయ్యిందని అభిప్రాయముంది.
సీనియర్లకు నోఛాన్స్
పార్టీకి యువరక్తం ఎక్కించాలని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు అవకాశాలు కోల్పోయారు. రాష్ట్ర కేబినెట్‌లోనూ, కార్పొరేషన్ వంటి నామినేటెడ్ పదవుల్లోనూ ఒకటీఅరా తప్ప సీనియర్లకు పదవులు దక్కలేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులనూ యువ నాయకులకే కట్టబెట్టడంతో తెలుగుదేశంలో సీనియర్ల శకం ముగిసినట్లే కనిపిస్తుంది. తాజా నియామకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర పరిధిలోని విజయనగరం జిల్లాలో కీలకమైన ఆశోక్‌గజపతిరాజు వృద్ధాప్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమార్తె అదితికి అవకాశం ఇప్పించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సమీకరణాల రీత్యా చీపురుపల్లి నుంచి గెలిచిన, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావులకు నామినేటెడ్, పార్టీ పదవుల్లో చోటు లభించలేదు. విశాఖకే చెందిన మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం రాజ్యాంగపరమైన స్పీకర్ పదవిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కూడా అవకాశం దక్కకపోవచ్చు. గంటా, కళా వెంకట్రావులు తమ కుమారులను వారసులుగా తెరపైకి తీసుకురాగా అయ్యన్న కుమారుడు విజయ్ ఇప్పటికే పార్టీలో పని చేస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా సీనియర్లను తప్పించి వీలున్న చోట వారి వారసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురు సీనియర్లు తమ వారసులను ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిప్పుతూ పార్టీ కార్యక్రమాల్లో వారినే తెరముందు ఉంచేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇక యువ నాయకత్వం
మొత్తంగా చూసుకుంటే టీడీపీలో ఇప్పుడు నవ్యోత్సాహం తొణికిసలాతోంది. పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ మొత్తం సంస్థాగత వ్యవహారాలన్నీ ఆయన తనయుడు, యువనేత లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల అనంతరం మంత్రివర్గ కూర్పు నుంచి తాజాగా జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకం వరకూ ప్రతి విషయంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. వయసురీత్యా తాను తప్పుకొని వచ్చే ఎన్నికలనాటికి పార్టీ ఆధిపత్యాన్ని తన వారసుడు లోకేష్ చేతుల్లో పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా ఇప్పటినుంచే ఒకటొకటిగా బాధ్యతలు లోకేష్‌కు అప్పగిస్తున్న చంద్రబాబు తాను కీలకాంశాలు, విధాన నిర్ణయాలకే పరిమితమవుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ కూడా తదనుగుణంగా తన పనితీరుకు పదును పెడుతున్నారు. అన్ని శాఖలపైనా అంతర్గతంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇక పార్టీలో ఆయనే ఇప్పుడు ప్రధాన నిర్ణేత. యువగళం పాదయాత్రలో తనతో కనెక్ట్ అయిన యువనేతలకు పదవులు కట్టబెట్టేందుకు లోకేష్ ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ యువ నాయకులకే జిల్లాల పార్టీ పగ్గాలు అప్పగించారు. వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ లోకేష్ టీముగా ముద్ర పడిన వారే. సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేష్ సిఫార్సు చేసిన వారికే పదవులు దక్కాయని పార్టీవర్గాలే అంగీకరిస్తున్న విషయం.










Comments