top of page

ధనస్వామ్యంలో.. దారితప్పుతున్న దండ నీతి

  • Guest Writer
  • Sep 11, 2025
  • 3 min read
  • మన దేశంలో క్రమశిక్షణ పేరుతో భౌతిక శిక్షలు

  • పోటీ యుగంలో పెరుగుతున్న మానసిక హింస

  • అదే విదేశాల్లో హక్కులకే అమిత ప్రాధాన్యం

  • వాటిని ఉల్లంఘించే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులే


(జిందగీ రమేష్‌)

- ‘రెండో తరగతి విద్యార్థినితో వంద గుంజీలు తీయించిన టీచర్‌.. పాపకు తీవ్ర అస్వస్థత’

- ‘దేశం చెప్పినా పాపను ఇవ్వట్లేదు’

.. ఈమధ్య కాలంలో ప్రముఖ పత్రికల్లో వచ్చిన రెండు వార్తల శీర్షికలు ఇవి. పిల్లల పెంపకంలో.. చెప్పినట్లు వినేలా చేయడంలో.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక అంతరాలు ఉన్నట్లే భావ వైరుధ్యాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని ఈ రెండు వార్తలు సూచిస్తున్నాయి.

క్రమశిక్షణో లేదా చదువులో వెనుకబడ్డారనో విద్యార్థులను తల్లిదండ్రులు, టీచర్లు భౌతికంగా దండిరచడం ఒక కామన్‌ ఫ్యాక్టర్‌గా మారిపోయింది. అదే విదేశాల్లో అయితే భౌతిక దండనను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. శిక్షలు విధిస్తారు. కారణం ఏదైనా.. పిల్లలపై దండనీతి ప్రయోగించడం మన దేశంలోనూ శిక్షార్హమైనా.. దాని ఆచరణలోనే వైఫల్యం కనిపిస్తోంది. బాలలపై హింసకు దారితీస్తోంది.

ఇక్కడ పెద్దలదే పెత్తనం

తన అనుమతి లేకుండా టాయిలెట్‌కు వెళ్లిందనే కారణంతో చత్తీస్‌గఢ్‌లో ఓ రెండేళ్ల బాలికతో అక్కడి టీచర్‌ వంద గుంజీలు తీయించారు. ఆ శిక్ష సరిపోలేదన్నట్లు కర్రతో కొట్టారు కూడా. దాంతో కాలి కండరాలు దెబ్బతిని బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు టీచర్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే చాలా పాఠశాలల్లో ఇప్పటికీ భౌతిక హింస జరుగుతునే ఉంది. కార్పొరేట్‌ కళాశాలలు, స్కూళ్లలో విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదే దుస్సంప్రదాయం ఇప్పటికీ ఉంది. అన్నింటికీ మించి బాలల మీద లైంగిక హింస గురించి అసలు చెప్పక్కర్లేదు. కానీ ఒకటి రెండు కేసులు మాత్రమే వెలుగులోకి వస్తుండటం విచారకరం. తమపై జరిగే శారీరక, మానసిక హింసను పిల్లలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా.. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉండే తల్లిదండ్రులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ముప్పై ఏళ్ల కిందట పరిస్థితి వేరు. పిల్లలను సరైన దారిలో పెట్టడానికి వారిని కొట్టినా ఫర్వాలేదని తల్లిదండ్రులు భావించేవారు. ఉపాధ్యాయులకు అదే చెప్పేవారు. కానీ పరిస్థితులు, చట్టాలు ఇప్పుడు మారాయి. మరో దారుణమైన విషయమేమిటంటే.. మన దేశంలో బాలలపై శారీరక హింస కంటే మానసిక హింస చాలా ఎక్కువగా ఉంటోంది. కార్పొరేట్‌ స్కూళ్లలో జాయిన్‌ చేయడం.. ర్యాంకులు, ఐఐటీ సీట్లు తెచ్చుకోమని పిల్లలను తీవ్ర ఒత్తిడికి గురి చేయడం ఇప్పుడు సర్వసాధారణం. ఐటీ సృష్టించిన ‘ధనిక’ ప్రపంచాన్ని అందరూ కోరుకుంటుండటమే ఈ పరిస్థితికి కారణం. ఆ యజ్ఞంలో చాలామంది పిల్లలు సమిధలవుతున్నారు.

అక్కడ హక్కులకే ప్రాధాన్యం

విదేశాల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంటుంది. అక్కడ పిల్లలను అపురూపంగా చూస్తారు. (మనకీ అపురూపమే.. కానీ మధ్యతరగతికి పిల్లలే ప్రధాన ఆదాయ వనరు. లేదంటే ఇతరులతో పోటీపడటం పిల్లలు ఎదుర్కొంటున్న మరో సమస్య). వాళ్ల హక్కులకు పెద్దపీట వేస్తారు. పిల్లలను కొట్టే తల్లిదండ్రులనూ శిక్షిస్తారు. ఇదే రీతిలో తెలుగు రాష్ట్రం నుంచి నార్వేకు వెళ్లిన ఓ జంటపై అక్కడ కేసు నమోదైంది. తమ ఏడేళ్ల కొడుకును చెప్పుతో కొట్టారని.. పక్క తడిపితే ఇండియాకు పంపేస్తామని బెదిరించారనే అభియోగాలతో తండ్రికి 18 నెలలు, తల్లికి 15 నెలలు జైలుశిక్ష వేశారు. మరో కేసులో జర్మనీ ప్రభుత్వం ఏకంగా బిడ్డను స్వాధీనం చేసుకుని తమ సంరక్షణలో ఉంచుకుంది. ఇది భారత్‌, జర్మనీ మధ్య ద్వైపాక్షిక వివాదంగా మారింది. దౌత్యమార్గాలో ఏడాదిన్నరగా సంప్రదింపులు జరుగుతున్నా బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంలేదు. బాలల హక్కుల విషయంలో దేశాల దృక్పథంలో మార్పునకు ఇది సంకేతంగా నిలుస్తోంది. బెర్లిన్‌లో నివాసముంటున్న ఒక గుజరాతీ కుటుంబానికి చెందిన బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదానికి గురైంది. ఆ చిన్నారి మర్మాంగం పక్కనే గాయమైంది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. లైంగిక దాడికి గురైందేమోనన్న అనుమానంతో కేసు నమోదు చేశారు. విచారణ ముగిసేవరకు బాలికను తల్లిదండ్రుల వద్ద కాకుండా ప్రభుత్వ సంరక్షణలో ఉంచారు. ఆ పాపను తీసుకురావడానికి ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ స్థాయిలో పయత్నిస్తున్నా ఆ దేశం ససేమిరా అంటోంది. ప్రస్తుతానికి నెలకోసారి మాత్రమే తల్లిదండ్రులు వెళ్లి పాపను చూసే అవకాశం కల్పిస్తున్నారు. కేసు విచారణలో తల్లిదండ్రుల మీద అభియోగాలు రుజువైతే ఆ పాప శాశ్వతంగా బెర్లిన్‌లోనే ఉండిపోతుంది. తల్లిదండ్రులు ఉన్నా ప్రభుత్వ దృష్టిలో అనాధగానే మిగిలిపోతుంది. ఈ ఉదంతంలో కేవలం ఆరోపణతోనే బిడ్డను తల్లిదండ్రుల నుంచి విడదీయడం అమానుషంగా కనిపించవచ్చు గానీ.. బాలికపై లైంగిక దాడి జరిగిందేమోనన్న అనుమానంపైనా జర్మనీ ఎంత తీవ్రంగా ఆలోచించి, చర్యలు తీసుకుంటుందన్నది అవగతమవుతుంది. బాలల హక్కుల పరిరక్షణపై ఆ దేశానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో స్పష్టమవుతోంది.

అమలుకాని బాలల చట్టాలు

మన దేశంలో కూడా కఠినమైన చట్టాలున్నాయి. కానీ వాటిని ఆచరించే పరిస్థితే లేదు. పిల్లలపై భౌతిక దాడికి పాల్పడినట్లు రుజువైతే తల్లిదండ్రులకు మూడేళ్లు జైలుశిక్ష విధించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం పిల్లలు చేయరు. ఒకవేళ చేసినా పోలీసులు, వ్యవస్థ ఆ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోరు. తల్లిదండ్రులు కూడా పిల్లలను సెంటిమెంట్‌తో కొడతారు. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. పెద్దలతో పాటు పిల్లలకు కూడా చట్టాలు తెలియాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు ఎత్తిచూపుతున్నాయి. అలా జరిగితే ఇష్టం లేని చదువు చదవలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను నివారించవచ్చేమో.!

కొసమెరుపు

నాకు తెలిసిన ఓ వ్యక్తి పిల్లల పెంపకంపై, పిల్లల పెంపకంలో మనకూ విదేశాలకూ మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రస్తావించారు. కానీ వాళ్లబ్బాయి అల్లరి చేస్తున్నాడని వీపు మీద రెండు దెబ్బలు వేశారు. ఎందుకలా అని అడిగితే.. ‘మరి ఏం చేయలేం’ అని సమాధానమిచ్చాడు. ఇలా ఉంటుంది. మన వైఖరి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page