top of page

సిక్కోలు కార్పొరేషన్.. సర్కారుకు కొరకరాని కొయ్య!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 5 hours ago
  • 2 min read
  • యాక్ట్`5 రద్దుతో ఎన్నికలకు దారి తెరిచే యత్నాలు

  • విలీన పంచాయతీలు వదిలేయాలనే కొత్త నిర్ణయం

  • అక్టోబరు గడువు ముంచుకొస్తుండటంతో పెరిగిన టెన్షన్

  • పాత మున్సిపాలిటీ 36 వార్డులను 48 డివిజన్లుగా మార్చే ఉద్దేశం

  • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరితో పాటు ఎన్నికలకు వెళ్తాం

  • మున్సిపల్ మంత్రిని కమిషనర్‌తో కలిసిన ఎమ్మెల్యే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. తాజాగా కోర్టు కేసుల్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు 23ను వదిలేసి 100 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటూ మున్సిపల్ శాఖ బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది. దీంతో శ్రీకాకుళం కార్పొరేషన్‌కు మళ్లీ ఎన్నికలు జరగవన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే నిన్నటి వరకు పాత వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం మేరకు ఏడు పంచాయతీలను కలుపుకొని కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమని చెప్పిన ప్రభుత్వం ఇప్ప్పుడు మళ్లీ U-టర్న్ తీసుకుంది.

హైకోర్టులో కేసులు ఉండటం, మరోవైపు ఇప్పటికే విలీనాన్ని సమర్ధిస్తూ చట్టం చేయడం వల్ల రెండింటిలో ఏ ముడి విప్పాలో తెలియక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కమిషనర్ శ్రవణ్‌కుమార్‌ను పట్టుకొని మున్సిపల్ మంత్రి నారాయణను బుధవారం, గురువారం వరుసగా రెండు రోజులు కలిశారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపాలని గొండు శంకర్ కోరగా, కోర్టు పరిధిలో ఉన్న కేసులు విత్‌డ్రా అయితే ఎన్నికలు నిర్వహిస్తామని నారాయణ స్పష్టం చేశారట. అయితే ఇది కోర్టు కేసుల్లో ఉన్న మున్సిపాలిటీల కంటే భిన్నమైనదని గత ప్రభుత్వం ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ చట్టం తెచ్చిందని, అయితే ఆ చట్టం మేరకు ఎన్నికలు జరపడం, లేదూ ఆ చట్టం రద్దు చేయడం మాత్రమే మన ముందున్న కర్తవ్యమని మంత్రి నారాయణకు గొండు శంకర్ వివరించడంతో పాటు ఏదో ఒకటి చేసి ఎన్నికలు నిర్వహించాలని, ఇది ఎన్నికల హామీ అని చెప్పారు. దీంతో వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం యాక్ట్`5ను రద్దు చేసుకోడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలను ఆలోచిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. యాక్ట్`5 రద్దు చేసుకుంటే.. హైకోర్టులో ఉన్న కేసులు కూడా ఆటోమాటిక్‌గా విత్‌డ్రా అయిపోతాయి. విలీనమైన ఏడు పంచాయతీలు కోరుకుంటున్నది ఇదే. ప్రభుత్వం దీన్నే హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. నిజంగా యాక్ట్`5 రద్దయిపోతే ఎన్నికలకు మార్గం సుగుమం అవుతుంది. కాకపోతే పాత 36 వార్డుల పరిధినే 48గా మార్చి ఎన్నికలకు వెళ్లాల్సి వుంటుంది. ఇవన్నీ అక్టోబరు నాటికి పూర్తవుతాయా? లేదా? అనేది వంద మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్టోబరు దాటిన తర్వాత ఎన్నికలైతే 15వ ఆర్ధిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు రావు. అందుకే ఎన్నికలు నిర్వహించాలన్నా, లేదనుకున్నా ఒక నిర్ణయం తీసుకోడానికి కేవలం 48 గంటల వ్యవధే ఉంది. ఈలోగా యాక్ట్`5 రద్దు చేస్తే శ్రీకాకుళంలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, 50 డివిజన్లను 48గా కుదించడం వంటి పనులు ఆగమేఘాల మీద చేయాలి. ఇవన్నీ జరిగే పనులా? కావా? అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది. ఇంతవరకు శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల మీద మున్సిపల్ శాఖ ఏమాత్రం అవగాహన తెచ్చుకోలేదు. కోర్టు కేసుల్లో ఉన్న మిగిలిన మున్సిపాలిటీలకు, శ్రీకాకుళానికి మధ్య తేడాను మంత్రి నారాయణ ఏరోజూ గ్రహించలేదు. ఇప్ప్పుడు తీరా మున్సిపల్ ఎన్నికలకు జీవో వచ్చిన తర్వాత అందరితో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం కావాల్సిరావడం తలకు మించిన భారంగా మారింది.

9 మున్సిపాలిటీలకు లైన్ క్లియర్.. త్వరలో సిక్కోలు వస్తున్న కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా 23 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో పెండింగుల్లో ఉన్నాయి. వీటిని వదిలేసి 100 మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం బుధవారం సాయంత్రం జీవో ఇచ్చింది. అయితే అంతకు ముందే కోర్టులో ఉన్న కేసులను విత్‌డ్రా చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒక కమిటీని నియమించింది. 9 మున్సిపాలిటీల్లో పర్యటించిన ఈ కమిటీ వారిని ఒప్పించింది. ఇక్కడ ఎన్నికలకు మార్గం సుగుమం అయింది. అదే జోష్‌లో త్వరలో కమిటీ శ్రీకాకుళం జిల్లాకు రానుంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. ఈ రెండింటిపైన సంబంధిత పిటిషనర్లతో మాట్లాడేందుకు కమిటీ వస్తుంది. మరోవైపు యాక్ట్`5 రద్దు కోసం గురువారం మంత్రి నారాయణ ముఖ్యమంత్రి టీమ్‌తో చర్చించనున్నారు. ఈ రెండింటిలో ఏది సఫలీకృతమైనా ప్రభుత్వం ఈ 23 మున్సిపాలిటీలను కలుపుతూ మరో జీవో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. 15వ ఆర్ధిక సంఘం నిధులు రాకపోతే స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు చేయడం కష్టం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకే అప్ప్పుల కోసం వెళ్తోంది. ఇప్ప్పుడు అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోతే 2029 ఎన్నికలు అధికార పార్టీకి కష్టమవుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page