top of page

దూకుడు పెంచిన సీఐడీ

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Oct 18, 2025
  • 3 min read
  • నకిలీ ఎంఎస్‌ఎంఈ రుణాల డొంక కదిలింది

  • అప్పటి ఆర్‌ఎం సంతకాలు ఉన్నాయని నిర్ధారణ

  • బ్యాంకు చర్యలపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

  • గార బ్రాంచి అంశంలో ముందుకు కదలని రీ ఇన్వెస్టిగేషన్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

దొంగలకు భయపడో, వడ్డీకి ఇస్తే ఐపీ పెడతారన్న అపనమ్మకంతోనో మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. బ్యాంకులు జాతీయం చేశారు కాబట్టి.. మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుందని భావిస్తాం.

ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలంటే బ్యాంకుల ద్వారానే వీలవుతుందని ఎప్పట్నుంచో నమ్ముతుంది. ఇందుకోసం లబ్ధిదారులందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని చెవిలో ఇల్లు కట్టుకొని చెబుతుంది.

ఇప్పుడు ఇటు మధ్యతరగతి మనిషి గాని, అటు ప్రభుత్వం గాని బ్యాంకును నమ్మాయంటే కారణం.. అందులో పని చేస్తున్న ఉద్యోగులు బాధ్యతతో ఉంటారని, ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీగా వ్యవహరిస్తారని, కస్టమర్‌ తృప్తే తమ ధ్యేయమనే లక్ష్యంతో పని చేస్తారని. అయితే బ్యాంకులు కూడా ఫక్తులు వ్యాపార సంస్థలుగా మారితే, అందులో పని చేసే అధికారులు లాకర్‌లో ఉండే సొమ్ము తమ సొంతదిగా భావిస్తే ఇందుకు సమాధానం ఎవరు చెబుతారు? బ్యాంకుల్లో కుంభకోణాలు బయటపడినప్పుడు ఉన్నతాధికారులు బ్యాంకు పరువు పోతుందన్న ఉద్దేశంతో మీడియా దృష్టిలో పడకుండా సంబంధిత బ్రాంచి ఉద్యోగులను కాపాడుకుంటూపోతుంటే.. ఇది మహమ్మారిలా అన్ని బ్రాంచిలకు, అన్ని బ్యాంకులకు వ్యాపిస్తోంది. ఇటు ప్రభుత్వ సొమ్మును, అటు మధ్యతరగతివాడి నమ్మకాన్ని బ్యాంకర్లు హోల్‌సేల్‌గా తాకట్టు పెట్టేస్తున్నారు. బ్యాంకు అనగానే డబ్బులు వేయడం, తీయడం, బదిలీ చేయడం మాత్రమే మనకు తెలుసు. కానీ అంతకు మించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును ఎలా తినేయొచ్చో బ్యాంకు అధికారులకు మాత్రమే తెలుసు. ఇందులో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జిల్లాలో ముందువరుసలో కనిపిస్తుంది. ఎందుకంటే.. దీని వ్యాపారం సైజు కూడా అంతే పెద్దది కావడం వల్ల. ఇంతవరకు అనేక బ్రాంచిల్లో జరిగిన, జరుగుతున్న కుంభకోణాలు బయటకు రాకుండా అన్ని స్థాయిల్లో మేనేజ్‌మెంట్‌ జరిగిపోయింది. కానీ నరసన్నపేట ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో మాత్రం సిబ్బంది పాపం పండిపోయింది. ఇందుకు రెండే కారణాలు.. ఒకటి సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’లో వరుస కథనాలు రావడం, రెండు జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా మహేశ్వర్‌రెడ్డి ఉండటం.

నరసన్నపేట బజారుబ్రాంచిలో బినామీల పేరుతో చిన్న, సూక్ష్మ పరిశ్రమల కోసం రుణాలు మంజూరుచేశామన్న పేరుతో అప్పటి బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ చింతాడ శ్రీనివాసరావు, రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజులు కలిసి కొన్ని కోట్ల నకిలీ రుణాల కుంభకోణానికి తెరతీశారు. ఈ విషయం మూడోకంట పడకుండా జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని తినేసి వీలున్నప్పుడల్లా బ్యాంకుకు సొమ్ములు జమ కట్టడం మొదలెట్టారన్న విషయం ‘సత్యం’ తొలిసారిగా 2024 ఏప్రిల్‌లో వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు వరుస కథనాలుగా ప్రచురించడంతో గత్యంతరం లేక ఆడిట్‌ చేయించారు. ఇందులో లెక్కాపత్రం లేని రుణాలు చాలా ఉన్నాయని తేలడంతో అప్పటి విచారణాధికారి ఆమదాలవలస సీనియర్‌ మేనేజర్‌ తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో చేసేదిలేక పోలీసు కంప్లైంట్‌ ఇవ్వాలని భావించారు. నిజంగా స్టేషన్‌కు వెళ్లి తమ బ్రాంచిలో నకిలీ రుణాలు మంజూరయ్యాయని ఫిర్యాదు చేస్తే.. ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఉన్నఫలంగా బాధ్యులను సెల్‌లో పడేస్తారని భయపడిన బ్యాంకు అధికారులు ఈ కేసును వదిలేస్తే ‘సత్యం’ పత్రిక కథనాలు రాస్తునే ఉంటుందని భావించి సీఐడీకి విచారణ జరపమని ఒక లేఖ రాశారు. ఈమేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు తీగ లాగి మొత్తం డొంకంతా కదిలిస్తున్నారు. ప్రాథమికంగా ఎన్ని కోట్ల రూపాయలు నకిలీల పేరుతో బ్యాంకు సిబ్బంది వాడుకున్నారన్న దానిపై సీఐడీ కొద్ది నెలల క్రితం 21 మందికి నోటీసులిచ్చింది. ఈ విచారణ ద్వారా అప్పటి నరసన్నపేట బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌ లోన్‌ ఫైల్స్‌ను అప్రూవల్‌ కోసం అప్పటి రీజనల్‌ మేనేజర్‌ రాజుకు పంపారని, ఆయన ఓకే అన్న తర్వాతే రుణాలు మంజూరయ్యాయని తెలుస్తుంది. అలాగే ఫీల్డ్‌ ఆఫీసర్‌ చింతాడ శ్రీనివాసరావు ఫేక్‌ అకౌంట్స్‌కు ఈ సొమ్ములు జమ చేసినట్లుగా ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో బీఎం శ్రీకర్‌ను విధుల నుంచి తొలగించారు. చింతాడ శ్రీను, టీఆర్‌ఎం రాజు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల అండదండలతో ఇప్పటికీ బ్యాంకులో కొనసాగుతున్నారు. గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కేసులో కూడా వీరిపై ఆరోపణలున్నాయి. కానీ అప్పటి పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరపకుండా గార ఎస్‌ఐగా ఉన్న కామేశ్వరరావుతో పాటు మరికొందరు పోలీసు అధికారులు ఆరోపణలున్న రీజనల్‌ మేనేజర్‌ చెప్పిన మేరకే కేసు నమోదుచే మమ అనిపించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో ఈ కేసును రీ ఇన్వెస్టిగేట్‌ చేస్తే అనేక లోపాలు బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోడానికి మాత్రం పోలీసులు ముందుకు రావడంలేదు. మొన్నటికి మొన్న బారువ ఎస్‌బీఐ బ్రాంచిలో రైతు రుణాల కుంభకోణం జరిగిందని ఒక పత్రికలో కథనం వచ్చింది. బ్యాంకు నుంచి రైతులు రుణాలు తీసుకోవడం మామూలే. దాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంటారు. ప్రభుత్వాలు కొత్తగా మారిన ప్రతీసారి రైతురుణాలు మాఫీ చేస్తామన్న హామీ మేరకు రైతుల తరఫున ఆ సొమ్మును బ్యాంకుకు ప్రభుత్వాలే చెల్లిస్తాయి. ఇక్కడ రైతుల పేరుతో ఇచ్చిన రుణాలే బినామీ కావడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసినప్పుడు అర కొర రైతులతో పాటు బ్యాంకు ఉద్యోగులు కొందరు బినామీ పేర్లతో తీసుకున్న రుణాలు కూడా మాఫీ అయిపోయాయి. ఈ విధంగా ఒక్క బారువా బ్రాంచిలోనే రూ.5 కోట్లు వరకు సొమ్ములు బ్యాంకు అధికారుల ఇంటికి వెళ్లిపోయాయని ఆరోపణలున్నాయి. దీని మీద అప్పట్లో ఫిర్యాదులు వచ్చినా తొక్కిపెట్టేశారని, తిలా పాపం తలా కొంచెం పంచుకోవడమే కారణమని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం పంపిన సొమ్ము కావడంతో దీనిమీద గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్‌ రంగంలోకి దిగి నకిలీ రుణాల పేరుతో, రుణమాఫీల పేరుతో ఏయే బ్యాంకులు ఎంతెంత నొక్కేశాయో తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గార ఎస్‌బీఐ బ్రాంచిలో బంగారు నగలు మాయమైన కేసులో తలెత్తిన 25 ప్రశ్నలకు ఇంతవరకు బ్యాంకు అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు రీజనల్‌ మేనేజర్‌గా ఉన్న టీఆర్‌ఎం రాజును ఇక్కడి నుంచి తీసుకువెళ్లి హెడ్‌ఆఫీస్‌లో కూర్చోబెట్టి జీతమిస్తున్నారు. ఆయన శిష్యులు మాత్రం ఈ జిల్లాలో అదే ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సీఐడీ ఈ కేసును కొలిక్కి తెచ్చినా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి. ఎందుకంటే.. గార బ్రాంచిలో క్యాషియర్‌గా పని చేసిన స్వప్నప్రియ ఆత్మహత్యకు కారణమైన కేసులోనే అనేకమంది పాత్ర ఉందని బ్యాంకు అధికారులకు తెలిసినా ఇంతవరకు ఆమేరకు స్పందించలేదు. స్టేట్‌బ్యాంక్‌ అంటే దేశంలోనే అతి పెద్దదని, ఇటువంటి వ్యవహారాలను పట్టించుకునే సమయం ఉండదని ఇక్కడి బీఎంలు డాంభికాలు పలుకుతుంటారు. ఒక వ్యవస్థలో లోపాలు వెలుగుచూసినప్పుడు దాన్ని సరిచేసుకోకపోతే కుప్పకూలిపోవడం ఖాయం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page