తగ్గిన చమురు ధర.. మన దరిచేరదా?
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
ఉపశమించిన పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు
భారీగా దిగివచ్చిన ముడి ఇంధన ధరలు
అయినా రిటైల్ ధరలు తగ్గించని చమురు కంపెనీలు
ఇప్పుడే సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు
నష్టాలు భర్తీ అయ్యేవరకు బాదుడు భరించక తప్పదట

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ప్రజలు కూడా ఈ హెచ్చుతగ్గులను ఆమోదించి సర్దుకుపోక తప్పదు. కానీ కొరత ఏర్పడినప్పుడు ధరలు పెరగడమే తప్ప.. కొరత తీరినప్పుడు పెరిగిన ధర తగ్గడం తెలియని ఒకే ఒక్క సరుకు ఇంధనం. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ తదితర అత్యవసర ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాల ప్రభావానికి తరచూ గురవుతుంటాయి. ఆ ప్రకారమే దేశంలో వాటి ధరలు తరచూ మారుతుంటాయి. అతిముఖ్యమైన నిత్యావసర వస్తువులైన చమురు, గ్యాస్ ధరలను కేంద్రం ఆధ్వర్యంలోని ఆయిల్ కంపెనీల సమాఖ్య ఎప్పటికప్పుడు సమీక్షించి ధరలను నిర్దేశిస్తుంటుంది. కానీ ఇటీవలి కాలంలో అవసరమైనప్పుడు ధరలను పెంచుతున్న ప్రభుత్వం.. తర్వాత వాటిని ఎందుకు తగ్గించడంలేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఉదాహరణగా పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్`ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి ముతపడటం, గల్ఫ్ దేశాల్లోని చమురు ఉత్పత్తి క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతిని ఉత్పత్తి స్తంభించిపోవడం వల్ల ఆయిల్, గ్యాస్ సరఫరాలు దాదాపు స్తంభించిపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో అధిక ధరలు వెచ్చించి ఇతర దేశాల నుంచి తెప్పించుకోవడం వంటి కారణాలతో రిటైల్ ఇంధన ధరలు పెంచకతప్పలేదు. ఒకదశలో ముడిచమురు బ్యారెల్ ధర 120 అమెరికన్ డాలర్ల వరకు ఎగబాకింది. అయితే నాలుగు నెలల యుద్ధం తర్వాత ఎట్టకేలకు శాంతి ఒప్పందం కుదిరి హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం, ఆయిల్ సరఫరాలు పునరుద్ధరణ కావడంతో ముడిచమురు బ్యారెల్ ధర 77 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ మేరకు రిటైల్ ధరలు మాత్రం దిగిరావడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించే అవకాశం లేదంటూ పలు కారణాలతో సహా తేల్చేసింది. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ సైతం చమురు ధరలు తగ్గించడానికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం ముందుకు రాకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
రాజకీయ నిర్ణయాలతో నష్టం
మనదేశంలో చమురు రిటైల్ ధరలను ప్రతినెలా సమీక్షించే అధికార వ్యవస్థలు ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో వాటిని రాజకీయ నిర్ణయాలు డామినేట్ చేస్తుంటాయి. నెలనెలా చమురు ధరలను సవరించే ఆయిల్ కంపెనీలు.. ఎన్నికలు ముందున్నప్పుడు మాత్రం ధరల సమీక్ష జోలికి పోవు. కారణం.. ఎన్నికల ముందు పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే ప్రజలు అసంతృప్తి గురై అధికార పార్టీకి ఓట్లు వేయకుండా పోతారన్న భయం ప్రభుత్వ పక్షానిది. దీనికి ఉదాహరణగా పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని పేర్కొనవచ్చు. ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడిచమురు సరఫరా నిలిచిపోయి.. ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తినా ప్రభుత్వం ఆ పని చేయలేదు. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే దానికి కారణం. పైగా పెట్రో ధరలు పెంచేది లేదని ప్రభుత్వ పెద్దలు కూడా గంభీరమైన ప్రకటనలు చేసింది. కానీ ఎన్నికల ఫలితం వెలువడిన నాలుగో రోజు నుంచే ధరల బాదుడు ప్రారంభించింది. వంట, వాణిజ్య గ్యాస్ ధరలు రెండు మÖడుసార్లు పెంచగా.. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే నాలుగుసార్లు పెంచి జనంపై పెనుభారం మోపింది. ఈ భారమంతా దాదాపు ఒకేసారి పది రోజుల వ్యవధిలోనే పడటం ప్రజలకు ఇబ్బందికరం. అదే చమురు సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తిన నాటినుంచే చేసుకుంటూ వస్తే ప్రజలకు ఇంత భారం అనిపించేది కాదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయంగా ధరల తగ్గింపునకు సుముఖంగా లేకపోవడానికి ప్రభుత్వం పలు కారణాలు చెబుతోంది.
నష్టాల భర్తీకే ప్రాధాన్యం
నాలుగు నెలల యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వ రాజకీయ నిర్ణయాల వల్ల దేశీయ చమురు సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయకపోవడం వల్ల వాటిల్లిన భారీ నష్టాలను పూడ్చుకోవడానికి, లాభాలను పునరుద్ధరించుకోవడానికి ప్రస్తుత ధరల తగ్గుదలను వాడుకుంటున్నాయి. కాగా రిటైల్ ఇంధన ధరలు ముడి చమురు ధరలపై మాత్రమే ఆధారపడి ఉండవు. చమురు శుద్ధి ఖర్చులు, సముద్ర రవాణా ఛార్జీలు, డాలర్‌తో రూపాయి మారక విలువ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు, పన్నుల ఆధారంగా రిటైల్ ధరలను ఖరారు చేస్తారు. యుద్ధ భయాలు తొలగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఖాళీ అయిన తమ అత్యవసర చమురు నిల్వలను మళ్లీ నింపుకోవడానికి పోటీ పడతాయి. దీనివల్ల మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ మారే అవకాశం ఉంది. అందువల్ల ఈ అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా స్థిరపడిన తర్వాతే చమురు సంస్థలు ఆ లాభాలను ప్రజలకు బదిలీ చేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉత్పత్తిపరమైన సమస్యలు
హర్మూజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ చమురు, గ్యాస్ ఎగుమతులు రాత్రికి రాత్రే పెరిగే అవకాశం లేదు. యుద్ధం కారణంగా మూతపడిన, దెబ్బతిన్న గల్ఫ్ దేశాల చమురు బావులను తిరిగి ప్రారంభించడానికి సమయం పడుతుంది. ఇవి పూర్వ స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని ఇంధన విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు వేగంగా కోలుకోగలిగినప్పటికీ అన్ని దేశాలూ అదే వేగంతో ఉత్పత్తి పెంచలేవు. దెబ్బతిన్న చమురు బావుల్లో 70 శాతం ఉత్పత్తి మÖడు నెలల్లో, 90 శాతం ఉత్పత్తి ఆరు నెలల్లో ప్రారంభం కావచ్చు. మిగిలిన పది శాతం రికవరీకి మరింత సమయం పడుతుంది. మరోవైపు అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకారం హర్మూజ్ జలసంధి నియంత్రణ పూర్తిగా ఇరాన్ హస్తగతమైంది. దీన్ని ఆసరా చేసుకుని ఇరాన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న టోల్ ఫీజును భద్రతా బీమా పేరిట అన్ని నౌకల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల చమురు దిగుమతి ఖర్చులు పెరిగి, అంతిమంగా ముడి చమురు ధరపై ప్రభావం పడుతుంది. ఈ అదనపు భారాన్ని కూడా లెక్కల్లోకి వేసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
దేశంలో ఇంధన ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే దేశీయంగా తగ్గించడం కుదరదని, పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు పడుతుందని స్పష్టం చేశారు. అందువల్ల పెంచిన ధరలను ఇప్పుడే వెనక్కి తీసుకోలేమన్నారు. అదే సమయంలో ముడి చమురు బారెల్ ధర 80 డాలర్ల కిందకు పడిపోయినప్పటికీ ఇతర నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల ధరలు ఇప్పటికిప్పుడు తగ్గవని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. సంక్షోభ సమయంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన ముడి పదార్థాల స్టాక్ ఖాళీ అయ్యేవరకు ఇప్పటి ధరలే కొనసాగుతాయంటున్నారు. ఈ లెక్కన చూస్తే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమే ధరల తగ్గింపు ఫలితం వినియోగదారులకు చేరుతుందంటున్నారు. అయితే అప్పటికి అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉంటాయో? ముడిచమురు ధరలు ఎలా ఉంటాయో?? అంతా మాయ!






Comments