తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
- Prasad Satyam
- 14 hours ago
- 2 min read
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు
ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి
అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వెళ్తున్నాను. ఇన్నాళ్లూ మా కుటుంబంతో ఉన్న మీకు రిక్వస్ట్ చేస్తున్నాను.. అమ్మని, తమ్ముడ్ని చూసుకోమని’.. అంటూ దివంగత అప్పలసూర్యనారాయణ పెద్దకొడుకు గుండ శివగంగాధర్ గురువారం సాయంత్రం గుండ విగ్రహావిష్కరణ సభలో కన్నీరు పెట్టుకున్నారు.
తాను కొద్ది రోజుల్లో అమెరికా వెళ్లిపోతున్నానని, ఈ ప్రజలు, ఊరు మీద నమ్మకంతో తమ్ముడ్ని, అమ్మను ఇక్కడే విడిచిపెడుతున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎప్పట్నుంచో గుండ అప్పలసూర్యనారాయణ చిన్నకొడుకు గుండ విశ్వనాథ్ ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వస్తారన్న ప్రచారానికి బలం చేకూరినట్టయింది. గుండ అప్పలసూర్యనారాయణ దశదినకర్మలు అయిన తర్వాత కొద్ది రోజులుండి కొడుకులిద్దరూ మళ్లీ అమెరికా వెళ్లిపోతారని తెలుగుదేశం వర్గాలతో పాటు అందరూ భావించారు. ఎందుకంటే.. అప్పలసూర్యనారాయణ ఎప్ప్పుడూ కొడుకులిద్దరూ అమెరికాలో పెద్ద పొజిషన్‌లో ఉన్నారని, వారిని రాజకీయాల్లోకి తెచ్చి భవిష్యత్తును నాశనం చేయడం ఇష్టంలేదని, తన క్రమశిక్షణ, నిజాయితీలే వారిని ఆ స్థానంలో నిలబెట్టాయని అందరికీ చెప్ప్పుకునేవారు. అందుకు తగ్గట్టుగానే గుండ కుటుంబం నుంచి ఇద్దరు కుమారుల్లో ఎవరినైనా టీడీపీలోకి తెస్తే టిక్కెటిస్తానంటూ గతంలో చంద్రబాబు పరోక్షంగా హామీ ఇచ్చారు. అయినా అప్పలసూర్యనారాయణ అందుకు అంగీకరించలేదు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి గుండ విశ్వనాథ్ తల్లి తరఫునో, తండ్రి తరఫునో ప్రచారంలో పాల్గొనేవారు. క్లైమాక్స్‌లో పెద్దకొడుకు వచ్చినా 2014, 2019 ఎన్నికల్లో విశ్వనాథే కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాష్ట్రంలోనే ఒక యూనివర్సిటీలో విశ్వనాథ్ పని చేయడంతో ఆయన ఇక్కడే ఉంటారని 2024 ఎన్నికలకు వస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన కూడా అమెరికాలో రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లిపోయారు. దీంతో 2024లో యువతకు టిక్కెటివ్వాలన్న కోణంలో గొండు శంకర్ వైపు పార్టీ చూసింది.
గుండ అప్పలసూర్యనారాయణ సంతాప సభలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ గుండ కుటుంబం నుంచి ఆయన తనయులెవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారికి పార్టీ టిక్కెటిస్తే తాను స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని భావోద్వేగంతో ప్రకటించారు. అక్కడికి ఐదు రోజుల తేడాలోనే పరోక్షంగా తాము ఇక రాజకీయాల్లోకి వస్తున్నట్టు గుండ కుటుంబం ప్రకటించినట్లయింది. దాదాపు 80 ఏళ్ల వయసులో అప్పలసూర్యనారాయణ ఒక బ్రెయిన్ సర్జరీ జరిగిన కొన్నాళ్లకు బాత్రూమ్‌లో జారి పడి, మరోసారి తలకు దెబ్బ తగలడంతో మరణించినా, ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, రాజకీయంగా జరిగిన అవమానాల వల్ల ఆయన మంచం పట్టి బ్రెయిన్ హేమరేజ్ వరకు తెచ్చుకున్నారని, ఇది రాజకీయ హత్యేనంటూ ఆయన అభిమానులు భావిస్తున్నారు. చివరకు నల్లి ధర్మారావు లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా తమ సోషల్‌మీడియా వేదికగా ఇది బాత్రూమ్‌లో కాలుజారడం కాదని, ఆయన రాజకీయ జీవితానికి కాలు పట్టి లాగేయడం వల్లే చనిపోయారని పోస్ట్ చేయడం ఇందుకు ఉదాహరణ. రాజకీయంగా అప్పలసూర్యనారాయణ అనేక పదవులు నిర్వహించినా సరైన స్థానంలో ఆయన్ను పార్టీ కూర్చోబెట్టలేదన్న భావన ఆయన అభిమానుల్లో ఉంది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అప్పలసూర్యనారాయణ అనేక ఎత్తుపళ్లాలు చూశారు. రాజకీయ ఉద్ధండులతో ఢీకొట్టారు. ఇప్ప్పుడు తెలుగుదేశం నుంచి గుండ కుటుంబం బయట లేదు, అందులోనే ఉందన్న సంకేతాలు పంపడం ద్వారా పార్టీ ఎలా సర్దుబాటు చేస్తుందనేదానిపైనే ఇప్ప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.










Comments