దువ్వాడకు డోర్స్ ఓపెన్!
- Prasad Satyam
- 3 hours ago
- 2 min read
అచ్చెన్నపై అటాకే కలిసొచ్చే అంశం
బయట ఉన్నా వైకాపా గళమే
బొత్సపై మండలిలో వ్యాఖ్యలపై స్పందించని పెద్దలు
శ్రీనివాస్ రీ ఎంట్రీకి ఇదే పెద్ద సంకేతం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
“మా నాయకుడు బొత్స సత్యనారాయణ సీనియారిటీని సైతం గుర్తించకుండా నోరు పారేసుకున్న వ్యవసాయ శాఖామంత్రికి ఆ పేరు నేనే పెట్టాను. ఇప్ప్పుడు సార్ధక నామధేయుడయ్యారు.”
.. మండలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
“అధ్యక్షా.. కౌన్సిల్‌లో మా సభ్యుడు ఏదైనా అనుచితంగా మాట్లాడుంటే దయచేసి రికార్డుల నుంచి తొలగించండి. మేమంతా ఒక్కటే. వారి తరఫున నేను కోరుతున్నాను. దయచేసి ఆ పదాన్ని విత్‌డ్రా చేయండి.”
.. శాసనమండలి వైకాపా పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ
శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్‌గా వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ తామాటి మాధవరావు ఎన్నికైన తర్వాత బుధవారం రాత్రి వైకాపా ఎమ్మెల్సీలందరితో కలిసి ఓ ఫొటో దిగారు. ఇందులో దువ్వాడ శ్రీనివాస్ కూడా కనిపించారు. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ ఒకదగ్గర పోగుచేసి చూస్తే.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను మళ్లీ వైకాపాలోకి తీసుకునే అవకాశాలున్నాయా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీను వ్యవహార శైలి కూడా అందుకు అనుగుణంగానే ఉంది. 2024 ఎన్నికల్లో దువ్వాడ ఓడిపోయిన తర్వాత జగన్ ఏరికోరి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కడం వల్ల క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీద దువ్వాడ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినప్ప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తమ సభ్యుడేనని పేర్కొనడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా వైకాపా పట్ల అదే అభిమానాన్ని, ప్రతిపక్షంపై మరింత దూకుడును పెంచారు. పార్టీ నుంచి సస్పెండైన తొలినాళ్లలో మీడియాకు మాధురితో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ప్రాముఖ్యతనిచ్చిన దువ్వాడ ఇప్ప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబంపై దూకుడును పెంచుతున్నారు. జిల్లాలో కింజరాపు కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నవారు దీన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు.
బొత్స సత్యనారాయణపైన మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల శ్రీకాకుళం వైకాపా జిల్లా అధ్యక్షుడు గాని, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు గాని ఇంతవరకు ఖండించలేదు. ఈ ఘటన జరిగి మÖడు రోజులు గడిచిపోయింది. రెడ్డి శాంతి, కిల్లి వెంకట సత్యనారాయణ, పిన్నింటి సాయి, మెంటాడ స్వరూప్, దుంపల లక్ష్మణరావు వంటి నేతలు అచ్చెన్నకు కౌంటరిచ్చారు తప్ప జిల్లా పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఇది శాసనసభ జరుగుతున్నప్ప్పుడు సాధారణమేనని ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లు భావించివుండవచ్చు. కానీ జిల్లాలో కింజరాపు, ధర్మానల మధ్య రహస్య అవగాహన నడుస్తుందని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోరు సరికదా వ్యాపారాలకు సహకరించుకుంటారన్న ముద్ర బలంగా ఉంది. ఇటువంటి సమయంలో అచ్చెన్న వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండించకపోవడం, పార్టీలో లేకపోయినా దువ్వాడ శ్రీను అచ్చెన్నను విమర్శించడం చూస్తుంటే మళ్లీ పార్టీలోకి రావడానికి ఆయనకు ఒక్కో ద్వారం తెరుచుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు పరిశీలిస్తే దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి దగ్గరవుతున్నట్లే కనిపిస్తుంది. 2025లో బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి అసెంబ్లీ రోడ్డు మీద శ్రీనివాస్ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ ఇప్ప్పుడు ఆ వాతావరణంలో మార్పు వచ్చిందని, జిల్లాలో అచ్చెన్నను కౌంటర్ చేయాలంటే దువ్వాడ శ్రీను ఉండాలనే అభిప్రాయానికి పార్టీ వచ్చినట్లు భోగట్టా. అదే సమయంలో జిల్లాలో కింజరాపు, ధర్మాన కుటుంబాల మధ్య బంధుత్వాలు పెరగడం, అధికార పార్టీ తరఫున జిల్లాకు పెద్దగా ఉన్న అచ్చెన్నాయుడును ఇంతవరకు జిల్లా వైకాపా పెద్దలు కార్నర్ చేయకపోవడం వంటి అంశాలను జగన్మోహన్‌రెడ్డి గమనిస్తున్నారన్నవారూ లేకపోలేదు. రెండేళ్ల తర్వాత జగన్మోహన్‌రెడ్డికి, ధర్మాన ప్రసాదరావుకు మధ్య సయోధ్య కుదిరింది. అయితే అది పార్టీని బలోపేతం చేయడం వరకే పని చేస్తుంది తప్ప అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే పాలిటిక్స్ జరగడంలేదన్న భావన జగన్మోహన్‌రెడ్డికి ఉంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దువ్వాడకు లైన్ క్లియరెన్స్ ఇస్తారా? లేదూ సార్వత్రిక ఎన్నికల వరకు ఆగుతారా? తెలియదు గానీ దువ్వాడ మళ్లీ వైకాపా జెండాతోనే ముందుకెళ్తారని తెలుస్తుంది.






Comments