top of page

దారిదోపిడీకి పాల్పడుతున్న రాజస్థాన్‌ ముఠా అరెస్టు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 6
  • 2 min read
  • నగదు, మారణాయుధాలు స్వాధీనం

  • నిందితులు ప్లాస్టిక్‌ బొమ్మలు అమ్మేవారు

  • ఎస్పీ కెవీ మహేశ్వరరెడ్డి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

జిల్లాలో టెక్కలి, నందిగాం, నరసన్నపేట, లావేరు తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నేషనల్‌ హైవే పరిధిలో అర్ధరాత్రి వాహనదారులను కత్తులతో బెదిరించి దోపిడీకి ప్రయత్నిస్తున్న రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేయగా, ఒక్కరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నలుగురు నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చి వివరాలను వెల్లడిరచారు. అరెస్టయిన నలుగురు నిందితులు ఆదిత్య పవార్‌, బంగారం పవార్‌, సుధీర్‌ పవార్‌, శరత్‌ షిండేను టెక్కలి జగతిమెట్ట వద్ద టెక్కలి పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల్లో సంజూ షిండేను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. వీరి నుంచి రూ.1.12 లక్షలు నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 8 సెల్‌ఫోన్లు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు, గ్రామానికే చెందిన వ్యక్తితో కలిసి అందరూ రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి మూడేళ్ల క్రితం వలస వచ్చి రణస్థలం మండలం కోస్టలో టెంట్‌లు వేసుకుని నివాసం ఉంటున్నారు. జీవనోపాధి నిమిత్తం ప్లాస్టిక్‌ బొమ్మలు తయారుచేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుంటున్నట్లు తెలిపారు. వీరంతా చెడువ్యసనాలకు బానిసలై ప్లాస్టిక్‌ బొమ్మలు విక్రయించడం వల్ల వచ్చే ఆదాయం సరిపడక తగరపువలస నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిపై అర్థరాత్రి ఆగివున్న లారీలు, ఇతర వాహనాలలో నిద్రిస్తున్న డ్రైవర్లను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, మొబైల్‌ ఫోన్లను మూడేళ్ల నుంచి దోపిడి చేస్తున్నట్టు తెలిపారు. దోపిడీ చేసిన మొబైల్‌ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు తక్కువ ధరకు విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ వచ్చారని వివరించారు. ఆరు నెలలుగా రాత్రివేళల్లో కత్తులతో ఒంటరిగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి బెదిరించి డబ్బులు, మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసి, అడ్డుకున్నవారిని కొట్టి, కత్తులు, రాళ్లతో దాడిచేసి గాయపరిచి పారిపోతున్నట్లుగా విచారణలో తేలిందని తెలిపారు. నిద్రిస్తున్న వ్యక్తుల నుంచి దోపిడీ చేస్తుండడంతో మూడేళ్లలో వీరి మీద ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. అయితే ఆరు నెలలుగా నిందితులు ఐదుగురు నిద్రిస్తున్న వారిని లేపి, కత్తులతో బెదిరించి, దోపిడీ చెయ్యడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇంటి ముందు పార్క్‌ చేసిన మోటార్‌ సైకిళ్లను దొంగతనం చేస్తూ, పలు నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి సతీష్‌కుమార్‌, స్నేహితుడు బెనర్జీ మోటార్‌ సైకిల్‌పై నందిగాంలోని కణితూరులో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా టెక్కలి మండలం విక్రంపురం బస్టాప్‌ వద్ద వర్షం కారణంగా నిలిచారన్నారు. ఆ సమయంలో నిందితులు నలుగురు కత్తులు చూపించి, డబ్బులు, మొబైల్‌ ఫోన్లు ఇవ్వమని తీవ్రంగా గాయపరిచి, గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి రూ.6 వేలు నగదు, 2 మొబైల్‌ ఫోన్స్‌ దోపిడీ చేసినట్లు తెలిపారు. వీరిచ్చిన ఫిర్యాదుతో టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసును అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ చంద్రమౌళి, సీసీఎస్‌ కె.మధుసూధనరావు, హెచ్‌సీ శ్యాం, కానిస్టేబుల్‌ బి.లోకనాధం, ఎన్‌.సంతోష్‌ కుమార్‌, డి.ఉమామహేశ్వరరావు, ఎస్‌.ప్రసాదరావు, ఎస్‌.భాస్కరరావును ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆయా డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page