తమ్మినేని బోగస్ బాగోతంపై విచారణ
- ADMIN

- Aug 22, 2024
- 2 min read
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా కోర్సులో చేరారని ఆరోపణలు
రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చినా స్పందించని గత ప్రభుత్వం
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి వినతి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మాజీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం విద్యార్హతల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డిగ్రీ చేయకుండానే బోగస్ సర్టిఫికెట్‌తో న్యాయ కళాశాలలో మూడేళ్ల లా కోర్సులో చేరినట్లు తమ్మినేనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలోనే ఫిర్యాదు చేసినా అప్పటి వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్ పల్లి సురేష్ విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ్మినేని బోగస్ సర్టిఫికెట్ ఉదంతంపై విచారణ జరిపించాలని స్వయంగా రాష్ట్రపతి కార్యాలయం సూచించినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తమ్మినేని సీతారాం ఎటువంటి డిగ్రీ కోర్సులో చేరలేదు. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవి పాసైనట్లు సర్టిఫికెట్లు పుట్టించారు. వాటినే చూపించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉన్న మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందారు. తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, అక్రమ అడ్మిషన్‌పై 2022 నుంచి పోరాడుతున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆయన చూపించిన డిగ్రీ సర్టిఫికెట్‌పై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆరా తీయగా తమ వద్ద తమ్మినేని డిగ్రీ చేయలేదని, ఆయన పేరుతో తమ సంస్థ డిగ్రీ సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రాతపూర్వకంగా స్పష్టం చేశారని వెల్లడిరచారు. ఆ సర్టిఫికెట్‌తోనే ఆయన మహాత్మాగాంధీ లా కళాశాలలో చేరినట్లు ధ్రువీకరిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన లెటర్లను జత చేసి అప్పట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌కు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతోపాటు భారత రాష్ట్రపతికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అయితే వైకాపా నాయకుడిగా, స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేనిపై వచ్చిన ఫిర్యాదుపై అప్పటి వైకాపా ప్రభుత్వం స్పందించలేదన్నారు. చివరికి ఈ అంశంపై విచారణ జరపాలని సూచిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినందున మరోసారి ఈ ఉదంతాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తమ లేఖతోపాటు జత చేసిన రాష్ట్రపతి లేఖ, ఓపెన్ వర్సిటీ ఇచ్చిన వివరాలను పూర్తిగా పరిశీలించి తమ్మినేని బోగస్ సర్టిఫికెట్ బాగోతంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌కు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదులోని నిజాలను నిగ్గు తేల్చి ఒక బాధ్యాయుతమైన పదవి నిర్వహించినా.. నకిలీ బాగోతానికి పాల్పడిన తమ్మినేని సీతారాంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూన రవికుమార్, పల్లి సురేష్ సీఎస్‌కు విన్నవించారు.










Comments