తప్పుచేస్తే నిలదీస్తాం
- SATYAM DAILY
- Dec 15, 2025
- 2 min read
ప్రజలను ఉపేక్షిస్తే ఉద్యమాలే శరణ్యం
మెడికల్ కళశాలల ప్రైవేటీకరణ హక్కులను కాలరాయడమే
రాజ్యాంగానికి తూట్లు పొడవడం దారుణమైన తప్పిదం
కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం లభిస్తుంది
రాష్ట్ర ప్రభుత్వపై మాజీమంత్రి ధర్మాన ధ్వజం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, వైద్య సౌకర్యాలను ప్రభుత్వరంగంలోనే అందజేసేందుకు వైకాపా ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలకు అన్యాయం చేసే ఇటువంటి నిరంకుశ చర్యల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు ధారదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించాయి. వాటిని పార్టీ రాష్ట్ర కార్యాలయం ద్వారా గవర్నర్‌కు పంపే ముందు సోమవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో ర్యాలీ అనంతరం స్థానిక టౌన్ హాలులో జరిగిన సభలో ప్రసంగించిన ధర్మాన ఎన్డీయే కూటమి పాలనను తుర్పారబట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతంగా నిర్వహించామన్నారు. రాజ్యాంగాన్ని విస్మరించడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం, సరిదిద్దుకునేలా చేయడం ప్రతిపక్షం బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నదో లేదో తెలుసుకునే హక్కు, బాధ్యత ప్రజలందరితోపాటు పార్టీలదేనని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పనిచేయని ప్రభుత్వంపై పోరాటం జరపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుందని, అందులో భాగంగానే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై సంతకాల రూపంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించడం అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టామని మాజీమంత్రి చెప్పారు. ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ స్థాయిలో సమావేశాలు నిర్వహించినా మనమంతా ఒక్కటే అన్న సంకేతాలను ప్రజానీకానికి పంపాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వాలు మనం చెప్పేవి కాస్తయినా అర్థం చేసుకుంటాయన్నారు. ప్రజాభిప్రాయానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తే ఉద్యమాలే శరణ్యమవుతాయని స్పష్టం చేశారు. అందరికీ చదువు అన్నది రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. చదువు అసమానతలను తొలగిస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాలన ఉంది. సామాజిక అసమానతలు తొలగించే పనిని ప్రభుత్వమే చేయాలి ప్రైవేటువారికి అప్పగించేసి చేతులు దులిపేసుకోకూడదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రైవేటు వర్గాలకు మెడికల్ కళాశాలలు అప్పగిస్తున్నదని ధర్మాన విమర్శించారు. అంతకు క్రితం టౌన్‌హాల్‌కు భారీ ఎత్తున వైకాపా శ్రేణులతో తరలివచ్చిన ధర్మానను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత డీఎస్పీ వివేకానంద జోక్యం చేసుకోవడంతో వదిలిపెట్టారు. అలాగే మాజీమంత్రి అప్పలరాజును పలాసలో పోలీసులు అడ్డగించారు. నరసన్నపేట నుంచి వైకాపా శ్రేణులతో వస్తున్న ధర్మాన కృష్ణచైతన్యను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వీటన్నిటినీ ఛేదించి టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో వైకాపా నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నర్తు రామారావు, గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్, ఎంవీ పద్మావతి, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, రెడ్డి శాంతి, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, గేదెల పురుషోత్తం, చిట్టి జనార్థన, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.










Comments