top of page

తాళి తీసి.. భర్త చేతిలో పెట్టి!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jan 2
  • 2 min read
  • ఇంకా కొనసాగుతున్న నాన్‌ఫార్మల్‌ వస్తువుల అప్పగింత

  • హిందూ స్త్రీ మనోభావాలు దెబ్బతింటున్నాయని గగ్గోలు పెడుతున్న సంఘాలు


(సత్యంన్యూస్‌, నరసన్నపేట)

సనాతన హిందూ మహిళ తన ఐదోతనానికి గుర్తుగా కాలికి మెట్టెలు, మెడలో పుస్తెలు ఉండాలని భావిస్తుంది. నుదుటిన బొట్టు ఉంచడమనేది కాలగమనంలో కొంత కనుమరుగైనా మంగళసూత్రానికి మాత్రం ఇప్పటికీ ఆ పవిత్రత కాపాడుకుంటూ వస్తున్నది మాత్రం హిందూ స్త్రీనే. అటువంటి మహిళ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయించేసి, స్వయంగా ఆమె భర్త చేతిలో పెడితే ఎలా ఉంటుంది? కాలికి ఉన్న మెట్టెలు సాధారణంగా ఒకంతట బయటకు రావు. ఎందుకంటే.. ఏళ్ల తరబడి అది శరీరంలో భాగమైపోవడమే. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక పరీక్ష కోసం వీటిని తీయాల్సిరావడం నిజంగా బరువైన సందర్భమే. వివరాల్లోకి వెళితే..

యూజీసీ నిబంధనల మేరకు సంబంధిత విద్యార్హత ఉన్నవారు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)లో క్వాలిఫై కావాలి. అప్పుడు మాత్రమే డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పే అర్హత పొందుతారు. ఏడాదికి రెండుసార్లు నిర్వహించే నెట్‌ కోసం విద్యాధికులు ఈమధ్య కాలంలో విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో ఈ నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువు కాదు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ తెరపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఈ పరీక్షను నరసన్నపేట హైవే మీద ఉన్న కోర్‌ టెక్నాలజీస్‌ సంస్థ శుక్రవారం నిర్వహించింది. వాస్తవానికి యూజీసీ ఈ ఆన్‌లైన్‌ పరీక్షకు టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకేసారి 500 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష రాయాలంటే శ్రీకాకుళంలో నగరంలో కూడా అటువంటి సంస్థ లేదు. దీంతో నరసన్నపేటను చాలామందికి నెట్‌కు సెంటర్‌గా హాల్‌టికెట్లు జారీ చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం పరీక్షకు వెళ్లిన మహిళల ఒంటిపై ఉన్న మెట్టెలు, చెవిదుద్దులు, మంగళసూత్రాన్ని కూడా తీయించి పక్కన పెట్టించారు. భర్తతోనో, తోబుట్టువులతోనో వచ్చినవారు వీటిని వారి చేతికి అందించారు. అలా కాకుండా ఒంటరిగా వచ్చినవారు ఒంటిపై ఉన్న ఆభరణాలను పరీక్ష హాలుకు బయటే ఒక కవర్‌లో పెట్టి పక్కన పడేశారు. వాస్తవానికి నాన్‌ఫార్మల్‌ వస్తువులేవీ పరీక్ష రాస్తున్న అభ్యర్థుల వద్ద ఉండటానికి వీళ్లేదన్న నిబంధన ఉంది. అయితే టెక్నాలజీ కూడా విపరీతంగా పెరగడంతో ఇప్పుడు ఏది ఫార్మలో, ఏది నాన్‌ఫార్మలో కూడా చెప్పడం అంత సులభం కాదు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు కూడా ఇటువంటి నిబంధనలే అమలు చేస్తున్నారు. చెవిదిద్దుల ద్వారా లేదా మంగళసూత్రం ద్వారా సమాధానాలు తెప్పించుకునే టెక్నాలజీ ఉంటే దాన్ని కనిపెట్టే సాంకేతికత మాత్రం లేదు. అందుకే రిస్ట్‌వాచ్‌, బెల్ట్‌ దగ్గర్నుంచి కాలి చెప్పులతో సహా అన్నింటినీ బయటపెట్టిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా హిందూస్త్రీల మనోభావాలను కించపరిచేదిగా ఉందని హిందూ సంప్రదాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎటువంటి సమయంలో వీటిని తీస్తారో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలియకుండా ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు.

` 2 ఫొటోలు

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page