top of page

తడిక.. తడిక.. తడిక..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Sep 12
  • 2 min read
  • సింహద్వారం నుంచి దత్త కోవెల మార్గం అందవిహీనం

  • ప్రైవేటు పబ్లిసిటీకి ధారాదత్తం

  • విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పరదాల మాటున ప్రయాణించినట్టు సిక్కోలు నగరవాసి ఇప్పుడు తడికెల మాటున పయనించాల్సిన పరిస్థితిని కార్పొరేషన్‌ అధికారులు కల్పించారు. కులం పేరు చెబితే మనోభావాలు దెబ్బతింటాయి కానీ, గతంలో ఓ సామాజికవర్గం ఉండే ఏరియాకు వెళ్తే మొత్తం తడికెలతోనే వీధంతా కనిపించేది. ఇప్పుడు నగరం మొత్తం కార్పొరేషన్‌ అధికారులు తడికెలమయం చేశారు. అయితే ఆ తడికెకు, ఈ తడికెలకు తేడా ఏంటంటే.. అది వెదురుతోను, ఇది రేకుతోను తయారైందంతే. తమ పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకువెళ్లడానికి కొన్ని కార్పొరేట్‌ సంస్థలు రోడ్డుకు మధ్యలో బోర్డులు పాతుతామంటే మబద్భాగ్యమంటూ కార్పొరేషన్‌ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. ఇంత టేస్ట్‌ లేని అధికారులు కార్పొరేషన్‌లో ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది. మొన్నటికి మొన్న రథసప్తమి సందర్భంగా కళింగరోడ్డును బ్యూటిఫికేషన్‌ చేస్తున్నామంటూ రోడ్డుకు మధ్యలో రేకు తడికెలు మనిషంత ఎత్తులో బిగించారు. దీని మీద సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ పబ్లిసిటీ చేసుకుంది. కళింగ రోడ్డులో రోడ్డు మారినప్పుడు అవతలివైపు వస్తున్న వాహనాన్ని గుర్తించలేక తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమిటని అడిగితే సీఎంఆర్‌ సేవలో కార్పొరేషన్‌ ఉండి సమాధానం చెప్పడంలేదు. పోలీసులకు స్టాపర్లు ఇవ్వడం ద్వారా పబ్లిసిటీ చేసుకునే సంస్థలు ఇప్పుడు నగరంలో రోడ్ల మీదకు వచ్చాయి. కళింగ రోడ్డు వరకు ఎలాగూ డివైడర్‌ లేదు కాబట్టి కొంతలో కొంత నయమనిపిస్తుంది. కానీ శ్రీకాకుళం నగరానికి ముఖద్వారం నుంచి డే అండ్‌ నైట్‌ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతంలో కూడా ఇప్పుడు ఈ రేకు తడికెలు బిగించేస్తున్నారు. బహుశా ఇక్కడ మెడికవర్‌ ఆసుపత్రి పబ్లిసిటీ చేసుకోవచ్చు. వాస్తవానికి సింహద్వారం నుంచి దత్త కోవెల వరకు ఉన్న రోడ్డు శ్రీకాకుళంలో అందంగా ఉంటుంది. చిన్న డివైడర్‌ తక్కువ ఎత్తులో ఉంటూ గ్రీనరీ, గార్డెనింగ్‌, రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన మొక్కలతో శ్రీకాకుళంలో ప్రవేశించగానే ఇదే జిల్లా కేంద్రమని ఫీల్‌ తెచ్చేది ఈ ఒక్క రోడ్డే. ఇప్పుడు ఈ డివైడర్‌ మీద కూడా రేకు తడికెలు బిగించేసి అందాన్ని పాడుచేసి సుందరీకరణ అంటున్నారు. ఇక మిగిలింది పాలకొండ రోడ్డే. దీని మీద కూడా కొద్ది రోజులాగితే తడికెలు వచ్చేస్తాయి. అసలు ఈ తడికెలిచ్చారని ఫ్రీగా పబ్లిసిటీకి అవకాశమిస్తున్నారా? లేదూ అంటే పబ్లిసిటీ ఛార్జెస్‌ వసూలు చేస్తున్నారా? అనేది చెప్పడానికి కూడా మున్సిపాలిటీలో ఎవరి దగ్గరా సబ్జెక్టు లేదు. ఒక రోడ్డు పొడవునా పబ్లిసిటీ చేయాలంటే తక్కువ ఖర్చవదు. కనీసం మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బంది జీతాలకు అయ్యేంత ఖర్చయినా అవుతుంది. అయితే ఇవేవీ కార్పొరేషన్‌ యంత్రాంగం పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. రేకు తడికెలు వారే తయారుచేసుకున్నారు కాబట్టి మున్సిపాలిటీకి సేవ చేస్తున్నారన్న భావనతో ఉన్నట్టు అర్థమవుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page