top of page

సిక్కోలు చెంత.. సేంద్రియ సంత

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 6 days ago
  • 3 min read
  • ఆరోగ్య సమాజ నిర్మాణానికి వినూత్న యత్నం

  • దార్లపూడి రవితో కృషితో ఏర్పాటు

  • విద్యావంతులైన రైతుల పంటలతోనే స్టాల్స్

  • అందుబాటులో సేంద్రియ విత్తనాలు సైతం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఆరోజు ఆదివారం.. ఉదయం పూట నగరంలోని 80 అడుగుల రోడ్డులో వెళ్తుంటే.. బృందావనం ఫంక్షన్ హాల్ పక్కనున్న ఖాళీ స్థలంలో టెంట్లు వేసి ఉండటం.. వాటిలో కాస్త జనం ఉండటం.. అక్కడే రోడ్డుపైన కార్లు, బైకులు పెద్దసంఖ్యలో ఉండటం చూసి ఏదో ఫంక్షన్ జరుగుతుందనుకున్నాను. కానీ పక్కనే రెండు పెద్ద ఫంక్షన్ హాళ్లు ఉండగా ఖాళీ స్థలంలో టెంట్లు వేసి ఎవరు ఫంక్షన్లు నిర్వహిస్తారన్న ఆలోచన, ఆసక్తితో దగ్గరికి వెళ్లి చూస్తే సిక్కోలు సంత అన్న బ్యానర్ కనిపించింది. నగరంలో సంత ఏమిటన్న మరో ప్రశ్న తలెత్తింది. ఏమిటో చూద్దామని లోపలికి వెళ్లాను. అది మామÖలు సంత కాదని అప్పుడు తెలిసింది. గ్రామాల్లో జరిగే వాటికి పూర్తి భిన్నంగా పూర్తి ప్రకృతిసిద్ధంగా పండే ఆర్గానిక్ ఉత్పత్తులతో సిక్కోలు సంతను నిర్వహిస్తున్నారని అర్థమైంది. దీనికి ఆద్యుడు భాస్కర ఆర్గానిక్స్‌కు చెందిన దార్లపూడి రవి. ప్రస్తుత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సేంద్రీయ పంట ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, ప్రచారానికి రవి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే సుమారు మÖడు నెలల క్రితం ఉగాది రోజున సిక్కోలు సంతకు అంకురార్పణ జరిగింది. దీనికి ఔత్సాహిక రైతులు, విద్యావంతులు, అధికారులు సహకారం తోడు కావడంతో సిక్కోలు సంత నగర ప్రజల ఆదరణకు పాత్రమవుతున్నది.

అలా అంకురించిన ఆలోచన

ఆర్గానిక్ ఉత్పత్తులతో విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని దీని ప్రధాన నిర్వాహకుడు దార్లపూడి రవిని కదలించగా ఆయన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అప్పుడే తెలిసింది.. ఆయన పూర్వాశ్రమంలో ఇంజినీర్ అని. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రవి గతంలో ఒక సిమెంటు ఫ్యాక్టరీలో ఇంజినీర్‌గా పని చేశారు. ఈయన తండ్రి రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడేవారు. మందులు వాడితే తాత్కాలిమ ఉపశమనమే తప్ప పూర్తిస్థాయి నివారణ సాధ్యమయ్యేది కాదు. ఆ సమయంలో సేంద్రియ(ఆర్గానిక్) పంట ఉత్పత్తులను వాడటం ద్వారా ఆహార అలవాట్లు మార్చుకుంటే ప్రయోజనం ఉంటుందన్న ప్రచారం జరుగుతుండటంతో అటువైపు రవి ఆలోచనలు మళ్లాయి. సొంత భూములను ఎవరికో లీజుకిచ్చి.. తాము రసాయనిక ఎరువులతో పండించిన ఉత్పత్తులు తినడం ఎందుకన్న ఆలోచన మొగ్గ తొడిగింది. ఆ మేరకు తమ పొలంలోనే సేంద్రియ పంటలు పండించి ఇంట్లో ఆహార అలవాట్లు మార్చేశారు. ఫలితంగా తండ్రి ఆరోగ్యం కదుటపడింది. 70 ఏళ్లు పైబడిన వయసులోనూ ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరగ్గలుగుతున్నారు. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్న రవి సేంద్రీయ సేద్యాన్ని విస్తరించాలనుకున్నారు. అదే సమయంలో తమలాగే చాలామంది చేస్తున్నారని గుర్తించి అటువంటివారిని సమీకరించి రసాయన ఎరువులతో కాకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయడమే కాకుండా సొంతం మార్కెటింగ్ చేసుకోవాలన్న ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు మరికొందరు తోడుకావడంతో సిక్కోలు సంత ఆవిర్భవించింది. ప్రస్తుతం అక్కడ 12 స్టాల్స్ నడుస్తున్నాయి. నెలలో ప్రతి రెండు, నాలుగు ఆదివారాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు ఈ సంతను నిర్వహిస్తున్నారు.

అందరి సహకారంతో..

ప్రయత్నం మంచిదే అయినా దాన్ని సాకారం చేయడం, విజయవంతంగా నిర్వహించడం చిన్న విషయం కాదు.. ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు. సిక్కోలు సంత విషయంలో రవి పలువర్గాల సహకారం పొందడంలో విజయం సాధించారు. సంత నిర్వహించాలంటే మొదట కావలసింది విశాలమైన స్థలం. అద్దెకు తీసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అయితే నగరానికి చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణ తన సొంత స్థలంలో సంతను అద్దె లేకుండా నిర్వహించుకునే అవకాశం కల్పించారు. ఇక టెంట్లు వేసి స్టాల్స్ ఏర్పాటు, ఇతరత్రా నిర్వహణకు ప్రతి వారానికి సుమారు రూ.పదివేల వరకు ఖర్చవుతుండగా.. ప్రతి స్టాల్ నిర్వాహకుడి నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం మీద రూ.ఆరువేలు మాత్రమే వస్తుంది. మిగతా సొమ్ముతోపాటు ఇతరత్రా అవసరాలకు నగరంలో పిడియాట్రిక్ డాక్టర్ల అసోసియేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయని రవి తెలిపారు. అధికారవర్గాల నుంచి ప్రోత్సాహం అందుతున్నదని అన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంతలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. అయితే సంత నిర్వహణకు అనువైన స్థలం ప్రభుత్వం కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్లు రవి చెప్పారు.

మార్కెట్ కంటే ధరలు తక్కువే

సొంత భూములు ఉన్నా చాలామంది ఇతర వృత్తి, ఉద్యోగాలపై వ్యామోహంతో భూములకు లీజుకు ఇచ్చేసి, తమ అవసరాలకు కూడా రసాయన ఎరువులతో పండించిన ఆహారధాన్యాలను వినియోగిస్తూ అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సేంద్రియ (ఆర్గానిక్) ఆహార ధాన్యాలు అమ్మే షాపులు పెరిగినా.. వాటిలో ధరలు చాలా అధికంగా ఉంటున్నాయి. దాని బదులు ఉన్న సొంత భూముల్లో ఎవరికివారు సేంద్రియ వ్యవసాయం చేపట్టి, పండిన పంటలను సొంతంగా అమ్ముకునే అవకాశం కల్పించే ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సిక్కోలు సంతను ఏర్పాటు చేశామన్నారు. అందుకు తగినట్లే ఇక్కడి స్టాల్స్‌కు పంట ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తున్న చాలామంది విద్యావంతులైన రైతులే కావడం విశేషం. గుత్తావల్లి, రాజాం, బాణాం, శ్రీకాకుళం రూరల్ తదితర ప్రాంతాల్లోని తమ పంటపొలాల్లో స్వయంగా పండించిన పంటలనే తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. దీనివల్ల ఆర్గానిక్ షాపుల్లో కంటే కాస్త తక్కువ ధరకే విక్రయించగలుగుతున్నారు. సాధారణంగా రసాయనిక ఎరువులతో పండించే పంటల్లో పోషకాలు తక్కువ, దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటి ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ సేంద్రియ పంటల దిగుబడులు తక్కువగా ఉంటాయి. అందుకే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. జీవామృతం, పంచగవ్య.. అంటే అవు నుంచి వచ్చే ఐదు రకాల పదార్థాలతో చేసిన ఎరువు, వేప కషాయం వంటి పూర్తి రసాయన రహిత ఎరువులతో సేంద్రియ పంటలు పండిస్తారు. అందువల్ల ఇవి మన ఆరోగ్యాన్ని పరిరక్షించగలుగుతాయి.

ఇతర సేంద్రియ ఉత్పత్తులు సైతం

ఇక్కడున్న 12 స్టాల్స్‌లో ధాన్యం, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, పళ్లు, పప్పుధాన్యాలే కాకుండా ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నారు. జ్యూట్ బ్యాగులు, నేత బట్టలు, సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన బిస్కెట్లు, ఇతర స్నాక్స్, రకరకాల పొడులు, రాగిపిండితోపాటు పలురకాల మిల్లెట్లతో కలిపి చేసిన పిండి, పోషకాహారాలతో తయారు చేసిన అమృతాహారం, విజయవాడకు చెందిన గ్రామీణం సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన రకరకాల ఫ్లేవర్ల తేనె, ఇతర జ్యూస్‌లు సిక్కోలు సంతలో అందుబాటులో ఉన్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. మన ఇంటి పెరడ్లలోనూ, రూఫ్‌టాపుల్లోనూ సేంద్రియ పంటల సాగుకు అవసరమైన పలు రకాల ఆర్గానిక్ పంటల విత్తనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ప్రతివారం కనీసం ఈ సంతను కనీసం 200 మంది వినియోగదారులు సందర్శిస్తున్నారు. విక్రయాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని పలు స్టాళ్ల నిర్వాహకులు చెప్పారు. స్టాల్స్ నిర్వాహకుల్లో దార్లపూడి రవి ఇంజినీర్ కాగా, తంగుడు కల్యాణ్ కిషోర్ సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చినవారు కావడం విశేషం. రిటైర్డ్ టీచర్ ప్రేమానందరావు కూడా నగరంలోని హయాతీనగరం ప్రాంతంలో తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ పంటలను స్వయంగా సాగు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ దిశగా ఆయన్ను రవి, కల్యాణ్‌కిషోర్‌లు మోటివేట్ చేస్తుండటం కనిపించింది. విద్యావంతులైన రైతుల పరస్పర సహకారంతో నడుస్తున్న సిక్కోలు సంత ఆరోగ్య సమాజ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తుండటం ముదావహం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page