తప్పించడానికే విచారణ తంతు!
- DV RAMANA

- Jul 25, 2025
- 2 min read
డీఈవో తిరుమల చైతన్యకు క్లీన్‌చిట్ ఇచ్చే కుట్ర
పెన్షన్ ఫైల్ ఆగిపోకుండా చేయడానికే ఎంక్వైరీ తంతు
సమగ్రంగా కాకుండా డిస్క్రీట్ విచారణకు ఆదేశాలు
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సర్వీసులో ఉన్నంతకాలం పలు వివాదాల్లో చిక్కుకుని.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎస్.తిరుమల చైతన్యపై ఎట్టకేలకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వార్త వింటే సహజంగానే ఆయన బాధితులు సంబరపడిపోతారు. తిరుమల చైతన్య పాపం పండిరదనుకుంటారు. కానీ రిటైర్‌మెంట్‌కు కేవలం కొద్దిరోజుల ముందే ఈ ఆదేశాలు రావడానికి దాన్నో తంతుగా ముగించేసి.. ఆయన్ను క్లీన్‌గా రిలీవ్ చేసేయాలన్న పన్నాగం ఉన్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి సెంటర్‌లో మాస్ కాపీయింగ్ జరిగిందంటూ 14 మంది ఉపాధ్యాయులను డీఈవో హోదాలో బలి చేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ కాకుండా కేవలం డిస్క్రీట్ విచారణకు ఆదేశించడమే ఈ అనుమానాలను బలపరుస్తోంది.
28న విచారణకు ఆదేశాలు
ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఎచ్చెర్ల మండలం కుప్పిలి పరీక్ష కేంద్రాన్ని డీఈవో హోదాలో తిరుమల చైతన్య తనిఖీ చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఇన్విజిలేషన్, సూపర్‌వైజర్ విధుల్లో ఉన్న ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సహా 14 మంది టీచర్లు విద్యార్థులను మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారని ఆరోపిస్తూ వారందరినీ డీఈవో మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తమను అనవసరంగా బలి చేశారంటూ బాధితులతో సహా ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్‌ను, విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు వివిధ రూపాల్లో పోరాటాలు చేశారు. ఫలితంగా బాధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్లు ఎత్తివేశారు. అయితే ఇప్పుడు ఆనాటి ఘటనల్లో డీఈవో తిరుమల చైతన్య తీరుపై విచారణకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ విచారణకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.వి.శ్రీనివాసులు రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. ఆ మేరకు ఈ నెల 28న ఉదయం 11 గంటలకు శ్రీకాకుళంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో విచారణ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఆ విచారణకు అన్ని ఆధారాలతో సహా రావాలని నాడు సస్పెన్షన్‌కు గురైన కుప్పిలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు 14 మంది టీచర్లకు నోటీసులు పంపారు.
అంతా ఎంక్వైరీ ఆఫీసర్ ఇష్టమే
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. బాధితులందరికీ నోటీసులు ఇచ్చి.. డాక్యుమెంట్లు, సమాచారం, రికార్డులు వంటి అన్ని ఆధారాలు తీసుకురావాలని ఎంక్వైరీ ఆఫీసర్ నోటీసుల్లో సూచించినా ఆయన నిర్వహించే విచారణ తంతుకు అవేవీ అసలు అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే.. కేవలం డిస్క్రీట్ విచారణ మాత్రమే నిర్వహించాలని ఆదేశించడం ద్వారా పాఠశాల విద్యాశాఖ అధికారులు విచారణాధికారి చేతులను కట్టేశారు. పూర్తిస్థాయి విచారణకు.. ఇప్పుడు చెబుతున్న డిస్క్రీట్ విచారణకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి లేదా అధికారిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపాలంటే ముందుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి మళ్లీ స్టేట్‌మెంట్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ సంతృప్తికరంగా లేదని భావిస్తే అప్పుడు ఓరల్ ఎంక్వైరీ నిర్వహించి ఆరోపణలకు గురైన వ్యక్తిని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కోర్టులో మాదిరిగానే ఎంక్వైరీ ఆఫీసర్‌తో పాటు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున డిఫెండ్ చేసేందుకు ఒక అధికారిని నియమించే వెసులుబాటు ఉంటుంది. అలాగే బాధితులు, ఇతర సాక్షుల నుంచి వాంగ్మూలాలు, రికార్డులు, ఇతర ఆధారాలు సేకరిస్తారు. ఫిర్యాదు నిజమా కాదా అన్నది తేల్చడం తప్ప విచారణాధికారి తన నివేదికలో శిక్షలు సూచించకూడదు.
కానీ ఇప్పుడు డీఈవో తిరుమల చైతన్యపై జరిగేది సమగ్ర విచారణ కాకుండా డిస్క్రీట్ విచారణ మాత్రమే. డిస్క్రీట్ విచారణ అంటే.. కేవలం విచారణాధికారి, విచారణ ఎదుర్కొనే వ్యక్తి మాత్రమే గదిలో ఉంటారు. కేవలం ఫిర్యాదు చేసిన వారితో పాటు ఆరోపణలకు గురైన వారిని మాత్రమే విచారించాల్సి ఉంటుంది. ఎంకెవరినీ విచారించకూడదు. అలాగే ఇతరత్రా స్టేట్‌మెంట్లు రికార్డు చేయకూడదు, డాక్యుమెంట్లు కూడా సేకరించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే విచారణాధికారి డిస్క్రీషన్(విచక్షణ) మీద ఈ విచారణ ఆధారపడి ఉంటుంది కనుకే దీన్ని డిస్క్రీట్ విచారణ అని అంటారు. అంటే ఎంక్వైరీ ఆఫీసర్‌కు నచ్చిన విధంగానే ఈ విచారణ జరుగుతుందన్నమాట.
క్లీన్‌చిట్ ఇవ్వడానికేనా?
ఇది తెలుసుకుని ఉపాధ్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈమాత్రం దానికి విచారణ పేరుతో హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. డిస్క్రీట్ విచారణకు ఆదేశించడం వెనుక తిరుమలచైతన్యపై మరక పడకుండా తప్పించాలన్న కొందరు ఉన్నతాధికారుల పన్నాగం ఉన్నట్లుంది. తిరుమల చైతన్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ మేరకు ఆయన పీఎఫ్, పింఛన్‌కు సంబంధించిన ఫైళ్లు జిల్లా కార్యాలయం నుంచి విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్లాయని తెలిసింది. ఆయనపై ఫిర్యాదులు ఉన్నందున వాటిని అక్కడ హోల్డ్‌లో పెట్టేశారని సమాచారం. పెండిరగులో ఉన్న ఫిర్యాదులు క్లియర్ అయితే తప్ప ఆ ఫైళ్లకు మోక్షం లభించదు. ఆయనకు పెన్షన్ మంజూరు కాదు. దాంతో క్లీన్ చిట్ ఇచ్చేందుకే విచారణ తంతుకు తెరలేచిందంటున్నారు. అందులో భాగంగా రిటైర్మెంట్‌కు వారం ముందు విచారణకు.. అదీ డిస్క్రీట్ విచారణకు ఆదేశించడం.. కేవలం మూడు రోజుల ముందే విచారణకు నిర్ణయించారని అంటున్నారు.










Comments