దూకాల్సిందే.. మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సిందే!
- Prasad Satyam
- Oct 8
- 1 min read
అనధికారిక డివైడర్లు
రోడ్డు దాటాల్సివస్తే ఇనుపరాడ్లు దూకాల్సిందే
అవతలి రోడ్డుకు వెళ్లడానికి పేద రోగులు అగచాట్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తడికెల మధ్య సందుంటే దూరిపోతారన్న భయం బహుశా అందరికీ ఉంటుంది. వేళ్లు చూపిస్తే మండ మింగేసేవారు ఎక్కడా ఉంటారు. పైసా ఖర్చు లేకుండా పనైపోతుందంటే అందరిదీ అదే దారి. స్థానిక సింహద్వారం నుంచి దత్తాశ్రమం వరకు ఉన్న రోడ్డుకు మధ్యలో డివైడర్ లేకపోయినా పబ్లిసిటీ కోసం ఓ సంస్థ అనధికారిక డివైడర్‌ను నిర్మించింది. పబ్లిసిటీ బోర్డులు పెట్టుకుంటామని ముందుకొచ్చిన సంస్థ.. తర్వాత తమ బోర్డులు ఎవరూ పీకేయకుండా అన్నింటికీ మధ్య ఇంటర్ లింక్‌గా ఇనుపరాడ్లతో వెల్డింగ్ చేసేసింది. దీంతో రోడ్డును దాటడానికి నడుచుకుంటూ వచ్చేవారు సైతం ఎక్కడైతే డివైడర్‌కు గ్యాప్ ఇచ్చారో అక్కడి వరకు వెళ్లాల్సి వస్తోంది. అసలే ఇక్కడ కిమ్స్, మెడికవర్‌తో పాటు అనేక మెగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చేవారు కిమ్స్ రోడ్డులో దిగుతారు. దానికి ఎదురుగా ఉన్న మెడికవర్ వైపు వెళ్లాలంటే ఇప్పుడు ఈ అనధికారిక డివైడర్‌ను ఎక్కి దూకాల్సిందే. అలాగే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినవారిన ఏదో ఒక వాహనంలో తరలించేందుకు పేద రోగులు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు వాహనాలు అనధికారిక వన్‌వే పాటించాల్సి రావడం వల్ల వీరంతా ఈసురోమంటూ ఇనుప రాడ్లు దాటుతున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగినా కూడా మళ్లీ అక్కడున్న కార్పొరేట్ ఆసుపత్రులకే లాభం. అసలు డివైడర్ మధ్య నాలుగు అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు పాతడానికి పర్మిషన్ తీసుకున్నవారు అసలు ఈ కంచెందుకు వేశారని అడిగే నాథుడు మున్సిపాలిటీలో లేడు. విజయనగరం లాంటి నగరాల్లో ఎత్తులో హోర్డింగులు పెట్టి మిరుమిట్లు గొలిపే లైట్లతో చూపరులను ఆకర్షిస్తుంటే.. మన దగ్గర మాత్రం ప్రకటన వెలుగులు పాతాళంలోకి పాతేస్తున్నారు. ఖర్చు లేకుండా పబ్లిసిటీ ఎలా పొందొచ్చో మనోళ్ల దగ్గరే నేర్చుకోవాలి.










Comments