దూసి రోడ్డు.. నరకానికి బోర్డు
- BAGADI NARAYANARAO

- Jul 3
- 1 min read
అధ్వానంగా పల్లె రోడ్డులు
కష్టసాధ్యంగా మారిన ప్రయాణం
ఈసురోమంటు రాకపోకలు
ఇసుక వాహనాలే కారణమంటున్న ప్రజలు
అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి
పట్టించుకొని ప్రజాప్రతినిధులు

(సత్యంన్యూస్, ఆమదాలవలస)
సుమారు 11 గ్రామాలను కలుపుతున్న ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని కొత్తవలస నుంచి రాగోలు వద్ద పాలకొండ`శ్రీకాకుళం రోడ్డులో కలిసే దూసి అడ్డురోడ్డు వరకు సుమారు 12 కిలోమీటర్లు పొడవున ఉన్న రోడ్డు గోతులు, మురుగుతో అధ్వానంగా తయారైంది. పది రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు రోడ్డుపై రాకపోకలు సాగించలేక 11 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక తరలించే భారీ వాహనాల రాకపోకలతో రేయింబవళ్లు నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై సాధారణ వాహనాల రాకపోకలు కష్టసాధ్యంగా మారింది. కొత్తవలస, నారిపేట, ఇసుకలపేట, దిబ్బలపేట, తొగరాం, కలివరం, ముద్దాడపేట, పీర్‌సాహెబ్‌పేట, దూసిపేట, దూసి, బావాజీపేట గ్రామాల మీదుగా వెళుతున్న ఆర్ అండ్ బి రోడ్డు దశాబ్ధ కాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సుమారు 17వేలు జనాభా కలిగివున్న 11 గ్రామాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెపండగ పేరుతో రోడ్ల మరమ్మతులకు నోచుకుంటాయని గ్రామస్తులు ఆశించినా నిరాశ తప్పలేదు. కొత్తవలస, ముద్దాడపేట ఇసుక రీచ్‌ల నుంచి రోజూ వందలాది వాహనాలు అధిక లోడ్‌తో రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు శిథిలమైందని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలతో రోడ్డు గుంతలుగా మారిపోయి నీరు, బురద చేరింది. దీంతో అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, ఆటోల్లో ప్రయాణం నరకయాతనగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొగరాం నుంచి రాకపోకలు చేయడానికి అవకాశం లేనంతగా రోడ్డు పాడైందని చెబుతున్నారు. ఇటీవల కురుస్తున్న తేలికపాటి వర్షాలకు 12 కిలోమీటర్లు మేర రోడ్లు పూర్తిగా బురదతో నిండిపోవడం పట్ల ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూసి రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రాకపోకలు సాగించడానికి వీలుగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు చొరవ చూపించాలని స్థానికులు కోరుతున్నారు.











Comments