తల లేని మొండెం..!
- Prasad Satyam
- Nov 11
- 2 min read
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన
రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన
జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్‌కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా కళింగకోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డుకు 15 మంది డైరెక్టర్లను నియమిస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట వేయడం సంతోషించదగ్గదే అయినా ఈ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించడానికి మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఎవరిని నియమించాలన్నదానిపై అధిష్టానం ఏడాదిన్నర దాటిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి రాకపోవడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 15 మంది డైరెక్టర్లలో విశాఖపట్నానికి రెండు, విజయనగరం ఒకటి, కురుపాం, పెద్దాపురం, బొబ్బిలి ఒక్కొక్క డైరెక్టర్‌ను తీసేస్తే మిగిలినవన్నీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకే దక్కాయి. కానీ ఈ కార్పొరేషన్‌కు చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. కాపు, దాసరి, ముదిలియార్, నాగవంశం కార్పొరేషన్లకు డైరెక్టర్లను ప్రకటించినా ఇంతకు ముందే వీటికి చైర్మన్లను నియమించారు. కళింగకోమటి దగ్గరొచ్చేసరికి చైర్మన్‌గా ఎవర్ని ఉంచాలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇందుకు కారణం.. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన పోటీ ఉంది. ఉమ్మడి జిల్లాలోనే కోటబొమ్మాళి నుంచి బోయిన గోవిందరాజులు మొదట్నుంచి ఈ పోస్టును ఆశిస్తున్నారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆశీస్సులు కూడా ఆయనకున్నాయి. అన్నిటికీ మించి ఆయన రాష్ట్ర కళింగకోమటి సంఘ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు పోటీగా నగరం నుంచి కళింగకోమటి అధ్యక్షుడు కోరాడ హరిగోపాల్ తనకు కూడా ఈ పదవి కావాలని లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హరిగోపాల్ తనకు డైరెక్టర్ పోస్టు ఇస్తే వద్దని, చైర్మన్ చేస్తే చెప్పండంటూ చాలా రోజుల క్రితమే కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలకు అల్టిమేటం ఇచ్చి వచ్చేశారు. ఇప్పుడు కళింగకోమట్లు అధికంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోనే ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఎవరి పేరు ప్రకటిస్తే ఏం జరుగుతుందోనన్న సందిగ్ధంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. రేసులో అయితే బోయిన గోవిందరాజులు ముందున్నారు. తాజాగా ఈ పదవిని బీజేపీకి, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు కేటాయించాలని కొందరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కొద్ది రోజుల క్రితం కలిశారు. జనసేనకు ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. శ్రీకాకుళంలో ఏకాభిప్రాయం కుదరకపోతే పక్క జిల్లా నేతలు ఈ పోస్టును తన్నుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పదవుల భర్తీలో మాత్రం వేగం లేకపోవడం ద్వితీయ శ్రేణి నాయకులను నిరాశపరుస్తోంది. జిల్లాలో వెలమ, కాళింగ, కాపు కాకుండా మరో సామాజికవర్గానికి ఎలాగూ పోటీ చేసే అవకాశమివ్వరని, ఇచ్చినా గెలవరు కాబట్టి నామినేటెడ్ పోస్టులైనా వేగంగా భర్తీచేసి కొద్దిరోజులైనా ప్రోటోకాల్ అనుభవించే అవకాశం ఇవ్వకపోవడంపై అధిష్టానంపై చాలామంది గుర్రుగా ఉన్నారు. జిల్లాలో కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి ఉన్నా కళింగకోమటి, శిష్టకరణతో పాటు మరికొన్ని ఉత్తరాంధ్ర కులాలకు కార్పొరేషన్లు తెచ్చుకోవడంలో తాత్సారం వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చైర్మన్ పేరు ప్రకటించకుండా 15 మంది డైరెక్టర్లను నియమించడంపై కళింగకోమట్లు మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్‌రెడ్డి కుల కార్పొరేషన్లు వేదిక మీదే ప్రకటించి అక్కడికక్కడే చైర్మన్ల పేర్లు కూడా చెప్పారని, కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియడంలేదని ఆందోళన చెందుతున్నారు.










Comments