దశాబ్దాల దుస్థితికి టాటా.. రాళ్లపేటకు రాచబాట
- Prasad Satyam
- Jan 27
- 3 min read
ఏడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర
హామీ నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే శంకర్
సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం
ఉపాధి హామీ నిధులతో శరవేగంగా పనులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సాధారణంగా మనం వాడుకలో పిలుస్తున్న ప్రతి ఊరి పేరు వెనుక ఓ కథ ఉంటుంది. చిక్కాకోల్ నుంచి సిక్కోలై.. ఆ తర్వాత శ్రీకాకుళం అయినట్టు ఎలా చెప్ప్పుకున్నామో.. అదేవిధంగా ప్రతి గ్రామం పేరు వెనుక ఓ కథ ఉంటుంది. అందులోనూ ఉత్తరాంధ్ర గ్రామాలకు అక్కడ పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడ్డాయని ప్రముఖ నామశాస్త్రవేత్త వాండ్రంగి కొండలరావు రచించిన ‘ఊరు`పేరు’ పుస్తకం చదివితే అర్థమవుతుంది. సరిగ్గా ఇటువంటిదే గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని రాళ్లపేట గ్రామం కథ. కథ అనేకంటే దీనగాథ అంటే బాగుంటుంది. రాళ్లపేట అనగానే మీకు ఈపాటికే అర్థమయ్యుంటుంది.. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా రాళ్లు, రప్పలు తప్ప మరేమీ ఉండదని.. అందుకే ఆ పేరు పెట్టివుంటారని! అవును.. మీ అంచనా సరైనదే. శ్రీకూర్మనాధుని పుణ్యక్షేత్రం ఉన్న శ్రీకూర్మం గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉన్న రాళ్లపేటకు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి రోడ్డు సౌకర్యం లేదంటే నమ్మలేం. కానీ నమ్మితీరాల్సిందే. దీనికి దగ్గరలో ఉన్న దీపావళి అనే గ్రామం వరకు, మరోవైపు మెండపేట జంక్షన్ వరకు శ్రీకాకుళంతో కనెక్టివిటీ ఉంది. కానీ అక్కడి నుంచి రాళ్లపేట గ్రామానికి మాత్రం ఇంతవరకు రోడ్డు వేయలేదు. 200 గడప మాత్రమే ఉన్న ఊరికి రోడ్డేమిటనుకున్నారో ఏమో గానీ.. స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారినా రాళ్లపేటకు రోడ్డు సౌకర్యం మాత్రం సమకూరలేదు. ఏ ప్రభుత్వమూ.. ఏ ప్రజాప్రతినిదీ ఆ ఆలోచనే చేయలేదు. గత ప్రభుత్వం జగనన్న ఊళ్లు అనే కాన్సెప్ట్‌ను తెర మీదకు తెచ్చి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద రాళ్లపేటకు దగ్గర్లోనే 600 మందికి ఇళ్లు నిర్మించుకోడానికి పట్టాలిచ్చింది. కానీ ఆ కాలనీకి రోడ్డు వేయాలన్న ఆలోచన మాత్రం చేయలేదు. అర్బన్ ఏరియాలో భూమి ఇవ్వడానికి రైతులెవరూ ముందుకు రాకపోవడంతో రాళ్లపేటలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న అప్పటి కలెక్టర్ అక్కడ భూసేకరణ జరిపి పట్టాలు మంజూరు చేశారు. కానీ మెండపేట, శ్రీకూర్మం, దీపావళి ఊళ్ల వరకే రోడ్డు సౌకర్యం ఉండటంతో ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రాలేదు.
హామీ నిలుబెట్టుకునేందుకు తంటాలు
ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల ప్రచారానికి రాళ్లపేటకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అక్కడి సమస్య తెలుసుకుని టీడీపీకి ఓట్లు వస్తే, తాను గెలిచాక రహదారి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దాని ఫలితమో.. కూటమి వేవో.. పక్కన పెడితే రాళ్లపేటలో ఆయనకు ఫుల్ మెజార్టీ వచ్చింది. దాంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామానికి రోడ్డేయాల్సిన బాధ్యత శంకర్‌పై పడింది. కానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఎనఆరఈజీఎస్ ద్వారా మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ పనులు చేపట్టాలని చాలామందిని కోరారు. అయితే అప్పటికే జిల్లాలో అనేకమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎనఆరఈజీఎస్ కిందే అనేక పనులు మంజూరు చేయించుకోవడం వల్ల జిల్లాలో ఏడాది కోటా మించిపోయి 250 శాతం అధిక పనులకు అధికారులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేశారు. అయినాసరే ఏదోవిధంగా రాళ్లపేట రోడ్డు నిర్మాణానికి ఎనఆరఈజీఎస్ నిధులు వెచ్చించేందుకుఅనుమతులు తెచ్చుకున్న ఎమ్మెల్యే శంకర్ కాంట్రాక్టర్ల రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. రాళ్లపేట పనులవైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఎంతమందిని బతిమాలినా కనికరించలేదు. ఎందుకంటే.. అప్పటికే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎనఆరఈజీఎస్ నిధులను పక్కదోవ పట్టించడం వల్ల గత కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పరిమితికి మించి పనులు చేపట్టడం వల్ల బిల్లుల చెల్లింపునకు సంవత్సరాలు పట్టేస్తాయన్న కారణంతో కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు.
ఎట్టకేలకు పనులు ప్రారంభం
కానీ రాళ్లపేట రోడ్డును పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగిన ఎమ్మెల్యే శంకర్ తనతో పాటు ఉన్న ఓ టీడీపీ నాయకుడ్ని పిలిచి బిల్లులు కచ్చితంగా వచ్చేటట్టు చూస్తానని, కొద్దిగా ఆలస్యమైనా మదుపుల కోసం ఆలోచించకుండా పనులు చేపట్టాలని కోరడంతో ఎట్టకేలకు రాళ్లపేట రోడ్డు పనులు కొద్ది నెలల క్రితం మొదలయ్యాయి. మరికొద్ది నెలల్లో రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. రూ.1.30 కోట్ల ఉపాధిహామీ నిధులతో మెండపేట జంక్షన్ నుంచి రాళ్లపేట వరకు 800 మీటర్ల రోడ్డు, రాళ్లపేట ఊరిలో 500 మీటర్లు, జగనన్న కాలనీ నుంచి శ్రీకూర్మం వైపు మరో 800 మీటర్ల రోడ్డు, మెండపేట ఊరిలో 200 మీటర్ల రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో అటు శ్రీకూర్మం నుంచి గానీ, ఇటు దీపావళి వైపు నుంచి గానీ, మెండపేట జంక్షన్ నుంచి గానీ రాళ్లపేటకు వెళ్లడం సులభతరమవుతుంది. దీపావళి జంక్షన్ నుంచి జగనన్న కాలనీ జంక్షన్ వరకు రోడ్డు పూర్తయితే ఒకవైపు శ్రీకూర్మం, మరోవైపు దీపావళి వెళ్లడానికి మార్గం ఏర్పడినట్టే. రోడ్డు సౌకర్యం సమకూరుతుండటం వల్ల జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోడానికి లబ్ధిదారులు ముందుకు రావచ్చు. ఉపాధిహామీ నిధులు మంజూరు చేయించుకోవడం రాజకీయ నాయకులకు ఎంత సులువో తెలియదు గానీ, ఈ పనులు పూర్తిచేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం అభ్యంతరాల నుంచి తప్పించుకోవడం కాంట్రాక్టర్లకు అంత కష్టం. ఉపాధిహామీ పనులంటే వారు భయపడిపోయేది అందుకే. దీనికి తోడు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పేరు మార్చి వీబీ జీ రామ్ జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప్పుడు 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఖర్చు భరించిన రోజుల్లోనే బిల్లుల చెల్లింపునకు సవాలక్ష అడ్డంకులు ఉండేవి. అటువంటిది 40 శాతం చెల్లించాలంటే ఏ మేరకు నిధులు విడుదలవుతాయో చెప్పలేం. అయినా కూడా తెగించి ఈ రోడ్డు వేస్తున్నందుకు, ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నందుకు ఎమ్మెల్యేను అభినందించాల్సిందే.










Comments