top of page

దురదృష్టానికి ‘ప్రతీక’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 4
  • 3 min read
  • వరల్డ్‌కప్‌ సాధనంలో ఆమె పాత్ర అమోఘం

  • జట్టును ఫైనల్‌ చేర్చడంలో రావల్‌దే ప్రధాన పాత్ర

  • 308 పరుగులతో టాప్‌`5 బ్యాటర్లలో స్థానం

  • అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల క్లబ్బులోకి

  • కానీ గాయం కారణంగా సెమీస్‌, ఫైనల్‌కు దూరం

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేం.. అలాగే దురదృష్టం ఏవైపు నుంచి ఎలా పంజా విసిరి మన అవకాశాలను లాగేసుకుంటుందో కూడా ఊహించలేం. మహిళల వరల్డ్‌ కప్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది. ముఖ్యంగా తొలిసారి జగజ్జేతగా నిలిచి సంబరాలు జరుపుకొంటున్న భారత జట్టులోనే ఒక అదృష్టం, మరో దురదృష్టం ఉండటం విశేషం. ఈ ఛాంపియన్‌షిప్‌ లీగ్‌ దశ నుంచే అద్భుతంగా రాణిస్తూ మోస్ట్‌ ప్రామిసింగ్‌ ప్లేయర్‌గా మన్ననలు అందుకున్న జట్టు ఓపెనర్‌ ప్రతీకా రావల్‌పై గాయం రూపంలో దురదృష్టం దాడి చేసి కీలకమైన సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లలో ఆడే సువర్ణావకాశాన్ని ఆమె నుంచి లాగేసుకుంది. ఇదే మరో క్రీడాకారిణి షెఫాలీ వర్మకు అనుకోని వరంగా మారింది. డ్యాషింగ్‌ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నా స్థిరత్వం ఆటలో స్థిరత్వం లేక భారత జట్టులోనే స్థానం కోల్పోయిన షెఫాలీకి చివరి నిమిషంలో అదృష్టం తలుపు తట్టింది. ప్రతీకా తీవ్రంగా గాయపడటంతో ఆమె స్థానంలో సెమీ ఫైనల్‌, ఫైనల్‌ జట్టులో మేనేజ్‌మెంట్‌ ఆమెకు చోటు కల్పించింది. సెమీస్‌లో విఫలమైన షెఫాలీ ఫైనల్‌లో మాత్రం బ్యాట్‌తోనే కాకుండా తనకు అంతగా పట్టు లేని బాల్‌తోనూ రాణించి ఏకంగా హీరో ఆఫ్‌ ది ఫైనల్‌గా నిలిచింది. చిరస్మరణీయమైన విజయ పోరాటంలో తుదికంటా పాల్గొనలేకపోయినా, గాయం బాధ సలుపుతున్నా.. జట్టు విజయాన్ని ఆస్వాదిస్తూ గుండె ల నిండా భారతీయను నింపుకొని వీల్‌ఛైర్‌ వచ్చి విజయోత్సవాల్లో భాగస్వామి కావడం ప్రతీక క్రీడాస్ఫూర్తిని నిదర్శనం కాగా.. ఆమెకు పతకం నిరాకరించడం మాత్రం బాధాకరం. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణం వర్ధమాన క్రీడాకారులకు అనుసరణీయం.

లీగ్‌ పోటీల్లో కీలకపాత్ర

భారత మహిళల జట్టు క్రికెట్‌ విశ్వవిజేతగా ప్రకటితమైన తర్వాత మైదానంలో కనిపించిన అనేక భావోద్వేగ సన్నివేశాల్లో ఒక దృశ్యం మాత్రం ఎక్కవమందిని ఆకర్షించి ఉంటుంది. భారత జట్టు ధరించే బ్లూ డ్రెస్‌లో వీల్‌ఛైర్‌లో వచ్చిన ఒక యువతి జట్టు సభ్యులతో పోటాపోటీగా విజయోత్సాహం వ్యక్తం చేసింది. ఆమే ఇప్పుడు మనం చెప్పుకొంటున్న దురదృష్ట ప్రతీకా రావల్‌. ఆమెలో ప్రతిభకు కొదవ లేదు. బ్యాట్‌ పట్టిందంటే పరుగుల వరద పారాల్సిందే. స్వల్ప కాలంలోనే జట్టు తన స్థానం సుస్థిరం చేసుకున్న ఘనత ఆమె సొంతం. అంతేకాకుండా వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలై భారత జట్టు సెమీస్‌ అవకాశాలే డోలాయమానంలో పడిన క్లిష్ట పరిస్థితుల్లో సెంచురీతో న్యూజీల్యాండ్‌పై విజయంలో కీలకపాత్ర పోషించి ఇతర సమీకరణాలతో పని లేకుండా భారత్‌కు నేరుగా సెమీ ఫైనల్‌లో చోటు కల్పించిన ప్రతీక.. ఆ తర్వాత జరిగిన బంగ్లాదేశ్‌తో లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా డీప్‌ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా బంతిని అందుకునే క్రమంలో కాలు టర్ప్‌లో ఇరుక్కుపోయి చీలమండ(యాంకిల్‌)కు గాయమై ఆస్పత్రి పాలైంది. ఫలితంగా తర్వాత జరిగిన కీలకమైన సెమీ ఫైనల్‌, ఫైనల్‌ పోరులో జట్టుతోపాటు పాల్గొనలేకపోయింది.

దూసుకొచ్చిన యువ కెరటం

స్వల్ప కాలంలోనే భారత జట్టులో పర్మనెంట్‌ ఓపెనర్‌ హోదా పొందిన ప్రతీక జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా. ఢల్లీికి చెందిన ఈమె పదేళ్ల వయసులో బ్యాట్‌ పట్టింది. ఒకవైపు క్రికెట్‌లో రాటుదేలుతూనే మరోవైపు బోర్డు పరీక్షల్లో 92 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణురాలై.. సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేసింది. ఐదేళ్ల క్రితం క్రికెట్‌ను వృత్తిగా స్వీకరించిన ప్రతీక గత డిసెంబర్‌లోనే భారత జట్టుకు ఎంపికైంది. ఓపెనర్‌గా రాణిస్తూ 24 మ్యాచ్‌ల్లోనే 50.45 సగటుతో 1110 పరుగులు చేసి సత్తా చాటింది. ఇందులో రెండు సెంచురీలు ఉండగా అందులో ఒకటి ఈ వరల్డ్‌ కప్‌లో చేసిందే. ప్రపంచ క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌లలో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఈ వరల్డ్‌ కప్‌లో కూడా ప్రతీక అద్భుత ఆటతీరు కనబర్చింది. ఆడిన మొత్తం ఆరు లీగ్‌ పోటీల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసి టాప్‌`5 బ్యాటర్లలో స్థానం సంపాదించింది. సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లో అడి ఉంటే ఇది ఇంకా మెరుగ్గా ఉండేదేమో! అస్ట్రేలియాపై 75, సౌతాఫ్రికాపై 37 పరుగులు చేసిన ఆమె న్యూజీలాండ్‌పై సెంచురీ సాధించింది. లీగ్‌ దశలో విశాఖలో జరిగిన మూడు లీగ్‌ మ్యాచుల్లోనూ ఓటమి పాలై సెమీస్‌ అవకాశాలను భారత్‌ సంక్లిష్టం చేసుకుంది. దాంతో న్యూజీలాండ్‌తో జరిగిన లీగ్‌ పోటీల్లో గెలిస్తే తప్ప నేరుగా సెమీస్‌లో ప్రవేశించే అవకాశాలు ఉండవని, ఇతర ఫలితాలపై ఆధారపడాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రతీక ఏకంగా 122 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా సెమీస్‌ తలుపులు తెరిచిపెట్టింది. ఈ సెంచురీ వరల్డ్‌ కప్‌లో ఆమెకు మొదటిది. కానీ చివరి లీగ్‌ పోటీలో బంగ్లాదేశ్‌తో ఆడుతూ గాయపడి ఆటకు దూరమైంది.

పతకం లేకపోయినా ఉత్సాహం ఉంది

దురదృష్టవశాత్తు గాయపడి ఫైనల్‌కు దూరమైన ప్రతీక తన జట్టు విజయంపై ఉద్వేగం, ఉత్కంఠతో వీల్‌ఛైర్‌లోనే స్టేడియంలోకి వచ్చి తన సహచరులను ప్రోత్సహిస్తూ, విజయాన్ని ఆస్వాదించింది. జట్టు గెలిచిన వెంటనే సపోర్టింగ్‌ స్టాఫ్‌ సాయంతో ఆమెను కూడా వీల్‌ఛైర్‌లోనే మైదానంలోకి తీసుకురాగా.. ఆనందం ముప్పిరిగొనక తాను గాయపడిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా సహచర క్రికెటర్లతో పాటు విజయోత్సవంలో భాగస్వామి అయ్యింది. గాయపడటం, ఆటకు తాత్కాలికంగా దూరం కావడం క్రీడల్లో సహజమని ప్రతీక ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమ జట్టు ప్రపంచ కప్‌ గెలవడమే ముఖ్యమని, తన సహచరులు దాన్ని సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. భారత్‌ విజయం ముందు తన గాయం ఏమంత పెద్దది కాదని పేర్కొంది. జట్టు సహచరులు కూడా ప్రతీకను ఆలింగనం చేసుకుని ఆమెను ప్రోత్సహించారు. మొదటిసారి జగజ్జేతగా నిలిచి వరల్డ్‌ కప్‌ను ముద్దాడిన జట్టు సభ్యులుగా వ్యక్తిగత పతకాలు ఇచ్చారు. కానీ లీగ్‌ పోటీల్లో కీలకంగా వ్యవహరించిన ప్రతీకకు మాత్రం పతకం ఇవ్వకపోవడం క్రీడాభిమానులను బాధకు గురిచేసింది. దానికి బీసీసీఐ వర్గాలు ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) నిబంధనలను ఉటంకిస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం విజయం సాధించిన జట్టులోని 15 మంది సభ్యులకే వ్యక్తిగత పతకాలు బహూకరిస్తారు. వరల్డ్‌ కప్‌ ప్రధాన జట్టులో ప్రతీక ప్రధాన సభ్యురాలిగా ఉన్నప్పటికీ గాయంతో చివరి రెండు నాకౌట్‌ మ్యాచులకు గాయం కారణంగా దూరమైంది. దాంతో ఆమెను 15 మంది సభ్యుల జట్టు నుంచి తప్పించి మరో ఓపెనర్‌ షెఫాలీ వర్మను తీసుకున్నారు. ఫలితంగా ప్రతీకా రావల్‌ వ్యక్తిగత పతకాన్ని అందుకోలేకపోయింది. కానీ బీసీసీఐ వర్గాలు ఐసీసీ నిబంధనలను సడలింపజేసి పతకం ఇప్పించాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ ఛైర్మన్‌ స్థానంలో మనదేశమే ఉన్నందున అది అసాధ్యం కాదన్నది చాలామంది భావన. అయితే వ్యక్తిగత పతకం రాకపోయినా బాధపడకుండా విజయోత్సవాల్లో పాల్గొనడం ద్వారా ప్రతీక తన క్రీడాస్ఫూర్తిని, దేశంపై ప్రేమను చాటుకుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page