‘దేశానికి’ దారి చూపిన పార్టీ
- Guest Writer
- 4 days ago
- 4 min read

తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయింది. ఇది తెలుగునాడులో ఉండటం వల్ల ప్రాంతీయ పార్టీగా కనిపిస్తుంది తప్ప, సమకాలీన ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ ఇది. కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ దేశానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిన పార్టీ.
నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం (1988):
1988లో మద్రాసు (చెన్నై) వేదికగా నేషనల్ ఫ్రంట్ అధికారికంగా ఏర్పాటైంది. ఇందులో జనతాదళ్, టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్ వంటి పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చైర్మన్‌గా వ్యవహరించారు. వీపీ సింగ్ కన్వీనర్‌గా ఉన్న ఈ ఫ్రంట్‌లో ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అవడం కూడా మనకు తెలుసు. అంటే.. ఒక ప్రాంతీయ పార్టీ దేశానికి ప్రధానిని అందించిందన్నమాట. అప్పటి వరకు విడివిడిగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎన్టీఆర్ దేశవ్యాప్త పర్యటనలు చేశారు. 1987లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిపక్షాల భారీ బహిరంగ సభ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు బలమైన పునాది వేసింది. ‘ఢిల్లీ కోటలు బద్దలు కొట్టాలి’ అనే నినాదంతో ప్రాంతీయ ఆకాంక్షలకు జాతీయ వేదికను కల్పించారు. 1989 సాధారణ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ విజయభేరి మోగించింది. బీజేపీ, వామపక్షాల బయటి మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వ హయాంలోనే మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆమోదం లభించింది, ఇది బీసీల రిజర్వేషన్ల చరిత్రలో ఒక కీలక మలుపు.
నేషనల్ ఫ్రంట్ విజయం తర్వాతే భారతదేశంలో ‘ఏక పార్టీ పాలన’ ముగిసి, ‘కూటమి రాజకీయాల’ యుగం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం ఢిల్లీలోని పార్టీలు మాత్రమే కాదని, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం కూడా ఉండాలని నిరూపించారు. 1988లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ పోషించిన పాత్ర, నేడు మనం చూస్తున్న కూటమి రాజకీయాలకు (ఎన్డీయే/ ఇండియా) ఆది గురువు వంటిది. సామాజిక న్యాయం, ప్రాంతీయ ఆత్మగౌరవమే అజెండాగా సాగిన ఆ ప్రయాణం తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో శాశ్వత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
మండల్ కమిషన్ అమలు - సామాజిక విప్లవం
1990 ఆగస్టులో వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను ఆమోదించడం ద్వారా వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అప్పటి వరకు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైన కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు, మొదటిసారిగా బీసీలకు అందుబాటులోకి వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా బీసీల్లో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని నింపింది.
రైతు రుణాల మాఫీ (1990) - ఆర్థిక ఊరట
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ‘కృషి రుణ ముక్తి’ (అగ్రికల్చర్ డీఈబీటీ రిలీఫ్ స్కీమ్). దేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు రైతు రుణాలను మాఫీ చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే కేంద్రంలో ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేసేలా ఒత్తిడి తెచ్చారు. దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. అవినీతి నిర్మూలన కోసం లోక్‌పాల్ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ 44 ఏళ్లలో ఎన్టీఆర్ హయాంలో కిలో బియ్యం రూ.2, జనతా వస్త్రాలు, పక్కా గహాలు, మహిళలకు రాజకీయ హక్కు, మండల వ్యవస్థ వంటి సంక్షేమం దిశగా సాగితే, చంద్రబాబు జమానా అభివద్ధి దిశగా దూసుకుపోయింది. ఇప్ప్పుడు కూటమి పాలనలో అభివద్ధి, సంక్షేమం రెండూ జోడుగుర్రాల్లా నడుస్తున్నాయి.
యునైటెడ్ ఫ్రంట్‌లో తెలుగుదేశం పార్టీ, ప్రాంతీయ పార్టీలు పోషించిన పాత్ర భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టం. 1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కింజరాపు ఎర్రన్నాయుడుకి కేంద్ర మంత్రి పదవి లభించడం వెనుకబడిన తరగతుల రాజకీయ ఎదుగుదలలో ఒక చారిత్రక ఘట్టం.
అతి పిన్న వయస్కుడైన కేంద్రమంత్రి:
ఎర్రన్నాయుడు 1996లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రులలో ఒకరిగా నిలిచారు. అత్యంత కీలకమైన గ్రామీణాభివృద్ధి, ఉపాధి శాఖ కేటాయించబడింది. భారతదేశం వంటి దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ శాఖ పాత్ర చాలా కీలకం.
కేంద్రమంత్రిగానే కాకుండా, తర్వాతి కాలంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన లోక్‌సభలో వినిపించిన గళం, చర్చల్లో ఆయన ప్రదర్శించిన పరిణితి అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఎన్టీఆర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా నారా చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర చారిత్రాత్మకం. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడటమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వెనుకబడిన, దళిత వర్గాల నేతలకు పెద్దపీట వేయాలని ఆయన పట్టుబట్టారు. దీనివల్ల ఢిల్లీ రాజకీయాల్లో ‘అగ్రవర్ణ ఆధిపత్యం’ పోయి, బహుజన నాయకత్వానికి గుర్తింపు లభించింది
1999 నుంచి 2004 వరకు భారత రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. ఈ కాలాన్ని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స’ యుగంగా పేర్కొంటారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రభుత్వానికి టీడీపీ వెలుపల నుంచి మద్దతు ఇస్తూనే, దేశ గమనాన్ని మార్చిన అనేక నిర్ణయాల్లో భాగస్వామి అయింది.
కింగ్ మేకర్‌గా మారిన పార్టీ
1999 ఎన్నికల్లో టీడీపీ 29 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని, ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా నిలిచింది. ప్రతి కీలక నిర్ణయంలోనూ చంద్రబాబు నాయుడి సలహాలు, సూచనలు వాజ్‌పేయికి ఎంతో కీలకంగా ఉండేవి. 1998లో ప్రారంభమైన జి.ఎం.సి.బాలయోగి ప్రస్థానం 1999లో కూడా కొనసాగింది. ఒక దళిత నాయకుడిని వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేయడంలో టీడీపీ విజయం సాధించింది.
అప్పటి ప్రధాని వాజ్‌పేయి చంద్రబాబు నాయుడిని ‘నేషనల్ ఐటీ టాస్క్ ఫోర్స’కు కో-చైర్మన్‌గా నియమించారు. దీనివల్లే నేడు మనం చూస్తున్న సాఫ్ట్‌వేర్ విప్లవానికి పునాది పడింది. మొబైల్ ఫోన్ టారిఫ్‌లు తగ్గించడం, ఇంటర్నెట్ వ్యాప్తి వంటి విషయాల్లో టీడీపీ ఒత్తిడి కేంద్రంపై సానుకూల ప్రభావం చూపింది.
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ
కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు, ప్రాజెక్టులు తీసుకురాగలిగింది. రాష్ట్రానికి అదనపు బియ్యం కోటా (ముఖ్యంగా కరువు సమయాల్లో ‘పనికి ఆహార పథకం’ కింద) సాధించడంలో టీడీపీ సఫలమైంది. పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి నుంచి ఇప్ప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ వరకు తెలుగుదేశం కేంద్రంలో చాలామందిని మంత్రులను చేసింది. కానీ ఇందులో కింజరాపు రామ్మోహన్‌నాయుడిది మరోచరిత్ర. శ్రీకాకుళం గడ్డ నుంచి వరుసగా మూడవసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయసులోనే కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అశోక్ గజపతి రాజు గతంలో నిర్వహించిన అదే శాఖను ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చేపట్టడం విశేషం. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయడం, విమాన ప్రయాణాలను సామాన్యులకు మరింత చేరువ చేయడం ఆయన ప్రధాన లక్ష్యాలు. రైల్వేజోన్, రాజధాని అమరావతి నిధులు, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై కేంద్రంతో సంప్రదింపులు జరపడానికి కేంద్రంలో ఉన్న టీడీపీ ఎంపీల బృందం ఒక గట్టి కవచంలా పనిచేస్తోంది. ప్రస్తుత 18వ లోక్‌సభ, రాజ్యసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 18 మంది పార్లమెంటు సభ్యులు (16G2) ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక బలమైన గొంతుకగా నిలుస్తున్నారు.
పార్లమెంటరీ పార్టీ నాయకత్వం
లావు శ్రీకృష్ణ దేవరాయలు నాయకత్వంలో టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం తగ్గకుండా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలోనూ పార్టీ సభ్యులు కీలక బిల్లులపై చర్చల్లో పాల్గొంటూ, రాష్ట్రానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ 18 మంది సభ్యులు కేంద్రంలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉండటం వల్ల, గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మాట వినబడుతోంది. ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను పట్టుబట్టి తెచ్చుకునే ఒక ‘వ్యూహాత్మక బృందం అనే చెప్పాలి. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, ప్రాంతీయ ఆత్మగౌరవమే ఊపిరిగా తెలుగుదేశం పార్టీ తన 44 ఏళ్ల ప్రస్థానాన్ని జైత్రయాత్రగా కొనసాగిస్తోంది.
-నౌపడ సత్యనారాయణ,
కార్యాలయ కార్యదర్శి,
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ,
భారత పార్లమెంటు భవన్






Comments